ప‌వ‌న్ ను చంద్రుళ్ల‌తో స‌మానంగా చూసిన గ‌వ‌ర్న‌ర్‌

Update: 2017-12-25 04:33 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు..ఇద్ద‌రు తెలుగు ముఖ్య‌మంత్రులు ఒక వేదిక మీద‌కు వ‌చ్చారంటే అంద‌రి క‌ళ్లు వారిద్ద‌రి మీద‌నే ఉంటాయి. ఇక‌.. వారిద్ద‌రూ క‌లిసేలా ఎవ‌రైనా ప్రోగ్రామ్ డిజైన్ చేసి.. వారిద్ద‌రిని పిలిచి.. వారిద్ద‌రూ వ‌స్తే.. పిలిచిన పెద్ద మ‌నిషికి ఉండే హ‌డావుడి అంతా ఇంతా కాదు. అయితే.. ఇదే సంద‌ర్భంలో వారిద్ద‌రికి ఎంత ప్రాధాన్య‌త ఇస్తారో.. అంతే ప్రాధాన్య‌త‌ను మ‌రో తెలుగు ప్ర‌ముఖుడికి ఇచ్చే అవ‌కాశం ఉందా? అంటే.. లేద‌నే అంటారు. కానీ.. అది త‌ప్ప‌ని మ‌రోసారి నిరూపించారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న న‌ర‌సింహ‌న్‌.

శీతాకాలం విడిది కోసం ప్ర‌త్యేక బ‌స కోసం హైద‌రాబాద్ వ‌చ్చారు రాష్ట్రప‌తి రామ్ నాథ్ కోవింద్‌. నాలుగు రోజులు ఉండి వెళ్లే ఆయ‌నకు మ‌ర్యాద కోసం త‌న నివాసంలో భారీ విందును ఏర్పాటు చేశారు గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌. ఈ నేప‌థ్యంలో త‌మ అధికార నివాసంలో నిర్వ‌హిస్తున్న విందున‌కు ప‌లువురు ప్ర‌ముఖుల్ని ఆహ్వానించారు గ‌వ‌ర్న‌ర్‌.

ఈ వేడుకుల‌కు భారీగా ప్ర‌ముఖులు హాజ‌రైనా.. అంద‌రి క‌ళ్లు మాత్రం ముగ్గురి మీద‌నే ఉన్నాయి. ఇంత‌కీ ఆ ముగ్గురు ఎవ‌రో కాదు.. తెలంగాణ‌.. ఏపీ సీఎంలు అయితే మూడో వ్య‌క్తి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌. నిజానికి అంద‌రి దృష్టి మాత్ర‌మే కాదు.. గ‌వ‌ర్న‌ర్ సైతం రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల‌కు ఎంత మ‌ర్యాద ఇచ‌చారో.. అంతే మ‌ర్యాద‌ను ప‌వ‌న్‌కు ఇవ్వ‌టం క‌నిపించింది.

ఎలాంటి రాజ్యాంగ ప‌ద‌వి లేని ప‌వ‌న్‌కు గ‌వ‌ర్న‌ర్ ఎందుకంత ప్రాధాన్య‌త ఇచ్చార‌న్నది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఎవ‌రు అవున‌న్నా కాద‌న్నా గ‌వ‌ర్న‌ర్ సాబ్‌.. మోడీ సార్‌కు ఎంత ద‌గ్గ‌రో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. అప్పుడెప్పుడో యూపీఏ హ‌యాంలో గ‌వ‌ర్న‌ర్ గా  సోనియ‌మ్మ డిసైడ్ చేసిన న‌ర‌సింహ‌న్ ను ఇప్ప‌టికి మోడీ కంటిన్యూ చేస్తున్నారంటే.. మాజీ పోలీస్ బాస్ తెలివి ఎంతో ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

ఇంత‌కీ.. ఇద్ద‌రు సీఎంల‌కు స‌మానంగా ప‌వ‌న్‌కు గ‌వ‌ర్న‌ర్ అంత మ‌ర్యాద ఎందుకు ఇచ్చిన‌ట్లు? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం వెతికితే.. రెండు మూడు కోణాలు క‌నిపిస్తాయి. అవున‌న్నా..కాద‌న్నా ఏపీ అధికార‌ప‌క్షానికి మిత్ర‌ప‌క్షంగా ప‌వ‌న్ వ్య‌వ‌హ‌రించ‌టంగా చెప్పొచ్చు. తెలుగు ప్ర‌జ‌ల్లో ప‌వ‌న్‌కు ఉన్న క్రేజ్ గ‌వ‌ర్న‌ర్ ను అలెర్ట్ చేసి ఉండొచ్చు. మూడోది.. అన్ని ప్రోగ్రామ్‌ల‌కు అటెండ్ కాని ప‌వ‌న్‌.. ఎంపిక చేసిన చోట్ల‌కు మాత్ర‌మే వ‌స్తాడ‌న్న విష‌యంపై గ‌వ‌ర్న‌ర్‌ కు అవ‌గాహ‌న ఉండ‌టం. ఇక.. నాలుగోది..కొంత‌మంది ప‌ట్ల కొన్ని చోట్ల అవ‌స‌రానికి మించిన ప్ర‌త్యేక‌త‌ను ఇవ్వ‌టం గ‌వ‌ర్న‌ర్ ద‌గ్గ‌ర క‌నిపిస్తుంది. త‌న‌ను ఘాటుగా విమ‌ర్శించే వారిని ప్ర‌త్యేకంగా ప‌లుక‌రించే ల‌క్ష‌ణం గ‌వ‌ర్న‌ర్ కు ఎక్కువ‌న్న సంగ‌తి తెలిసిందే. ఇదే రీతిలో త‌న‌ను ప‌వ‌న్ విమ‌ర్శించ‌కున్నా.. రానున్న రోజుల్లో ఏపీలో అంతో ఇంతో రాజ‌కీయంగా త‌న ప్ర‌భావాన్ని చూపే ప‌వ‌న్ ప‌ట్ల గ‌వ‌ర్న‌ర్ ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకొని ఉంటార‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News