రాప్తాడుకు బై: నియోజకవర్గం మార్చిన పరిటాల శ్రీరామ్‌

Update: 2020-04-03 07:33 GMT
అనంతపురము జిల్లాలో పరిటాల కుటుంబం హవా ఒకప్పుడు ఉండేది. రాజకీయాల్లో ఆ కుటుంబం పేరు ప్రధానంగా ఉంటుంది. ఒకప్పుడు వారి కుటుంబానికి విశేష ప్రాధాన్యం ఉండగా ప్రస్తుతం పరిటాల కుటుంబానికి గడ్డు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. టీడీపీలో ఉన్న ఆ కుటుంబం ఇబ్బందికర పరిస్థితులు పడుతున్నారు. పరిటాల కుటుంబంలో రవి వారసత్వాన్ని ఆయన భార్య సునీత మోశారు. ఇప్పుడు ఆ బాధ్యతలను ఆయన కుమారుడు, యువ నాయకుడు పరిటాల శ్రీరామ్ భుజాలకు ఎత్తుకున్నాడు. రాప్తాడు వీరికి రాజకీయంగా కంచుకోట. అయితే 2019 ఎన్నికల్లో ఆ కుటుంబానికి రాజకీయంగా కలిసి రాలేదు. శ్రీరామ్‌ రాప్తాడు నియోజకవర్గం నుంచి ఓడిపోగా.. ఆమె తల్లి సునీత కూడా పరాజయం పొందారు. అయితే ఇప్పుడు పరిటాల శ్రీరామ్‌ తమ సొంత నియోజకవర్గం వదిలి తమ పక్కనే ఉన్న ధర్మవరం వైపు దృష్టి సారిస్తున్నారు. రాప్తాడును వదిలేసి ధర్మవరం నియోజకవర్గంలో తిష్ట వేశారు. నియోజకవర్గం మార్చడంతో చర్చనీయాంశమైంది.

ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ బాధ్యతలను గోనుగుంట్ల సూరి చూసేవారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2019లో ఓడిపోయారు. తర్వాత ఆయన టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో ప్రస్తుతం ధర్మవరంలో టీడీపీకి పెద్ద దిక్కు లేకుండాపోయారు. ఈ విషయాన్ని గుర్తించిన పార్టీ అధినేత అనంతపురము జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా ధర్మవరం బాధ్యతల్ని పరిటాల కుటుంబానికి అప్పగించారు. ఈ విషయాన్ని రోడ్‌షోలో బహిరంగంగానే ప్రకటించారు. ఈ సమయంలోనే కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్ సందర్భాలు ఉండడంతో ధర్మవరం నియోజకవర్గంలో పరిటాల శ్రీరామ్ పర్యటిస్తున్నారు. ధర్మవరంలో సేవా కార్యక్రమాలు జోరుగా చేస్తున్నారు. పేదలకు కూరగాయల పంపిణీ, భోజన ఏర్పాట్లు, మున్సిపల్ సిబ్బందికి నిత్యావసర వస్తువుల పంపిణీ చేయడంలో బిజీగా ఉన్నారు. నెల రోజులుగా ధర్మవరం నియోజకవర్గంలోనే ఉంటున్నారు.

చంద్రబాబు బాధ్యతలు అప్పగించడంతో ధర్మవరం బాధ్యతల్ని పరిటాల శ్రీరామ్‌ తీసుకున్నారు. రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గంలో తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి చేతిలో ఓడిపోయిన అనంతరం శ్రీరామ్‌ నియోజకవర్గంలో తిరగలేకపోతున్నారు. ఈ క్రమంలోనే శ్రీరామ్ రాప్తాడును వదిలేసి ధర్మవరం నియోజకవర్గం వైపు మళ్లారు. అయితే రాప్తాడు నియోజకవర్గం బాధ్యతల ఎవరు తీసుకుంటారనే చర్చ సాగుతోంది. మాజీమంత్రి పరిటాల సునీత తన రాజకీయ వారసుడిగా తన కుమారుడు శ్రీరామ్‌కు అప్పగించారు. శ్రీరామ్‌ ధర్మవరం వెళ్లడంతో ఇప్పుడు మళ్లీ రాప్తాడు నియోజకవర్గాన్ని సునీత తీసుకుంటారని చర్చ నడుస్తోంది. ప్రస్తుతం పరిటాల కుటుంబానికి రెండు నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పుడు అధికార పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు దీటుగా టీడీపీని బలోపేతంగా చేయడంతో పాటు తమ కుటుంబ బలం పెంచుకోవడానికి శ్రీరామ్‌ తీవ్రంగా కష్టపడుతున్నారు. తన తండ్రి ఇచ్చిన వారసత్వాన్ని నిలబెట్టుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్నారు. మరి ఎలాంటి ఫలితం లభిస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News