అన్న పొలిటిక‌ల్ రిటైర్మెంట్ చెప్పిన ప‌వ‌న్‌?

Update: 2018-07-09 07:40 GMT
కొత్త రాజ‌కీయాన్ని ప‌రిచ‌యం చేస్తాం.. రాజ‌కీయాల్ని మార్చేస్తానంటూ పెద్ద బ్యాంగ్ తో ప్ర‌జారాజ్యం పేరుతో రాజ‌కీయ పార్టీని మెగాస్టార్ చిరంజీవి స్టార్ట్ చేయ‌టం తెలిసిందే. 2009 ఎన్నిక‌ల వేళ‌కు పార్టీ పెట్టిన చిరు.. ఆ ఎన్నిక‌ల్లో అనుకున్న రీతిలో సీట్లు సాధించ‌లేక‌పోవ‌టం.. ఆ త‌ర్వాత ఆయ‌న పార్టీని కాంగ్రెస్‌ లో క‌లిపేయ‌టం.. కేంద్ర‌మంత్రి ప‌ద‌విని చేప‌ట్ట‌టం తెలిసిందే. రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం రాజ‌కీయాల మీద పెద్ద‌గా ఆస‌క్తి చూప‌ని చిరంజీవి క్ర‌మ‌క్ర‌మంగా సినిమాల‌కు ద‌గ్గ‌ర‌వుతూ.. రాజ‌కీయాల‌కు దూరం కావ‌టం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. చిరంజీవి త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పేరుతో పార్టీ పెట్ట‌టం.. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అన్న ఉన్న కాంగ్రెస్ పార్టీకి వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేయ‌టం.. టీడీపీ.. బీజేపీల‌తో క‌లిసి కూట‌మిగా ఏర్ప‌డి ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌టం తెలిసిందే. తాజాగా తాను మ‌ద్ద‌తు ఇచ్చిన పార్టీల‌కు వ్య‌తిరేకంగా ఆయ‌న మాట్లాడుతున్నారు.

బీజేపీకి వ్య‌తిరేకంగా కొన్ని వ్యాఖ్య‌లు చేసిన‌ప్ప‌టికీ.. కొద్దికాలంగా మాత్రం ఆయ‌న ప్ర‌ధాని మోడీతో స‌హా అమిత్ షాను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌లేదు.

తాజాగా ఒక జాతీయ మీడియా సంస్థ‌తోమాట్లాడిన సంద‌ర్భంగా త‌న అన్న చిరంజీవి గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. చిరంజీవికి సినిమాల మీద ఆస‌క్తి ఉంద‌ని.. ఆయ‌న రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్న‌ట్లుగా చెప్పారు.  రాజ‌కీయాల‌కు త‌న‌కు సూట్ కావ‌న్న మాట‌ను త‌న అన్న‌చెప్పిన‌ట్లుగా చెప్పారు.

రాజ‌కీయాల్లోకి వెళ్లి త‌ర్వాత తిరిగి సినిమాల్లో ఎంట్రీ ఇస్తూ ఖైదీ నెం 150 మూవీ చేయ‌టం.. అది హిట్ కావ‌టం.. తాజాగా సైరా మూవీ మీద దృష్టి సారించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ మాట్లాడుతూ..రాజ‌కీయాలు త‌న‌కు స‌రిపోవ‌న్న‌ట్లుగా త‌న అన్న త‌న‌తో చెప్పిన‌ట్లుగా చెప్పారు.

2009లో సునామీ లెక్క‌న త‌న అన్న చిరు ఏపీ రాజ‌కీయాల్లోకి వ‌చ్చార‌న్నారు. రాజ‌కీయ పార్టీ పెట్ట‌టం ఒక ఎత్తు అయితే దానిని నిర్వ‌హించ‌టం మ‌రో ఎత్తు అని చెప్పారు.  యాక్ట‌ర్ రాజ‌కీయ నాయ‌కుడిగా మార‌టం అంత తేలికైన విష‌యం కాద‌న్న ప‌వ‌న్‌.. రాజ‌కీయ రంగం చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటార‌ని.. ద‌యా దాక్షిణ్యాలు అస్స‌లు ఉండ‌వ‌న్నారు. వ్య‌క్తిత్వ హ‌న‌నం చేసేందుకు సైతం వెనుకాడ‌ర‌ని వ్యాఖ్యానించారు. ఇదంతా చెప్పిన ప‌వ‌న్ మాట‌ల్ని మొత్తంగా చూస్తే.. చిరు రాజ‌కీయాల‌కు రిటైర్మెంట్ ఇచ్చేసిన‌ట్లే భావించాలా?
Tags:    

Similar News