పవన్ చెలగాటం....టాలీవుడ్ కి ఇరకాటం...?

Update: 2021-12-13 13:30 GMT
టాలీవుడ్ సున్నితమైనది. ఒక విధంగా చెప్పాలంటే అద్దాల మేడ లాంటిది. సినీ రంగం ఎపుడూ వివాదాలు కోరుకోదు, కోరి అసలు చేసుకోదు. గతంలో కూడా చిత్ర పరిశ్రమ ముఖ్యమంత్రులు ఎవరున్నా, పార్టీలు ఏవైనా కూడా తమ వంతుగా వారితో సన్నిహిత సంబంధాలను నెలకొల్పుకుని ముందుకు సాగుతూ వచ్చింది. సినీ నటుడు ఎన్టీయార్ రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయినా తరువాత చూస్తే సినీ రాజకీయ బంధాలు ఇంకా గట్టి పడ్డాయి కానీ ఎక్కడా ఇబ్బంది రాలేదు.

ఇక అనేక మంది సినీ నటులు రాజకీయాల్లో రాణించారు. ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలిచారు. అయితే నాడు కూడా టాలీవుడ్ కి ఎలాంటి సమస్యలు రాలేదు. అయితే టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి రాజకీయాల్లో దూకుడు చేస్తూ రావడం ఆయన కేవలం జగన్నే టార్గెట్ చేస్తూ తనదైన పాలిటిక్స్ చేయడంతోనే అసలైన తంటా వచ్చిపడింది.

రాజకీయాల్లో విమర్శలను ఎవరూ పట్టించుకోరు. కానీ అవి వ్యక్తిగతమైతేనే ఆలోచిస్తారు. దానికి మించి రాజకీయ ప్రత్యర్ధుల నుంచి శత్రువులుగా సీన్ మారితేనే అసలైన తంటా వస్తుంది. ఇపుడు అదే జరుగుతోంది. పవన్ కళ్యాణ్, జగన్ కి మధ్యన ఏముందో తెలియదు కానీ ఆయన జగన్ మీదనే విమర్శలు చేస్తూ వస్తున్నారు. జగన్ విపక్షంలో ఉన్నపుడే గురి పెట్టిన పవన్ ఇపుడు జగన్ ప్రభుత్వంలో ఉంటే ఊరుకుంటారా. అయితే ఇక్కడే కధ అడ్డం తిరుగుతోంది.

జగన్ చేతిలో పవర్ ఉంది. దాతో ఆయన కూడా తాను చేయాల్సింది చేస్తున్నారు. ఈ మధ్యన పడి టాలీవుడ్ ఫుల్లుగా నలిగిపోతోందని చెబుతున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, టాలీవుడ్ లో టాప్ హీరో. ఆయన సినిమాలు వసూళ్ళ వర్షాన్నే కురిపిస్తాయి. ఆయన సినిమా రిలీజ్ అయితే కనీసం వారం పది రోజుల వరకూ ఆ ఊపే వేరే లెవెల్ లో ఉంటుంది.

ఇదిలా ఉంటే తమ మీద విరుచుకుపడుతూ ఘాటు విమర్శలు చేస్తున్న పవన్ని కట్టడి చేయడానికా అన్నట్లుగా గత ఏడాది వకీల్ సాబ్ మూవీ రిలీజ్ వేళ హడావుడిగా ప్రభుత్వం ఒక ఉత్తర్వును తెచ్చింది. టికెట్ల రేట్లు అడ్డగోలుగా పెంచరాదు అని కూడా స్పష్టం చేసింది. అయితే ఆన్ లైన్ టికెటింగ్ విధానం మాత్రం సినీ పెద్దల కోరిక మీదనే తెచ్చమనై చెబుతున్న ప్రభుత్వం బీ సీ సెంటర్లలో టికెట్ల రేట్లు పెంచమని కోరుతున్నా పట్టించుకోవడంలేదు.

