అంతా కాలిపోయాక.. ఇప్పుడు కళ్లు తెరవటమా పవన్?

Update: 2023-04-25 09:36 GMT
గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తీసుకొచ్చే విషయంలో జనసేన అధినేత పవన్ కు ఆయన అభిమానులకు అలవాటే. విషయాల్ని ఎప్పటికప్పుడు తేల్చేయకుండా.. ముదరబెట్టి.. మడత బెట్టి.. మంట పుట్టేలాంటి పరిస్థితికి తెచ్చే వరకు విషయాల్ని తీసుకెళ్లటంలో పవన్ తీరు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటుంది. సినిమా హీరోగా సినిమాలు చేసుకుంటూ ఉన్న వేళ.. తనను అభిమానించే వారిని ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉండదు.

అందుకు భిన్నంగా ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి.. పదేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్న అధినాయకుడి విజన్ ఎంత క్లియర్ గా ఉండాలి? మరెంత ముందు చూపు ఉండాలి? తాను తీసుకునే నిర్ణయాల దిశగా తన అభిమాన గణం తనతో నడిచేలా వారిని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాల్లో పవన్ పక్కాగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే.. ఆయన రాజకీయాలు మిగిలిన సంప్రదాయ రాజకీయ పార్టీలకు పూర్తిగా భిన్నమని చెప్పాలి. నీతిగా ఉంటా.. నిజాయితీగా వ్యవహరిస్తా లాంటి ఆదర్శాలతో పార్టీని నడిపించటమే లక్ష్య మైనప్పుడు.. దాని కారణంగా ఎదురయ్యే ఇబ్బందులు కాస్త భిన్నంగా ఉంటాయి.

ఈ తరహా పార్టీలను అభిమానించే వారు.. ఆరాధించే వారి మైండ్ సెట్ కాస్త భిన్నం. సంప్రదాయ పార్టీలను చూడండి. తమ పార్టీ అధినేత లైన్ ను దాటి పక్కకు వెళ్లరు. పందిని నంది అన్నా.. అవును నందే అంటారు కానీ.. మా అధినాయకుడు కాస్తంత పొరపాటు పడినట్లు ఉన్నారు.. అది నంది కాదు పంది అని మాత్రం అనరు. అదే రోటీన్ రాజకీయ పార్టీలకు చెందిన వారైతే.. తమ అధినాయకుడు పందిని నంది అన్నారంటే.. అందులో ఏదో ఒక కారణం ఉండి ఉంటుందని.. ఆ విషయం తేలే వరకు వెయిట్ చేయాల్సిందేనని సమర్థిస్తారే తప్పించి.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడరు.

కానీ.. పవన్ అభిమానుల రూట్ కాస్తంత భిన్నం. ఆయన్ను అర్జెంట్ గా ముఖ్యమంత్రిని చేసేయాలన్న తపన తప్పించి.. అందుకు తగ్గట్లుగా శక్తిసామర్థ్యాలు తమకు ఉన్నాయా? లేదా? అన్న విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. అంతేకాదు.. తమ బలాన్ని తాము ఎక్కువగా ఊహించేసుకోవటం కూడా ఒక పెద్ద ఇబ్బంది. వీటన్నింటికి మించి.. తమ అసలుసిసలు రాజకీయ ప్రత్యర్థి ఎవరన్న విషయం పై పవన్ ను అభిమానించే వారికి ఉన్నంత కన్ఫ్యూజన్ దేశంలోని మరే ఇతర రాజకీయ పార్టీ అభిమానుల్లో కనిపించదని చెబుతారు.

తమ అంతిమ లక్ష్యం ఏమిటన్న విషయంపై పూర్తిస్థాయి క్లారిటీ లేకున్నా.. ప్రాథమిక స్థాయిలో ఉండాలి కదా? ఒకవేళ అలాంటిదేమీ లేకుండా పగటి కలలు కంటుంటే.. తన అభిమానులకు సరైన రీతిలో మార్గదర్శనం చేయించాల్సిన బాధ్యత పవన్ మీద ఉంటుంది. ఎవరి కలలు వారివి అన్నట్లుగా తన అభిమానగణాన్ని వదిలేయటం.. వారు తమ నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్న తీరు కంగాళీగా మారుతోంది. దీంతో.. మిత్రులుగా ఉండాల్సిన వారు సైతం పవన్ కు ప్రత్యర్థులుగా మారుతున్నారు.

