పుష్కర స్పెషల్; పది నిమిషాలకు రూ.2వేలు

Update: 2015-07-12 23:17 GMT
ఈసారి గోదారి పుష్కరాల సందర్భంగా ఏపీ సర్కారు సరికొత్త సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే గోదారి పుష్కరాల్ని బ్రహ్మాండంగా నిర్వహించాలని.. ఏర్పాట్లు భారీగా ఉండాలని కోరుకుంటున్న చంద్రబాబు ఆలోచనలకు తగ్గట్లే అధికారులు ఏర్పాట్లు చేసినట్లు చెబుతున్నారు. మిగిలిన ఏర్పాట్లు ఎలా ఉన్నా ఈసారి పుష్కరాల సందర్భంగా ఏపీ టూరిజం ఏర్పాటు చేసిన హెలికాఫ్టర్ సర్వీసు మాత్రం యాత్రీకులకు ఒక విశేష అనుభూతిని మిగిల్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

హెలికాఫ్టర్ లో పది నిమిషాల పాటు.. గోదారి తీరన్ని.. పుష్కరాలకు వచ్చే లక్షలాది మందిని ఏరియల్ వ్యూలో చూడటంతో పాటు.. గోదారి అందాల్ని తనివితీరా చూసేలా హెలికాఫ్టర్ సర్వీసును ఏర్పాటు చేశారు.

ఈ నెల 14 నుంచి 25 తేదీ వరకూ రాజమండ్రిలోని పుష్కర ఘాట్లను ఆకాశ మార్గాన చూసే సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. పది నిమిషాల పాటు సాగే.. ఈ హెలికాఫ్టర్ యాత్రకు ఒక్కొక్కరికి రూ.2వేల చొప్పున వసూలు చేయనున్నారు. ఆకాశ మార్గాన గోదారి సోయగాలతో పాటు.. లక్షల మంది భక్తుల సందడిని చూసే వీలు కలుగుతుంది. ఇదే కాదు.. గోదావరి జిల్లాల పిండివంటలతో మెగా ఫుడ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నారు. వీటన్నింటి తోడు సాంస్కృతిక కార్యక్రమాల్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమాలు ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు నేతృత్వంలో నిర్వహిస్తున్నారు. ప్రముఖ సంగీత విద్యాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ.. సినీ సంగీత దర్శకులు కీరవాణి తదితరులు భక్తుల్ని అలరించనున్నారు. మొత్తానికి గోదావరి పుష్కరాల కోసం రాజమండ్రికి వచ్చే వారికి..మరిచిపోలేని తీపి గురుతుల్ని అందించేందుకు ఏపీ సర్కారు ఏర్పాట్లు భారీగా చేసిందన్న భావన వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News