టీడీపీకి పరిటాల ఫ్యామిలీ రాజీనామా..క్లారిటీ ఇచ్చిన శ్రీరామ్!

Update: 2020-03-16 09:15 GMT
ఏపీలో ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ పరిస్థితి రోజురోజుకి మరింత దిగజారిపోతోంది. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు టీడీపీని అతలాకుతలం చేసాయి. అధికారం మళ్లీ తమదే అని ధీమా వ్యక్తం చేసిన చంద్రబాబు కి ఏపీ ప్రజానీకం షాక్ ఇస్తూ ...టీడీపీ చరిత్రలో చూడనటువంటి ఘోర పరాజయాన్ని అందించారు. ఆ షాక్ నుండి ఇంకా తేరుకోకముందే ..స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో టీడీపీ కీలక నేతలు - చంద్రబాబు కు షాక్‌ ల మీద షాక్‌ లు ఇస్తున్నారు.

గత కొన్నేళ్లుగా టీడీపీని అంటిపెట్టుకొని ఉన్న వాళ్లు కూడా చంద్రబాబుకి షాక్ ఇస్తూ జగన్ సర్కార్ కి జై కొడుతూ వైసీపీ లో చేరిపోతున్నారు.  మరికొందరు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఎప్పుడు ఎవరు పార్టీని వీడుతారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అయితే , ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరించి అందరిని భయానికి గురిచేస్తున్న నేపథ్యంలో ఊహించని విధంగా ఈసీ ఆరు వారాల పాటు ఎన్నికలను వాయిదా వేసింది. ఇక ఇదే సమయంలో టీడీపీ నుండి కొనసాగుతున్న వలసల్లో భాగంగా ఇంకా చాలా మంది కీలక నాయకులు వైసీపీ నేతలకు టచ్ లో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. అందులో పరిటాల ఫ్యామిలీ ఉందన్న వార్త ప్రధానంగా వినిపిస్తుంది. త్వరలోనే పరిటాల ఫ్యామిలీ సైకిల్ దిగనున్నారని  - పార్టీలో ఉన్న విభేదాల వలన టీడీపీ నుంచి బయటకు వచ్చే ఆలోచనలో పరిటాల కుటుంబం ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలో వాటిపై పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్ ఆ వార్తలపై స్పందించారు. టీడీపీని వీడుతున్నారంటూ వస్తోన్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఆయన .. "తెలుగుదేశం పార్టీలో మాకు ఏదో విభేదాలు ఉన్నాయని పార్టీ మారుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా నాన్న పరిటాల రవీంద్ర గారి సిద్ధాంతాలతో ఆయన ఆశయసాధన కోసం తెలుగుదేశం పార్టీని బలంగా నమ్మి ప్రజా అభివృద్ధి కాంక్షిస్తూ నిత్యం ప్రజాసేవలో కొనసాగుతున్నాం. అలాంటి మా మీద - కన్నతల్లి లాంటి పార్టీ మారుతున్నట్లు తీవ్రమైన దుష్ప్రచారాన్ని చేస్తున్న మూర్ఖులు.. అందరికీ ఒక్కటి మాత్రం చెప్పగలం. పసువు జెండా వదిలి పక్క పార్టీ వైపు చూసే దురాలోచన మాకు రాదు రాబోదు. తల్లి పాలు తాగి తల్లికే ద్రోహం చేసే సంస్కృతి మాకు లేదన్నారు. తరాలు మారినా తరగని అభిమానంతో పసుపు జెండా కోసం పని చేస్తాం. కార్యకర్తలకు అండగా ఉంటాం. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం. ఇకనైనా ఇలాంటి రాతలు రాసే వారు నీతి మాలిన రాతలు మాని సమాజంలో నీతిగా బతకండి. మేము పార్టీ మారుతున్నట్లు జరగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు” అని శ్రీరామ్ ఓ ప్రకటన చేసారు.


Tags:    

Similar News