ఐదుకోట్ల ఆంధ్రుల్లో ఒక్క‌డు దొర‌క‌లేదా?

Update: 2018-05-04 10:39 GMT
అంతా మ‌న‌ది అనుకున్న‌ప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు. కానీ.. ఎక్క‌డిక‌క్క‌డ విభ‌జ‌న చేసుకున్న‌ప్పుడే ప‌రిధి త‌గ్గుతుంది. ప‌రిమితులు ఎక్కువ అవుతాయి. ఉమ్మ‌డి రాష్ట్రంలో ప్రాంతాల పోలిక‌లే త‌ప్పించి.. మ‌రీ అంత విభ‌జ‌న రేఖ‌లు ఉండ‌వు. ఇప్పుడు తెలంగాణ ప్ర‌భుత్వంలో కానీ.. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి అత్యుత్త‌మ స్థానంలో ఒక ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్య‌క్తిని నియ‌మిస్తే రియాక్ష‌న్ ఎలా ఉంటుంది?

మ‌రి.. అలాంటి ప‌రిస్థితి ఏపీకి అప్లై కాదా? అన్న‌ది క్వ‌శ్చ‌న్‌. విభ‌జ‌న త‌ర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య చాలానే విభ‌జ‌న‌రేఖ‌లు స్ప‌ష్టంగా వ‌చ్చేశాయి. వేరే ప్రాంతానికి చెందిన వ్య‌క్తి అయినా ఓకే కానీ.. ఆంధ్రా ప్రాంతానికి తెలంగాణ  వ్య‌క్తి.. తెలంగాణ‌కు ఆంధ్రా ప్రాంతానికి చెందినోళ్లను ఎంపిక చేయ‌టంపై అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. క‌లిసి ఉంటే ఇలాంటివి పెద్ద‌గా ఉండేవి కావు కానీ.. విడిపోయిన త‌ర్వాత ఇలాంటి ఆలోచ‌న‌లు అనివార్యం.

అలాంట‌ప్పుడు ఏపీని తీర్చి దిద్దుతాన‌ని.. ఆంధ్రోళ్ల ఉజ్వ‌ల భ‌విత కోసం తాను త‌పిస్తున్న‌ట్లు చెబుతున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. త‌న రాజ‌కీయ స‌ల‌హాదారు ప‌ద‌విని తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్య‌క్తికి ఎలా ఇస్తారు? అన్న సందేహాన్ని కొంద‌రు వ్య‌క్తం చేస్తున్నారు. అందునా.. ఏపీకి అన్యాయం చేసిన మోడీ పార్టీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్య‌క్తి ఇచ్చే స‌ల‌హాల్ని.. వ్యూహాల్ని అమ‌లు చేసే ప‌వ‌న్ కార‌ణంగా ఏపీ ప్ర‌జ‌ల‌కు జ‌రిగే న్యాయం ఎంత‌? అన్న సందేహం కొంద‌రు వ్య‌క్తం చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధ‌న సంద‌ర్భంగా చాలా స‌మ‌యాల్లో ఒక్క తెలంగాణ బిడ్డ దొర‌క‌లేదా? అన్న ప్ర‌శ్న త‌ర‌చూ వినిపిస్తూ ఉండేది. దీనికి ఎవ‌రూ ఎలాంటి అభ్యంత‌రాలు వ్య‌క్తం చేసేవారు కాదు. అలాంట‌ప్పుడు ఏపీ బేస్డ్ గా పెద్ద ఎత్తున రాజ‌కీయాలు చేయాల‌ని భావిస్తున్న ప‌వ‌న్ త‌న రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప‌ద‌విని ఒక తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్య‌క్తికి ఎలా క‌ట్ట‌బెడ‌తారు?  ఒక‌వేళ‌.. ఏపీకి ఒక‌రిని.. తెలంగాణ‌కు మ‌రొక‌రిని నియ‌మించుకున్నా ఇబ్బంది లేదు. అదేమీ లేకుండా.. హైద‌రాబాద్‌కు చెందిన వ్య‌క్తిని.. అందునా బీజేపీలో చిన్న‌స్థాయి నేత‌గా కొంద‌రికి సుప‌రిచిత‌మైన వ్య‌క్తిని త‌న రాజ‌కీయ స‌ల‌హాదారుగా ఎలా నియ‌మించుకుంటార‌న్న ప్ర‌శ్న‌ను ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ రోజున ఏపీ ఎదుర్కొంటున్న ఎన్నో స‌మ‌స్య‌ల‌కు మూలం రాష్ట్ర విభ‌జ‌న ద‌గ్గ‌ర ఆగుతుంది. అదే స‌మ‌యంలో మోడీ ఇచ్చిన థోకాతో ఏపీకి మ‌రిన్ని క‌ష్టాలు ఎక్కువ అయ్యాయి. అలాంట‌ప్పుడు ప‌వ‌న్ తాను నియ‌మించుకునే కీల‌క వ్య‌క్తుల విష‌యంలో అన్ని కాకున్నా.. కొన్ని అంశాల్ని ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న మాట వినిపిస్తోంది. ప‌వ‌న్ కు రాజ‌కీయ స‌ల‌హాదారుగా ఐదు కోట్ల ఆంధ్రుల్లో ఏ ఒక్క‌రికి అర్హ‌త లేదా? అన్న ప్ర‌శ్న కొంద‌రి నోట వ‌స్తోంది. మ‌రి.. ఇలాంటి వాద‌న‌కు ప‌వ‌న్ రియాక్ష‌న్ ఏమిటి?
Tags:    

Similar News