ప‌వ‌న్ ఫ్యూచ‌ర్ ప్లాన్ ను చెప్పేశాడు

Update: 2017-10-07 10:24 GMT
కొద్ది వారాల క్రితం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కొన్ని ఆస‌క్తిక‌ర అంశాలు చెప్పుకొచ్చారు. సెప్టెంబ‌రు నుంచి తాను ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే ఉంటాన‌ని.. త‌న స‌మ‌యంలో ఎక్కువ భాగం జ‌నాల‌కే కేటాయిస్తాన‌ని చెప్పారు. ఆయ‌న అన్న‌ట్లే సెప్టెంబ‌రు వ‌చ్చి వెళ్లిపోయింది. అక్టోబ‌రు వ‌చ్చి కూడా వార‌మైంది. కానీ.. ప‌వ‌న్ నుంచి మాత్రం ఎలాంటి మాటా లేదు. ప్ర‌జ‌ల కోసం ఆయ‌న టైంను కేటాయించింది లేదు.

ఇదిలా ఉంటే.. తాజాగా జ‌న‌సేన పార్టీ  మీడియా వ్య‌వ‌హారాలు చూసే హ‌రిప్ర‌సాద్ కొన్ని విష‌యాల్ని చెప్పుకొచ్చారు. త్వ‌ర‌లోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ అంద‌రికి అందుబాటులోకి రానున్న‌ట్లుగా చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నిత్యం తిరుగుతూ అంద‌రికి అందుబాటులోకి ఆయ‌న ఉండ‌నున్న‌ట్లుగా చెప్పారు.

2014 నాటి ప‌రిస్థితుల‌కు అనుగుణంగా తాము బీజేపీ.. టీడీపీల‌కు మ‌ద్ద‌తు ఇచ్చిన విష‌యాన్ని ఆయ‌న చెబుతూ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము ఎవ‌రితో పొత్తు పెట్టుకుంటామో టైం డిసైడ్ చేస్తుంద‌న్నారు. ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై త‌మ‌తో క‌లిసి పోరాడేందుకు వ‌చ్చే వారంతా త‌మ మిత్ర‌ప‌క్షాలుగా ఆయ‌న అభివ‌ర్ణించారు.

త్వ‌ర‌లోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌జాయాత్ర చేయ‌న‌న్నార‌ని.. అయితే.. అదెలా ఉంటుంద‌న్న విష‌యంపై మాత్రం క్లారిటీ ఇవ్వ‌లేదు. ఆయ‌న చేసే యాత్రం పాద‌యాత్ర‌?  లేక‌.. బ‌స్సు యాత్ర? ఇంకేదైనా రూపంలో ఉంటుందో చెప్ప‌ని ఆయ‌న‌.. మొత్తంగా అయితే ఏదో ఒక యాత్ర మాత్రం చేస్తాన‌ని చెప్పారు. ఇంత‌కీ ఈ యాత్ర ఎందుక‌న్న సందేహానికి స‌మాధానంగా ప్ర‌జాస‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోస‌మ‌న్నారు.

రానున్న ఎన్నిక‌ల్లో 60 శాతం టికెట్లు జ‌న‌సేన సైనికుల‌కు కేటాయిస్తామ‌ని ఆయ‌న చెప్పారు. ఏపీ ప్ర‌భుత్వం తీసుకునే నిర్ణ‌యాలు బాగుంటే మ‌ద్ద‌తు ఇస్తామ‌ని.. బాగోలేకుంటే వ్య‌తిరేకంగా పోరాటం చేస్తామ‌న్న ఆయ‌న‌.. ఏపీకి ఇవ్వాల్సిన ప్ర‌త్యేక హోదాపై ఏ పార్టీతో అయినా క‌లిసి పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్న‌ట్లుగా పేర్కొన్నారు. జ‌న‌సేన కోసం ప‌ని చేసే వారంద‌రికి స‌ముచిత స్థానం ఇవ్వ‌నున్న‌ట్లుగా చెప్పారు. అంతా బాగుంది కానీ.. త్వ‌ర‌లో అన్న మాట‌కు  మ‌రికాస్త క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఏదైనా డేట్ అనుకుంటే చ‌క్క‌గా ఉంటుంది క‌దా?
Tags:    

Similar News