కొత్త సలహాదారుపై పార్టీలో అసంతృప్తి

Update: 2021-10-02 01:30 GMT
ఉద్యోగ సర్వీసులపై సలహాలిచ్చేందుకు ప్రభుత్వం నియమించబోతున్న చంద్రశేఖర్ రెడ్డి పై అధికార వైసీపీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు ఎంతమందిని ప్రభుత్వం సలహాదారులుగా నియమించుకున్నా పార్టీ నేతలు పట్టించుకోలేదు. కానీ చంద్రశేఖరరెడ్డి నియామకానికి సంబంధించి మాత్రం పార్టీ నేతలు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇందుకు కారణం ఏమిటంటే 2019 ఎన్నికలకు ముందు ఇదే ఉద్యోగ సంఘాల నేత చంద్రబాబునాయుడుకు గట్టి మద్దతుదారుగా చలామణి అవ్వటమే.

అప్పటి ఉద్యోగ సంఘాల నేత, ప్రస్తుత టీడీపీ ఎంఎల్సీ అశోక్ బాబుకు చంద్రశేఖరరెడ్డి ప్రధాన మద్దతుదారుగా చెలామణయ్యారు. అశోక్ బాబు కారణంగా ఈ రెడ్డి కూడా టీడీపీ మద్దతుదారుగా వ్యవహించేవారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. 2019 ఎన్నికల్లో చంద్రబాబే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని గట్టిగా కోరుకున్న ఉద్యోగసంఘాల నేతల్లో ఈ రెడ్డి కూడా ఉన్నట్లు పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు. చంద్రబాబుకు అంతటి స్ట్రాంగ్ సపోర్టర్ టీడీపీ ఓడిపోవటాన్ని అప్పట్లో జీర్ణించుకోలేకపోయారట.

అయితే టీడీపీ ఓటమన్నది సత్యం కాబట్టి వెంటనే వైసీపీకి జై కొట్టేశారట. అధికార పార్టీ నేతలతో రాసుకుపూసుకు తిరగడం మొదలుపెట్టారని వైసీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఇదే సమయంలో సచివాలయంలోని ఉద్యోగసంఘాల నేతలు కొందరు ఇపుడు పై విషయాలన్నీ గుర్తుచేస్తున్నారు. ఉద్యోగ సంఘాల నేతలకే కాదు సచివాలయంతో బాగా సన్నిహితంగా ఉండే రిపోర్టర్లకు కూడా ఈ విషయాలన్నీ తెలుసు. బాహాటంగానే చంద్రబాబుకు ఉద్యోగసంఘాల నేత మద్దతు పలికిన విషయం ప్రభుత్వ పెద్దలకు తెలియకపోవటమే ఆశ్చర్యంగా ఉంది.

ఏదేమైనా ప్రభుత్వంలో గట్టిపట్టున్న వారిని ఎవరినో గట్టిగా పట్టుకున్న కారణంగానే చంద్రశేఖర్ రెడ్డిని సలహాదారుగా నియామకం చేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరి ఈ రెడ్డిని ఎండార్స్ చేస్తున్న కీలక నేతలెవరు ? జగన్ కు ఏమి చెప్పారనే విషయాలే ఇపుడు సచివాలయంలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. మొత్తానికి ఎవరేమి చెప్పినా ? ఎంత ప్రయత్నించినా ? అదృష్టమనేది కీలకంగా వ్యవహరిస్తుందని అందరికీ తెలిసిందే. అదృష్టమనేది ఒకటుంటే చాలు ఎవరు, ఎవరినీ అడ్డుకోలేరు. మరి చూద్దాం ఈ రెడ్డి విషయంలో చివరకు ఏమవుతుందో.
Tags:    

Similar News