దాంతో ఎంత మంచి టాక్ వచ్చినా కూడా తక్కువ రేటు టికెటింగ్ వల్ల ఏపీలో సినిమాలు ఇబ్బంది పడుతున్నాయి. ఈ మధ్యనే రిలీజ్ అయిన అఖండ మూవీ అయితే ఏపీలోనే దాదాపుగా పాతిక ముప్పయి కోట్ల మేర ఆదాయాన్ని అతి తక్కువ టికెటింగ్ విధానం వల్లనే కోల్పోయిందని ట్రేడ్ వర్గాల మాట. ఈ నేపధ్యంలో రానున్న రోజుల్లో మరిన్ని సినిమాలు వస్తున్నాయి. మరి వాటి సంగతేంటి అంటే ఏపీ సర్కార్ తో సంప్రదింపులు జరుపుకుని వెసులుబాటు పొందడమే అన్న మాట ఉంది.

ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి నుంచి ఇతర సినీ పెద్దలు ప్రభుత్వానికి తన వినతులు ఒక వైపు పంపుతున్నారు. వీలైతే త్వరలో ఒక సిట్టింగ్ కూడా సినీ పెద్దల నుంచి ప్రభుత్వ వర్గాలతో ఉంటుంది అన్న ప్రచారం కూడా ఉంది. అయితే ఇలాంటి వాతావరణం లో మరోసారి వేడి రగిలించేశారు పవన్ కళ్యాణ్.

ఆయన స్టీల్ ప్లాంట్ సమస్య మీద తాజాగా దీక్ష చేస్తూ మధ్యలో సినిమా విషయాన్ని ప్రస్తావించారు. తన ఆర్ధిక మూలాలను దెబ్బ తీయడానికే ఇలా చేశారని కూడా ఆరోపించారు. తన సినిమాలు ఫ్రీగా కూడా ఏపీలో రిలీజ్ చేసుకుంటానని గట్టిగానే సౌండ్ చేశారు. అయన వరకూ సరే కానీ ఇది కేవలం పవన్ కి మాత్రమే పరిమితమైన సమస్య కాదు, యావత్తు సినీ రంగానికి సంబంధించిన అతి కీలకమైన ఇష్యూ. దాంతో ఇపుడు టాలీవుడ్ లో కలవరం రేగుతోంది.

పవన్ దూకుడుగా చేస్తున్న రాజకీయం, మధ్యలో ఆయన సినిమా సమస్యలను ముందుకు తెస్తూ చెలగాట ఆడుతున్న తీరుతో ఏపీ సర్కార్ మరింత బిగుసుకుపోయే అవకాశాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు. అదే జరిగితే రానున్న కాలంలో రిలీజ్ అయ్యే పెద్ద సినిమాల మీద కూడా ఈ ప్రభావం విపరీతంగా పడి యావత్తు సినీ లోకం నష్టపోతుంది అన్న చర్చ కూడా ఉంది. అయితే పవన్ మాత్రం తన రాజకీయం తాను అంటున్నారు. మధ్యలో సినీ రంగాన్ని లాగుతున్నారు.

ఒక విధంగా సున్నిత రంగం అయిన చిత్ర సీమ ఎన్నడూ చూడని ఇబ్బందులను ఇలా చవి చూడాల్సి వస్తోందని కూడా అంటున్నారు. మరి మెగాస్టార్ వంటి సినీ పెద్దలు ఒక వైపు సానుకూలంగానే సమస్యలను పరిష్కరించుకోవాలన్న స్టాండ్ తో ఉంటే పవన్ కళ్యాణ్ మాత్రం బస్తీ మే సవాల్ అంటూ నా సినిమాలు ఫ్రీ అని చెప్పడం వల్ల తీరని నష్టమే కలుగుతుంది అంతున్నారు. ఇదెలా ఉందీ అంటే ముళ్ళ కంపకు తగులుకున్న చీరను ఒడుపుగా చిక్కు విడదీయ‌కుండా బలంగా లాగేస్తున్న తీరున అని సినీ శ్రేయోభిలాషులు వాపోతున్నారు. మొత్తానికి సినీ రంగానికి ప్రభుత్వానికి గ్యాప్ అంతకంతకు పెరిగిపోతోంది తప్ప తగ్గినట్లుగా పించడంలేదు. మరి ఇది ఎంతవరకూ వెళుతుందో ఏమిటో చూడాలి.
Tags:    

Similar News