ప‌వ‌న్ బ‌స్సు ఇదిగో!

Update: 2022-10-13 05:38 GMT
జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓవైపు సినిమాలు, మ‌రోవైపు రాజ‌కీయాలు చేస్తూ వ‌స్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌న సత్తాను నిరూపించుకోవాల‌నే గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో దాదాపు 7 శాతం ఓట్లు సాధించిన జ‌న‌సేన పార్టీ తూర్పు గోదావ‌రి జిల్లా రాజోలులో మాత్ర‌మే గెల‌వ‌గ‌లిగింది. ప‌వ‌న్ పోటీ చేసిన గాజువాక‌, భీమ‌వ‌రం రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. అయితే ఏమాత్రం నిరాశ చెంద‌కుండా అప్ప‌టి నుంచి రాజ‌కీయాల్లోనే కొన‌సాగుతున్నారు.

గ‌త ఎన్నిక‌ల్లో వ‌చ్చిన ఏడు శాతాన్ని క‌నీసం 25 శాతం నుంచి 35 శాతానికి చేర్చాల‌నే త‌లంపుతో ఉన్నారు. అంతేకాకుండా జ‌న‌సేన పార్టీ త‌ర‌ఫున ప‌దుల సంఖ్య‌లో అయినా ఎమ్మెల్యేల‌ను అసెంబ్లీలో నిల‌పాల‌నే కృత‌నిశ్చ‌యంతో ఉన్నారు. అన్ని స‌మీక‌ర‌ణాలు, కాలం క‌ల‌సివ‌స్తే కింగ్ మేక‌ర్‌గా నిల‌వాల‌ని కూడా ఆశిస్తున్నారు. గ‌తంతో పోలిస్తే జ‌న‌సేన బాగా బ‌ల‌ప‌డింద‌ని విమ‌ర్శ‌కులు సైతం అంగీక‌రిస్తున్నారు.

మ‌రోవైపు ప‌వ‌న్ ప్ర‌స్తుతం రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న‌ హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు, హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్ చిత్రాలు ఆయ‌న చేతిలో ఉన్నాయి.

ఈ నేప‌థ్యంలోనే అక్టోబ‌ర్ 5 నుంచి ప‌వ‌న్ కల్యాణ్ బ‌స్సు యాత్ర చేస్తార‌ని మొద‌ట ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలో వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వ విధానాలు, త‌ప్పుల‌ను ప్ర‌శ్నిస్తాన‌ని ప‌వ‌న్ ఘాటు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. అయితే ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌స్సు యాత్ర వాయిదా ప‌డింది.

ముందు జిల్లాల‌వారీగా, నియోజ‌క‌వ‌ర్గాల వారీగా పార్టీ స్థితిగ‌తులు, అభ్య‌ర్థుల బ‌లాబ‌లాల‌ను ప‌వ‌న్ తెలుసుకోనున్నారు. ఇది పూర్త‌య్యాక బ‌స్సు యాత్ర ఉంటుంద‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే ప‌వ‌న్ ప్ర‌యాణించే బ‌స్సు స‌ర్వం సిద్ధంగా ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. స్వ‌యంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ తాను యాత్ర చేప‌ట్ట‌బోయే బ‌స్సును ప‌రిశీలిస్తున్న ఫొటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

మ‌రోవైపు అక్టోబ‌ర్ 15న ప‌వ‌న్ క‌ల్యాణ్ విశాఖ‌ప‌ట్నంలో ప‌ర్య‌టించ‌బోతున్నారు. ఆ రోజు ఉత్త‌రాంధ్ర నియోజ‌క‌వ‌ర్గాలు, పార్టీ బ‌లం, అభ్య‌ర్థుల ఎంపిక‌పై ప‌వ‌న్ క‌ల్యాణ్ దృష్టిసారిస్తార‌ని జ‌న‌సేన వ‌ర్గాలు చెబుతున్నాయి. కాగా అదే రోజు వైసీపీ విశాఖ గ‌ర్జ‌న‌ను నిర్వ‌హిస్తోంది. దీంతో ఏపీ రాజ‌కీయాలు హీటెక్కాయి. ఇప్ప‌టికే వైసీపీ నేత‌లు ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై తీవ్ర విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ విశాఖ టూరు మ‌రింత హీట్‌ను పెంచే అవ‌కాశం ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News