బాలయ్యకు బాబు చెక్... శ్రీరామ్ ఇన్...

Update: 2018-12-27 04:56 GMT
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ చతురతకు మరోసారి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తన కుమారుడ్ని ముఖ్యమంత్రిని చేయడంలో భాగంగా ఆయనకు చెక్ పెట్టే వారు ఎవ్వరో ముందుగానే గ్రహించి వారిని ఎన్నికల బరిలో లేకుండా చేసేందుకు తన వ్యూహాలను రచిస్తున్నారు. ఈ వ్యూహ చతురతను ముందుగా తన బావమరిది, వియ్యంకుడు, సీనియర్ నటుడు నందమూరి బాలక్రిష్ణ పైనే ప్రయోగిస్తున్నారు. ఆయ‌న‌ హిందూపురం బరిలోంచి తప్పించనున్నట్లు పార్టీలో చెబుతున్నారు.

వచ్చే నెలలోనే తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్ధులను ప్రకటిస్తానని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ తొలి జాబితాలోనే ఆయన హిందుపురం నియోజకవర్గం నుంచి బాలక్రిష్ణ ను తప్పించి ఆయన స్ధానంలో పరిటాల రవి కుమారుడు పరిటాల శ్రీరామ్ పేరు ప్రకటించే అవకాశాలున్నాయంటున్నారు.  నిజానికి పరిటాల శ్రీరామ్ పెనుగొండ- ధర్మవరం- కల్యాణదుర్గం- అనంతపురం నియోజవర్గాల్లో ఏదో ఒక చోట నుంచి పోటీ చేయాలనుకున్నారు.  ఆ మేరకు జిల్లాలో తన ప్రాబల్యం కూడా పెంచుకున్నారు. అయితే, ఈ నియోజకవర్గాల్లో సిట్టింగులెవ్వరూ తమ స్ధానాలను వదులుకునే స్ధితిలో లేరు.
 
అనంతపురం జిల్లాలో కచ్చితంగా విజయం సాధించే నియోజకవర్గాల్లో హిందూపురం ఒకటి. దీంతో ఈ స్ధానం నుంచి పరిటాల శ్రీరామ్ కు టిక్కట్ ఇచ్చి యువరక్తాన్ని ప్రోత్సహిస్తున్నాననే పేరు తెచ్చుకోవాలన్నది చంద్రబాబు నాయుడి ఎత్తుగడగా చెబుతున్నారు. తన తనయుడు నారా లోకేష్ ను ముఖ్యమంత్రిగా చేసే క్రమంలో నందమూరి వంశం నుంచి తనకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదన్నది చంద్రబాబు నాయుడి ఆలోచనగా చెబుతున్నారు. పైగా పిల్లనిచ్చిన మామగారు కూడా కావడంతో బాలక్రిష్ణ నుంచి ఎలాంటి వ్యతిరేకత రాదన్నది చంద్రబాబు నాయుడి ఆలోచనగా చెబుతున్నారు. అయితే ముందుగా శాసనసభ్యుడు కాకుండా చూడాలని, అందుకోసం అవసరమైతే లోక్‌సభ స్ధానం కేటాయించాలన్నది కూడా చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది.

హిందుపురం లోక్‌సభ సభ్యుడు నిమ్మల కిష్టప్ప పట్ల చంద్రబాబు నాయుడు అసంత్రప్తితో ఉన్నట్లు సమాచారం.  ఈ క్రమంలో బాలక్రిష్ణను హిందుపురం లోక్‌సభ కు రంగంలో దింపాలన్నది ఆయన ఉద్యేశ్యంగా కనిపిస్తోంది. కేంద్రంలో తాను సారథ్యం వహిస్తున్న థర్డ్‌ఫ్రంట్ అధికారంలోకి వస్తుందని, అదే జరిగితే బాలక్రిష్ణకు కేంద్ర మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం కూడా చేస్తున్నారు.  అయితే బాలక్రిష్ణ మాత్రం లోక్‌సభ బరిలో దిగేది లేదు అంటే మాత్రం ఆయనకు రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టాలన్నది నారా వారి ఎత్తుగడగా చెబుతున్నారు.   


Tags:    

Similar News