పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చేశానంటున్న పాల్‌!

Update: 2022-05-19 09:30 GMT
కేఏ పాల్‌.. (పూర్తి పేరు.. కిలారి ఆనంద్‌ పాల్‌)ని రాజకీయ నేతగా చూసేవారి కంటే కమెడియన్‌గా చూసేవారే ఎక్కువ. ఆయన మాటలు, చేష్టలు, హావభావాలు, ఆయన చెప్పుకునే గొప్పలు మంచి విదూషకుడిని తలపిస్తాయి. సీరియస్‌ పాలిటిక్స్, బూతులు, తిట్లతో అలసిపోయినవారికి తన మాటలతో కేఏ పాల్‌ మంచి వినోదం పంచుతుంటారు. తన పార్టీ తరఫున ఒక్క వార్డు మెంబర్‌ లేకపోయినా దేశానికి కాబోయే ప్రధానిమంత్రిని తానేనని చెబుతుంటారు. ఇలా తన మాటలతో అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంటారు.

విశాఖపట్నం జిల్లాకు చెందిన కేఏ పాల్‌ పేద కుటుంబంలో జన్మించారు. కష్టపడి ఆంగ్లంలో నైపుణ్యం సాధించారు. క్రైస్తవ మత ప్రబోధకుడిగా దేశ, విదేశాల్లో పేరుగాంచారు. వేల కోట్ల రూపాయల ఆస్తులు.. భారీ మొత్తంలో విదేశీ విరాళాలు.. ఏ దేశ ప్రధానినైనా, అధ్యక్షుడినైనా కలుసుకోగల చనువు పాల్‌ సొంతం.

అలాంటి పాల్‌కు వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో కష్టాలు మొదలయ్యాయి. ఆయన తన అల్లుడు, మరో క్రైస్తవ ప్రబోధకుడు అనిల్‌ని పైకి లేపడానికి కేఏ పాల్‌ను టార్గెట్‌ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. పాల్‌ వ్యవహార శైలి కూడా ఆయనకు చిక్కులు తెచ్చిపెడుతోంది. స్వయంగా తన సోదరుడిని సుపారీ ఇచ్చి హత్య చేయించారని పాల్‌పై విమర్శలు ఉన్నాయి.

2019 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ప్రజా శాంతి పార్టీని స్థాపించి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల బరిలోకి దిగారు.. కేఏ పాల్‌. వైఎస్సార్‌సీపీని, వైఎస్‌ జగన్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు కురిపించారు. ఎస్సీలు, క్రిస్టియన్‌ ఓట్లను చీల్చడానికి టీడీపీ అధినేత చంద్రబాబే కేఏ పాల్‌తో పార్టీ పెట్టించారనే ఆరోపణలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో నరసాపురం నుంచి, మరో చోట నుంచి బరిలోకి దిగిన కేఏ పాల్‌కు డిపాజిట్లు కూడా రాలేదు. ఆ తర్వాత రాష్ట్రం నుంచి బిచాణా ఎత్తేసిన కేఏ పాల్‌ అప్పుడప్పుడు ప్రెస్‌ మీట్ల ద్వారా తన ఉనికిని చాటుకుంటున్నారు.

కాపు సామాజికవర్గానికి చెందిన కేఏ పాల్‌ గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. పవన్‌ వల్ల ఏమీ కాదని.. కాపులంతా తనతో కలసి నడవాలని పిలుపునిచ్చారు. పవన్‌ తన పార్టీని ప్రజా శాంతి పార్టీలో విలీనం చేయాలని కోరారు. కొద్ది రోజుల క్రితం తెలంగాణలో కేఏ పాల్‌పై టీఆర్‌ఎస్‌ కార్యకర్త ఒకరు దాడి చేశారు. దానిపై ఫిర్యాదు చేయడానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాని కలిశారు.. కేఏ పాల్‌. బీజేపీ పవన్‌ వెంట ఎందుకు పడుతుందని తాను అమిత్‌ షాని ప్రశ్నించానని.,. అయితే అమిత్‌ షా.. పవనే బీజేపీ వెంట పడుతున్నారని తెలిపారని మీడియాకు చెప్పారు. తెలంగాణ కేసీఆర్‌ అవినీతిపైన బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని హెచ్చరించారు.

వచ్చే ఎన్నికల్లో తాము వివిధ రాష్ట్రాల నుంచి 175 మందిని ఎంపీ అభ్యర్థులుగా నిలబెడతామని కేఏ పాల్‌ చెప్పారు. అలాగే ప్రజా శాంతి పార్టీని ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేస్తామని తెలిపారు. వివిధ పార్టీల నుంచి ప్రజా శాంతి పార్టీలోకి భారీగా చేరికలు కూడా ఉంటాయని వివరించారు. తాను ఇక పూర్తి స్థాయి పాలిటిక్స్‌లోకి వచ్చేసినట్టేనని పాల్‌ చెబుతున్నా ఆయనను కమెడియన్‌గా చూసేవారే ఎక్కువ. ప్రస్తుతానికి పాల్‌ని తెలుగు నాట రాజకీయాల్లో ఆటలో అరటి పండుగా, కూరలో కరివేపాకుగా ఆయా పార్టీలు భావిస్తున్నాయి.

అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆలోచన మాత్రం వేరేలా ఉందని విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా శాంతి పార్టీతో పోటీ చేయించి క్రైస్తవ ఓట్లను చీల్చడానికి ప్లాన్‌ చేస్తోందని చెబుతున్నారు. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో క్రైస్తవులు ఎక్కువగా ఉండటంతో అక్కడ కూడా పాల్‌ పార్టీని పోటీ చేయించి క్రైస్తవ ఓట్లను చీల్చి లబ్ధి పొందడానికి బీజేపీ వ్యూహం పన్నిందని పేర్కొంటున్నారు.
Tags:    

Similar News