ప‌రిపూర్ణానంద వీడియో వైర‌ల్‌..బీజేపీలో క‌ల‌క‌లం

Update: 2018-11-05 11:03 GMT
తెలంగాణ బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్‌ గా వార్త‌ల్లో నిలుస్తున్న‌ పరిపూర్ణానందస్వామి ఊహించ‌ని రీతిలో వివాదంలో చిక్కుకున్నారు. ఓట్ల విష‌యంలో ప్రజలను అవమానపరిచేలా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రూ.200 ఇస్తే చాలు జనాలు ఎగబడి మీటింగులకు వస్తారు - ఓట్లు వేస్తారని ఆయ‌న వ్యాఖ్యానించిన వీడియో పెద్ద ఎత్తున వైర‌ల్ అవుతోంది.  ఇటీవలే బీజేపీలో చేరిన పరిపూర్ణానందస్వామి చౌటుప్పల్ నియోజకవర్గంలో శనివారం నిర్వహించిన రోడ్‌ షోలో పాల్గొన్నారు. ఆయన వాహనంపై ఉండి అనుచరుడికి ఈ విషయాలు వివరించారు.

పరిపూర్ణానందస్వామికి మ‌ద్ద‌తుగా నిలిచే ఓ చానల్‌ లో ఈ మాట‌లు ప్రసారం కూడా అయ్యాయని పేర్కొంటూ ఓ వీడియో వైర‌ల్‌ గా మారింది. ``వస్తే 200 ఇవ్వాలి.. లేకుంటే రారు.. డబ్బులు ఇక్కడివాళ్లు ఇవ్వరు.. మనమే ఇవ్వాలి.. 20 వేల ఓట్లు వస్తే చాలు.. 200 చొప్పున ఇస్తే 20 వేల ఓట్లు తప్పకుండా వస్తాయి`` అని అన్నారు. డబ్బులు ఇవ్వాలని - 20 వేల ఓట్లు వస్తే సరిపోతుందన్న ఆయన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. పరిపూర్ణానంద వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలే తలలుపట్టుకుంటున్నారు. బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్ పరిపూర్ణానంద ఆదిలోనే త‌మ‌ను ఇర‌కాటంలో ప‌డేశార‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.
Tags:    

Similar News