దీనంతటికి కారణం.. పార్టీ నిర్మాణం విషయంలో పవన్ అనుసరించిన వైఖరిగా చెప్పాలి. తెలంగాణ ఉద్యమ గోదాలోకి దిగిన నాటి టీఆర్ఎస్ ను చూస్తే.. ఉద్యమ సమయానికి తెలంగాణ వ్యాప్తంగా దానికి బలమైన కార్యకర్తలు.. నేతలు.. నెట్ వర్కు లేని విషయం తెలిసిందే. ఆ లోటును భర్తీ చేసేందుకు వీలుగా.. క్రమపద్దతిలో పార్టీలో చేరికలు చేర్చటం.. ఇతర పార్టీల్లోని తెలంగాణ సానుభూతిపరుల మనసుల్ని దోచుకోవటం ద్వారా.. తమదైన ఒక వర్గాన్ని క్రియేట్ చేసుకోగలిగారు. దీంతో.. కేసీఆర్ వల్లించే మాటలకు వ్యతిరేకత వ్యక్తం కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

పవన్ విషయానికి వస్తే.. పార్టీని పెట్టి ఇన్నేళ్లు అవుతున్నా.. జనసైనికుల పేరుతో రిక్రూట్ చేసుకుంటున్న వారికి సైతం.. తమ లైన్ ఏమిటన్న దాని పై చాలానే కన్ఫ్యూజన్ ఉండటం కనిపిస్తుంటుంది. దీనికితోడు.. వీరిని కంట్రోల్ చేయటానికి డీ సెంట్రలైజేషన్ లేకపోవటం.. ఉన్నదంతా సెంట్రలైజేషన్ కావటంతోపవన్ సింగిల్ పాయింట్ గా నిలుస్తున్నారు. ఈ కారణంతోనే నాందెడ్ల మనోహర్ మినహా సరైన నాయకులు జనసేనలో కనిపించరు. పార్టీ పెట్టి పదేళ్లు అవుతున్న వేళలోనూ.. చెప్పుకోదగ్గ స్థాయిలో నేతల్ని పార్టీ ఎందుకు ఆకర్షించలేకపోయింది? అన్నది మరో ప్రశ్న.

ఇదంతా చూసినప్పుడు పార్టీ నిర్మాణం విషయంలో పవన్ అనుసరించిన విధానాలే ఈ ఇబ్బందులకు కారణంగా చెబుతారు. పార్టీని ఏ స్థాయికి తీసుకెళ్లాలి? అందుకు ఏం చేయాలి? లాంటి మౌలిక ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు లేకుండా.. సందేహాలే సమాధానాలుగా నిలవటం చూసినప్పుడు పార్టీకి అసలు బలహీనత ఏమిటన్నది. స్పష్టమైన మార్గదర్శనంతో పాటు.. ఎప్పుడు ఏ స్టాండ్ తీసుకోవాలి? ఏ విషయంలో ఎవరిని తమ వారిగా భావించాలన్న దానికి సంబంధించిన సమాచారం.. ఎప్పటికప్పుడు క్రమపద్దతిలో వెళ్లే వ్యవస్థ లేకపోవటం కూడా పెద్ద మైనస్ పాయింట్గా మారింది.

దీంతో.. మార్గదర్శి ఎపిసోడ్ లో పార్టీ స్టాండ్ ను.. పవన్ ఆలోచనలకు భిన్నంగా రామోజీ అండ్ కోను ఉతికి ఆరేయటం.. పొత్తుల విషయంలో పవన్ కున్న క్లారిటీ ఆయన్ను అభిమానించే వారికి లేకపోవటం కనిపిస్తుంది. ఈ కారణంగానే.. తన అభిమానులకు.. పార్టీ మద్దతుదారులు.. సానుభూతిపరులకు అర్థమయ్యేందుకు వీలుగా పవన్ రాసిన లేఖ లోని అంశాల్ని చూసినప్పుడు అర్థమవుతుంది. ఈ లేఖలో పవన్ ప్రస్తావించిన అంశాల్నిచూసినప్పుడు.. అంతా కాలిపోయాక నిద్ర లేచిన రీతిలో పవన్ తీరు కనిపిస్తుంది. మొగ్గలో ఉన్నప్పుడు తన మద్దతుదారుల్ని ఒక పద్దతి ప్రకారం వంచకుండా అందుకుభిన్నంగా వదిలేయటం.. వారు కాస్తా ఇప్పుడు ఎవరికి వారు తమ అభిప్రాయాల్ని పవన్ లైన్ గా చెప్పేసే వరకు వెళ్లారు.

ఇలాంటి వారికి విషయాల పరంగా పవన్ ఉద్దేశం ఏంటి? ఆయన వ్యూహం ఏమిటి? ఆయన ఏ రీతిలో అడుగులు వేయాలనుకుంటున్నారు? ఆయనకు మద్దతుగా నిలిచేవారెవరు? హితులు ఎవరు? సన్నిహితులు ఎవరు? లాంటి ప్రశ్నలకు పవన్ సమాధానాల కంటే కూడా.. తమ మనసులోని ఆలోచనలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం జనసేనకు పెద్ద  సమస్యగా మారిందని చెప్పాలి. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికైనా పవన్ మనసులోని మాట ఏమిటన్న విషయాన్ని జనసైనికులు అర్థం చేసుకుంటారా? లేక అర్థం లేని తమ పోరును అంతకంతకూ విస్తరించి.. తమ అధినేత పవన్ ను ఎవరికి కాకుండా చేస్తారా? అన్నది తేలాల్సి ఉంది.

Similar News