రైతులకు లేని గౌరవం నాకేందుకు.. పద్మవిభూషణ్​ వెనక్కి ఇచ్చేసిన బాదల్​..!

Update: 2020-12-03 15:03 GMT
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయబిల్లులకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తున్నది. ఇప్పటికే సోషల్​మీడియా వేదికగా పలువురు రైతుల ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్, నాయకుడు ప్రకాష్ సింగ్ బాదల్ రైతుల పోరాటానికి తన సంఘీభావం తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన భారత ప్రభుత్వం ఇచ్చిన పద్మవిభూషణ్​ అవార్డును తిరిగి వెనక్కి ఇచ్చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతికి ఓ లేఖ రాశారు. కేంద్రం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా తాను అవార్డును ఇచ్చేస్తున్నట్టు ఆయన లేఖలో పేర్కొన్నారు.

ప్రకాష్ సింగ్ బాదల్ శిరోమణి అకాళిదళ్​ పార్టీ సీనియర్​ నాయకుడు అంతేకాక పంజాబ్​కు ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రైతుల ఉద్యమం న్యాయమైనది. కేంద్రం చాలా అన్యాయంగా వ్యవహరిస్తున్నది. నేను పేదవాడిని నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు. అందుకే నా అవార్డును వెనక్కి ఇచ్చేస్తున్నా. నాకు రైతుల విలువ ఏమిటో తెలుసు. నన్ను ఈ స్థాయికి తెచ్చింది రైతులే. వాళ్లే అవమానాలకు గురవుతున్నచోట నేను గౌరవం పొందడం అనవసరం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. ఎముకలు కొరికే చలిలో రైతులు గజగజ వణుకుతూ నిరసన తెలుపుతుంటే కేంద్ర ప్రభుత్వానికి కనీసం జాలికూడా లేదు. పైగా వాళ్లమీదకు జలఫిరంగులు వదిలింది. లాఠీచార్జీ చేసింది. నిజంగా ఇది రాక్షసత్వం. తమ హక్కులకోసం రైతులు పోరాడుతున్నారు.

ప్రజల ప్రాథమికహక్కులు కాలరాసే హక్కులు ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు. వెంటనే కేంద్రప్రభుత్వం వ్యవసాయబిల్లులను ఉపసంహరించుకోవాలి. చర్చల పేరు చెప్పి కాలయాపన చేయొద్దు’ అంటూ ఆయన రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​కు ఈమెయిల్​లో లేఖను పంపించారు. శిరోమణి అకాళిదళ్​.. కేంద్రం తీసుకొచ్చిన రైతుబిల్లులకు వ్యతిరేకంగా గత సెప్టెంబర్​లో ఎన్డీఏతో తెగదెంపులు చేసుకున్నది.
Tags:    

Similar News