కేసీఆర్ ను పొగిడి తప్పు పట్టిన పవన్

Update: 2016-04-11 06:21 GMT
కొన్ని మీడియా సంస్థలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తున్న పవన్ కల్యాణ్.. సినిమా.. రాజకీయ.. చివరకు తన వ్యక్తిగత విషయాల్ని వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను మెచ్చుకుంటూనే.. కొన్ని కీలక వ్యాఖ్యలు చేయటం గమనార్హం. కేసీఆర్ పాలన విషయంలో కాంప్లిమెంట్ మాదిరి వ్యాఖ్యలు చేసిన పవన్.. రాజకీయంగా కేసీఆర్ అనుసరిస్తున్న విధానాల్ని మాత్రం తప్పు పట్టం ఆసక్తికరంగా మారింది.

బయట తాను ఎక్కడ వింటున్నా.. కేసీఆర్ పాలన బాగుందనే చెబుతున్నారని.. తాను మాత్రం ప్రత్యక్షంగా చూడలేదన్నారు. కాకుంటే.. మిగిలిన పార్టీల నుంచి నేతల్ని.. ఎమ్మెల్యేల్ని కలుపుకుపోవాల్సిన అవసరం లేదు కదా? అన్న సందేహాన్నివ్యక్తం చేశారు. మిగిలిన పార్టీల నుంచి ఎమ్మెల్యేలు రావటం ఎంత అడ్వాంటేజ్ అన్నదే తనకున్న సందేహంగా ఆయన చెప్పుకొచ్చారు.

ఉద్యమ స్వరూపంలో వచ్చిన పార్టీకి.. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేల్ని కలుపుకుపోవాల్సిన అవసరం ఉందా? అన్న ప్రశ్నను సంధించిన పవన్.. ‘‘ఒక ఉద్యమ పార్టీకి ఇలాంటి విధానాలు అవసరమా? వేరే పార్టీల ఎమ్మెల్యేల్ని తీసుకురావటం ఏంటి? వినూత్నంగా పోరాటం చేసి అధికారంలోకి వచ్చిన పార్టీకి ఇలాంటివి అవసరం లేదన్నది నా వ్యక్తిగత అభిప్రాయం’’గా చెప్పుకొచ్చారు. పాలనకు మార్కులేసి.. కేసీఆర్ రాజకీయ వైఖరిపై వ్యాఖ్య చేసిన పవన్ మాటలపై కేసీఆర్ రియాక్ట్ అవుతారా..?
Tags:    

Similar News