పరిటాల శ్రీరామ్ సంచలనం టికెట్ ఇవ్వకుంటే రాజకీయ సన్యాసం

Update: 2021-12-19 05:04 GMT
సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ యువ నేత పరిటాల శ్రీరామ్. అనంతపురం జిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆయన.. తాజాగా ఒక  సభలో మాట్లాడుతూ ఊహించని రీతిలో మాట్లాడారు. గత ఎన్నికల్లో రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శ్రీరామ్ ఓటమిపాలు కావటం తెలిసిందే. జగన్ గాలికి నిలవలేకున్నా.. తమ కుటుంబానికి ఉన్న పరిపతితో రాజకీయం చేస్తున్న ఆయన.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలన్న కసితో ఉన్నారు. గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి ఆయన ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న పట్టుదలతో ఉన్నారు.

ప్రస్తుతం ధర్మవరం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా ఉన్న ఆయన.. తరచూ పార్టీ కార్యక్రమాల్ని నిర్వహిస్తూ.. కార్యకర్తులు.. ప్రజలు.. నాయకులతో మమేకం అవుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ధర్మవరం పట్టణంలో జరిగిన గౌరవ సభ - ప్రజా సమస్యల చర్చా వేదిక కార్యక్రమానికి హాజరైన పరిటాల శ్రీరాం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'కొంత మంది మీటింగులు పెట్టి మన గురించి మాట్లాడుతున్నారు. మనం వారి గురించి మాట్లాడిల్సిన పనిలేదు. వస్తే కండువా వేస్తాం.. కష్టపడితే పదవి ఇప్పిస్తాం.. కాదని ధర్మవరం టికెట్ తెచ్చుకుంటే నా రాజకీయాలు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నా..' అంటూ కామెంట్స్ చేశారు.

దీంతో.. వచ్చే ఎన్నికల్లో ధర్మవరం నుంచి పరిటాల శ్రీరామ్ పోటీ చేయటం ఖాయమని తేలిపోయింది. చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు లోకేశ్ తోనూ సన్నిహిత సంబంధాలు ఉన్న  నేపథ్యంలో ఆయన మాట కాదని వేరే వారికి టికెట్ ఇచ్చే అవకాశం లేదు. ఒకవేళ టికెట్ వేరే వారికి ఇస్తే.. ఏం జరుగుతుందో కూడా తేల్చేసిన నేపథ్యంలో ధర్మవరం సీటు పరిటాల శ్రీరామ్ కు తప్పించి మరొకరికి వీల్లేదన్న విషయం స్పష్టమైందని చెబుతున్నారు.

నిజానికి ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా సూరి అలియాస్ గోనుగుంట్ల సూర్యనారాయణకు టికెట్ ఖాయమని ప్రచారం సాగేది. తాజాగా పరిటాల శ్రీరామ్ అలాంటి వాదనలకు చెక్ చెబుతూ.. ధర్మవరం టికెట్ విషయంలో తానెంత సీరియస్ గా ఉన్నానన్న విషయాన్ని చెప్పేయటం.. ఒకవేళ తనకు టికెట్ ఇవ్వకుంటే రాజకీయాల నుంచే శాశ్వితంగా వైదొలుగుతానని స్పష్టం చేయటంతో ఆసక్తికరంగా మారింది. మరి.. టికెట్ ఆశించిన సూరి ఎలా రియాక్టు అవుతారో చూడాలి.
Tags:    

Similar News