పవన్ కు సొంత పార్టీ అభ్యర్థులే గుర్తులేరట..!

Update: 2019-04-05 09:03 GMT
సార్వత్రిక పోరు మరికొద్దిరోజుల్లో ముగియనుండడంతో ఏపీలో రాజకీయం వేడెక్కుతోంది. ఓ వైపు మండే ఎండలు.. మరోవైపు వాడివేడీ ప్రసంగాలతో ఏపీ మొత్తం హీటెక్కుతోంది. ఈనేపథ్యంలో జనసేన పార్టీ అభ్యర్థి పవన్‌కల్యాణ్‌ సైతం ప్రధాన కేంద్రాల్లో సభలు నిర్వహిస్తూ.. కొన్ని చోట్ల రోడ్‌షోలతో ఆకట్టుకుంటున్నారు. అయితే  తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో పవన్‌ కల్యాన్‌ ప్రవర్తనతో అందరూ ఆశ్చర్యపోయారు. తమ పార్టీ తరుపున ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి ఎవరో తెలియకుండానే సభలోకి రావడం చర్చనీయాంశంగా మారింది.

తిరుపతిలోని తారకరామ స్టేడియంలో గురువారం జనసేన బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు జనసేన అధ్యక్షుడు పవన్‌తో పాటు బీఎస్పీ అధినేత్రి మయావతి కూడా హాజరయ్యారు. బీఎస్‌పీ తరుపున పోటీ చేస్తున్న చిత్తరు, నెల్లూరు, కడప జిల్లాల అభ్యర్థులు వేదికపై ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా పవన్‌ ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేశారు. అయితే తిరుపతి నుంచి పోటీ చేస్తున్న చదలవాడ కృష్ణమూర్తి పేరు సహా మిగిలిన వారి పేర్లను పవన్‌ పక్కనున్నవారిని అడిగి తెలుసుకోవడంతో అక్కడున్నవారంతా ఆశ్చర్యానికి గురయ్యారు.

ఇక గంగాధర నెల్లూరులో తమ అభ్యర్థి ఉన్నారన్న విషయం మరిచిపోయారు. దీంతో ఆ అభ్యర్థిని పరిచయం చేయలేకపోయారు. ఆ తరువాతన జీడీ నెల్లూరు అభ్యర్థి అక్కడికి వచ్చి పేరు చెప్పడంతో ఆయనను గెలిపించాలని పవన్‌ కోరారు. మదనపల్లె పేరుకు బదులుగా రాజంపేట అభ్యర్థిగా గంగారపు స్వాతి అని చెప్పారు. స్థానిక నాయకులు సర్ది చెప్పడంతో మదనపల్లె అభ్యర్థి అని సర్దుకున్నారు. ఇలా పవన్‌ ప్రసంగంలో అనేక తప్పులు దొర్లడంతో పార్టీ నాయకులు నిరాశ చెందారు.

ఇక పవన్‌ సభ అనుకున్న సమయానికి ప్రారంభం కాకపోవడంతో ఇక్కడికి వచ్చిన వారంతా వెనుదిరిగారు. సభ ప్రారంభానికి ముందే సగం మంది ఇక్కడి నుంచి వెళ్లిపోవడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఎన్నికల నాటి పవన్‌ ఏ విధంగా నడుచుకుంటాడోనని సర్వత్రా చర్చ సాగుతోంది. ఇలా సొంత పార్టీ నేతల పేర్లను గుర్తుంచుకోని పవన్ ఇక రాష్ట్రాన్ని గెలిస్తే ఎలా పాలిస్తాడని.. పార్టీ ఎమ్మెల్యేలను ఎలా దగ్గరకు తీసుకుంటారని అందరూ చెవులు కొరుక్కున్నారు.
Tags:    

Similar News