ఉత్త‌రాంధ్ర‌పై మా వ్యూహం ఇదే: జ‌న‌సేనాని వెల్ల‌డి

Update: 2022-11-21 04:32 GMT
ఉత్తరాంధ్ర ప్రాంతంలో జనసేన పార్టీని పటిష్టం చేసే క్రమంలో ఈ నెల 22 నుంచి ఉమ్మడి విజయనగరం జిల్లాలో సమావేశాలు నిర్వహిస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు. ఆ ప్రాంత ప్రజల కోసం జనసేన పార్టీ అండగా నిలబడుతుందన్నారు. విజయనగరంలో గిరిజన విద్య మిథ్యగా మారిందని విమర్శించారు.

ప్రజలకు మంచి చేయాలనే తలంపు, చిత్తశుద్ధి ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు లేకపోవడం వల్లే విజయనగరం జిల్లాను సమస్యలు పట్టి పీడిస్తున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో జనసేన పార్టీని పటిష్టం చేసే క్రమంలో ఈ నెల 22నుంచి ఉమ్మడి విజయనగరం జిల్లాలో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. నియోజకవర్గాల వారీగా నేతలు, కార్యకర్తలతో నాదెండ్ల మనోహర్ సమావేశమై అక్కడి సమస్యలపై చర్చిస్తారని తెలిపారు.

సమస్యల పరిష్కారంలో ప్రజలకు అండగా నిలబడే విధంగా పార్టీని పటిష్టపరచడంపై కార్యాచరణను రూపొందించామన్నారు. ఈ నెల 13న విజయనగరానికి సమీపంలోని గుంకలాంలో పేదల ఇళ్ల నిర్మాణాల పరిశీలకు వెళ్లినప్పుడు అక్కడి యువకులతో మాట్లాడినట్లు తెలిపారు.

ఉపాధి కరవై వలసలు, పేదరికం, నిరుద్యోగం, అనారోగ్యం ఇలా ఎన్నో సమస్యలు పట్టి పీడిస్తున్నట్లు వారు చెప్పారన్నారు. ఒకప్పుడు జిల్లాకే తలమానికంగా ఉన్న జ్యూట్ పరిశ్రమలు, భీమసింగి చక్కెర కర్మాగారం మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.

తోటపల్లి నిర్వాసితుల సమస్యలు, రామతీర్థ సాగర్ ప్రాజెక్ట్ పనులు ఒక్క అడుగు ముందుకు పడడం లేదన్నారు. గిరిజన విద్య మిథ్యగా మారిందని అభిప్రాయపడ్డారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు ఆస్పత్రులకు వెళ్లాలంటే మంచాలనే డోలీలుగా మార్చి మోసుకుపోవాల్సి రావటం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు.

ఇవన్నీ పరిష్కరించగలిగే సమస్యలే అయినా పాలకుల్లో చిత్తశుద్ధి లేకపోవటం వల్లే అలాగే ఉన్నాయన్నారు. వీటిని తాము అధికారంలోకి రాగానే ప‌రిష్క‌రిస్తామ‌ని ప‌వ‌న్ స్ప‌ష్టం చేవారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News