ప‌వ‌న్ ట్వీట్‌: చ‌నిపోవ‌టానికే సిద్ధ‌ప‌డి వెళుతున్నా!

Update: 2018-04-20 04:45 GMT
జ‌న‌సేన అధినేత త‌న మౌనాన్ని వీడాడు. మ‌న‌సులో సాగుతున్న సంఘ‌ర్ష‌ణ‌ల‌కు ఆయ‌న ఆక్ష‌ర రూపం ఇచ్చాడు. నిన్న రాత్రి మొద‌లైన ఆయ‌న ట్వీట్లు.. ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా పోస్టు చేస్తునే ఉన్నారు. ప‌వ‌న్ తాజా ట్వీట్లు సంచ‌ల‌నంగా ఉండ‌ట‌మే కాదు.. ఊహించ‌ని రీతిలో ఉండ‌టం గ‌మ‌నార్హం.

ప‌వ‌న్ ట్వీట్ల‌ను విశ్లేషిస్తే.. త‌న‌ను ఏళ్ల త‌ర‌బ‌డి సంబంధం లేని వివాదాల్లోకి ప‌దే ప‌దే లాగుతున్న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేయ‌ట‌మే కాదు.. అంత‌లా వేధిస్తున్న‌ప్పుడు ప‌రువు పోతుంద‌ని భ‌య‌ప‌డ‌తారా? అంటూ ప్ర‌శ్నించారు. త‌న‌ను టార్గెట్ చేస్తున్న వారు అధికారంలో ఉన్న వారు.. మీడియాను చేతిలో ప‌ట్టుకున్న వాళ్ల అంగ‌బ‌లం గురించి ప్ర‌స్తావించిన ప‌వ‌న్‌.. ఆత్మ‌గౌర‌వంతో బ‌తికేవాడు.. ఏ క్ష‌ణ‌మైనా చ‌నిపోవ‌టానికి సిద్ధ‌ప‌డితే అస‌లు దేనికైనా భ‌య‌ప‌డ‌తాడా?.. వెన‌క్కి త‌గ్గుతాడా? అంటూ సూటిగా ప్ర‌శ్నించారు.

తాను ఈ క్ష‌ణం నుంచి ఎప్పుడైనా చ‌నిపోవ‌టానికి సిద్ధ‌ప‌డే వెళుతున్న‌ట్లు పేర్కొన్న ప‌వ‌న్‌.. ఒక‌వేళ తానీ పోరాటంలో చ‌నిపోతే.. తాను ఎంతోకొంత పోరాడి చ‌నిపోయాడ‌ని అనుకుంటే చాల‌న్నాడు. దోపిడీ వ్య‌వ‌స్థ‌పై ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగా.. రాజ్యాంగ‌బ‌ద్ధ‌మైన విధానాల‌కు లోబ‌డే పోరాటం చేస్తూ చ‌నిపోయాడ‌ని అనుకుంటే చాలాన్న ఆకాంక్ష‌ను వ్య‌క్తం చేయ‌టం సంచ‌ల‌నంగా మారింది. పోరాటం మొద‌ల్లోనే.. మిగిలిన వారికి భిన్నంగా మ‌ర‌ణం గురించి ప‌దే ప‌దే మాట్లాడుతున్న ప‌వ‌న్ వ్యాఖ్య‌లు దేనికి నిద‌ర్శ‌నం? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. వైరాగ్యంతో మాట్లాడుతున్నారా?  లేక‌.. తాను అన్నింటికి తెగించేసిన వైనాన్ని ఓపెన్ గా చెప్పారా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

ప‌వ‌న్ పెట్టిన మొద‌టి రెండు ట్వీట్ల‌ను య‌థాత‌ధంగా చూస్తే..

"స్వ‌శ‌క్తితో జీవించేవాడు.. ఆత్మ‌గౌర‌వంతో బ‌తికేవాడు.. ఏ క్ష‌ణ‌మైనా చ‌నిపోవ‌టానికి సిద్ధ‌ప‌డితే ఓట‌మి భ‌యం ఉంటుందా? ఆత్మ‌గౌర‌వంతో బ‌తికేవాళ్ల‌ని.. సంవ‌త్స‌రాలుగా.. సంబంధం లేని వివాదాల్లోకి ప‌దే.. ప‌దే.. వీధిలోకి.. లాగిన త‌ర్వాత ప‌రువు పోతుంద‌ని భ‌య‌ప‌డ‌తారా? అధికారంలో ఉన్న వాళ్ల‌కి.. మీడియాని చేతుల్లో పెట్టుకున్న‌వాళ్ల‌కి.. అంగ‌బ‌లం.. అర్థ‌బ‌లం ఉన్న‌వాళ్ల‌కి.. వాళ్లు చేసే అత్యాచారాలకి.. స్వ‌శ‌క్తితో జీవించేవాడు.. ఆత్మ‌గౌర‌వంతో బ‌తికేవాడు.. ఏ క్ష‌ణ‌మైనా చ‌నిపోవ‌టానికి సిద్ధ‌ప‌డితే అస‌లు దేనీకైనా భ‌య‌ప‌డ‌తాడా?  వెన‌కంజ వేస్తాడా?"

"అందుకే నా ప్రియ‌మైన అభిమానుల‌కు.. అక్క‌చెల్లెళ్ల‌కు.. ఆడ‌ప‌డుచుల‌కు.. జ‌న‌సైనికుల‌కు న‌న్ను ఆద‌రించే ప్ర‌తి ఒక్క‌రికి నా హృద‌య‌పూర్వ‌క న‌మ‌స్కారాలు. ఈ రోజు నుంచి నేను ఏ క్ష‌ణం అయినా నేను చ‌నిపోవ‌టానికి సిద్ధ‌ప‌డి ముందుకి వెళుతున్నాను. ఒక‌వేళా నేను ఈ పోరాటంలో చ‌నిపోతే.. మీరు గుర్తుంచుకోవాల్సింది.. నేను ఎంతో కొంత నిస్స‌హాయుల‌కి అండ‌గా.. అధికారం అనేది అండ‌దండ‌లు ఉన్న వారికే ప‌ని చేసే ఈ దోపిడీ వ్య‌వ‌స్థ‌పై.. ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగా.. రాజ్యాంగ‌బ‌ద్ధ‌మైన విధానాలు లోబ‌డే పోరాటం చేస్తూ చ‌నిపోయాడ‌ని అనుకుంటే చాలు"
Tags:    

Similar News