ధర్మానకు పవన్ ఫీవర్... అందుకేనా...?

Update: 2022-08-10 03:49 GMT
శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు. ఆయన తానుగా చెప్పుకున్నట్లుగా నాలుగున్నర దశాబ్దాల రాజకీయం కలిగిన వారు. ప్రజా జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూసిన వారు. మూడు పదుల వయసులోనే మంత్రిగా పనిచేసి ది బెస్ట్ అని నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రుల చేత అనిపించుకున్నారు. మంచి సబ్జెక్ట్ ఉంది, దాన్ని చక్కగా విడమరచి చెప్పే నేర్పు ఓర్పు ఉంది.

ఇక ఇప్పటికి ఏడుసార్లు పోటీ చేసినా మెజారిటీ సార్లు గెలిచి పదవులు అలంకరించారు. ఆయన సుదీర్ఘ కాలం మంత్రిగా పనిచేసిన రికార్డుని కూడా జిల్లాలో సొంతం చేసుకున్నారు. అలాంటి ప్రసాదరావుకు లేట్ గా అయినా జగన్ రెవిన్యూ శాఖ వంటి కీలకమైన పదవి ఇచ్చి న్యాయం చేశారు. జిల్లా బాధ్యతలను కూడా ఆయన భుజస్కందాల మీద పెట్టారు. 2004, 2009 ఎన్నికల్లో వైఎస్సార్ కి జిల్లాలో మెజారిటీ సీట్లు  కాంగ్రెస్ కి దక్కించేలా చేసిన ధర్మాన చతురతను 2024లో కూడా చూపాలని  జగన్ కోరుకుంటున్నారు.

అయితే శ్రీకాకుళంలో సీన్ చూస్తే వేరుగా ఉంది. తెలుగుదేశం ఒక వైపు బలపడుతోంది. మరో వైపు చాప కింద నీరులా జనసేన కూడా విస్తరిస్తోంది. 2019 ఎన్నికల్లో చాలా నియోజకవర్గాలలో రెండు మూడు వేల మించి ఓట్లు రాని జనసేన ఈసారి మాత్రం బాగానే పుంజుకుంటుంది అని అంటున్నారు. కచ్చితంగా పదివేలకు తగ్గకుండా కొన్ని నియోజకవర్గాలలో ఓట్లు తీసుకుంటే మాత్రం అది వైసీపీకి గట్టి దెబ్బగా మారుతుంది అని అంటున్నారు.

ఇక జనసేన పోస్టర్లు జెండాలు ఎక్కడ చూసినా జిల్లాలో కనిపిస్తున్నాయి. జనసేన గొంతు కూడా బాగా వినిపిస్తోంది. దాంతో జనసేన మీద పెద్దగా అంచనాలు లేని వైసీపీలో కొత్త కలవరం రేగుతోంది. జిల్లాలో కాపు సామాజికవర్గం ప్రభావితం అయిన సీట్లు కొన్ని  ఉన్నాయి. అక్కడ కనుక జనసేన గట్టిగా పుంజుకుంటే నష్టం వైసీపీకే అంటున్నారు. అలాగే బీసీలలో కూడా కొంత మొగ్గు ఆ వైపు వెళ్తే వైసీపీ పెట్టుకున్న ఆశలు తల్లకిందులు అవుతాయి.

ఇక ప్రసాదరావు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం నియోజకవర్గంలో కూడా జనసేన హడావుడి మామూలుగా లేదు. మంత్రి పర్యటనలకు వెళ్తూంటే జనసేన క్యాడర్ తమ పార్టీ బేనర్లు కట్టి మరీ అధికార పార్టీని ఎక్కడికక్కడ  నిలదీస్తోంది. దీంతోనే ప్రసాదరావు అసహనానికి గురి అయి ఫస్ట్ టైమ్ పవన్ మీద నోరు చేసుకున్నారు అని అంటున్నారు.

పవన్ ది సినీ గ్లామర్ మాత్రమే అని ఆయన బయటకు అంటూ కొట్టి పారేస్తున్నా కొంప ముంచే విధంగా జనసేన బలం పెరుగుతుందేమో అన్న కంగారు అయితే వైసీపీలో ఉంది. యువత ఇపుడు జనసేన వైపు గట్టిగా నిలబడి ఉన్నారు. ఆ ఓట్లు చాలు గెలుపుని అటూ ఇటూ చేయడానికి టీడీపీ జనసేన కలిస్తే జిల్లాలో వైసీపీకి గడ్డు  కాలమే అని కూడా లెక్కలు చెబుతున్నాయి. మొత్తానికి ప్రసాదరావు పవన్ని తలచుకున్నారు అంటే సిక్కోలు లో జనసేన స్ట్రాంగ్ అవుతున్నట్లే అని అంటున్నారు.
Tags:    

Similar News