సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని తీసుకున్న కేజ్రీ స‌ర్కార్

Update: 2017-09-28 05:09 GMT
కొద్దికాలంగా కామ్ గా ఉన్న ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. ప్ర‌జ‌ల‌కు కాస్త ఇబ్బందిగా అనిపించిన‌ప్ప‌టికీ.. ఈ నిర్ణ‌యాన్ని ప‌క్కాగా అమ‌లు చేస్తే భ‌విష్య‌త్తులో ఎదుర‌య్యే ఎన్నో స‌మ‌స్య‌ల‌కు ఇప్పుడే చెక్ పెట్టేయొచ్చ‌ని చెప్పాలి. తాజాగా కేజ్రీ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యాన్ని రెండు తెలుగు రాష్ట్రాల చంద్రుళ్లు వెనువెంట‌నే పాలో అయితే మంచిద‌ని చెప్పాలి.

ఇంత‌కీ.. కేజ్రీవాల్ స‌ర్కారు తీసుకున్న ఈ సంచ‌ల‌న నిర్ణ‌యం ఏమిటంటే.. ఇంటి ముందు టూ వీల‌ర్ కానీ.. కారును కానీ పార్క్ చేయ‌టం మామూలే. ఇలా పార్క్ చేసే వాహ‌నాల‌పై పార్కింగ్ చార్జీని వ‌డ్డించేందుకు వీలుగా ఢిల్లీ రాష్ట్ర స‌ర్కారు సిద్ధ‌మ‌వుతోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని న‌గ‌రాలు.. ప‌ట్ట‌ణాల్లో ఇంటి ముందు వాహ‌నాల్ని నిలిపి ఉంచటం క‌నిపిస్తుంది. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో ఈ తీరు గ‌ల్లీల్లోనే కాదు.. విల్లాల ద‌గ్గ‌ర క‌నిపిస్తుంది. ఎందుకిలా అంటే.. ఇంటి నిర్మాణానికి అవ‌స‌ర‌మైన స్థ‌లంలో వాహ‌నాన్ని ఇంట్లోనే నిలిపి ఉంచాల‌న్న ఆలోచ‌న లేకుండా ఉండ‌ట‌మే. దీని కార‌ణంగా వీధుల‌న్నీ వాహ‌నాల‌తో నిండిపోయి త‌ర‌చూ ట్రాఫిక్ క‌ష్టాల‌కు కార‌ణ‌మ‌వుతుంటాయి. ఇలాంటి తీరుకు చెక్ పెట్టేందుకు ఢిల్లీ రాష్ట్ర స‌ర్కారు ఇంటి ముందు నిలిపి ఉంచే వాహ‌నాల‌కు పార్కింగ్ చార్జిని వ‌డ్డించేందుకు సిద్ద‌మ‌వుతుంది.

ఢిల్లీ పార్కింగ్ నిర్వ‌హ‌ణ రూల్ 2017 ప్రకారం ఇంటి ముందు వాహ‌నాల్ని పార్కింగ్ చేసిన వారి నుంచి పార్కింగ్ ఫీజు వ‌సూలు చేయాల‌ని నిర్ణ‌యించారు. అయితే.. ఈ నిర్ణ‌యం కార‌ణంగా ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డ‌కుండా ఉండేలా ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది కేజ్రీవాల్ స‌ర్కారు. తొలుత కాల‌నీ సంక్షేమ సంఘాలు.. ప్ర‌జ‌ల స‌ల‌హాలు సూచ‌న‌లు తీసుకొని వాహ‌నాల పార్కింగ్ ప్రాంతాల్ని గుర్తించి నిర్ణ‌యిస్తారు. అక్క‌డ కాకుండా ఇష్టారాజ్యంగా ఇళ్ల ముందు వాహ‌నాల్ని నిలిపితే మాత్రం పార్కింగ్ పీజు వ‌సూలు చేస్తారు. అది కూడా వీధుల్లో వ‌సూలు చేసే చార్జిల‌కు రెండు.. మూడు రెట్లు ఎక్కువ‌గా చార్జ్ చేస్తారు. దీంతో.. ఇళ్ల ముందు ఇష్టారాజ్యంగా వాహ‌నాల్ని నిలిపి ఉంచే తీరును మార్చ‌టంతో పాటు.. ఇళ్ల నిర్మాణంలోనే త‌గినంత పార్కింగ్ ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్న ఆలోచ‌న‌ను ప్ర‌జ‌ల్లో పెంచ‌ట‌మే ప్ర‌భుత్వ నిర్ణ‌యంలోని ఉద్దేశంగా చెబుతున్నారు. ఈ విధానాన్ని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు అమ‌లు చేస్తే.. నిర్మాణాల్లోని లోపాల్ని అరిక‌ట్టే అవ‌కాశం ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. 
Tags:    

Similar News