కాంగ్రెస్‌ పై ప‌వ‌న్ మార్కు పంచ్ ఇదే!

Update: 2018-01-23 11:59 GMT
సినిమాల‌ను వ‌దిలేసి... ఇక‌పై పూర్తి స్థాయి రాజ‌కీయాలు చేస్తాన‌ని ప్ర‌క‌టించిన జ‌న‌సేన అధినేత‌ - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ నిన్న చేసిన వ్యాఖ్య‌ల‌పై న‌లుదిశ‌ల నుంచి ప్ర‌శంస‌ల‌తో పాటు విమ‌ర్శ‌లు కూడా వినిపించాయి. క‌రీంన‌గ‌ర్ వేదిక‌గా నిన్న మీడియా స‌మావేశం పెట్టిన ప‌వ‌న్ క‌ల్యాణ్... చాలా విష‌యాలే మాట్లాడారు. ఈ సంద‌ర్బంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. అదే స‌మ‌యంలో కేసీఆర్ పోరాట స్ఫూర్తిని కీర్తించ‌డంతో పాటుగా కేసీఆర్ పాల‌న బ‌హు బాగా ఉందంటూ దాదాపుగా భ‌జ‌న చేసినంత ప‌ని చేశార‌నే చెప్పాలి. ఈ త‌ర‌హా వ్యాఖ్య‌ల‌పై సాధార‌ణంగా అన్ని రాజ‌కీయ పార్టీల నుంచి ఆయా పార్టీల సిద్ధాంతాల‌కు అనుగుణంగా స్పంద‌న వ‌చ్చి తీరుతుంది. ఈ కోణంలో కాంగ్రెస్ పార్టీ నేత‌లుగా ఉన్న మాజీ ఎంపీ - ఒకప్ప‌టి హీరోయిన్ విజ‌య‌శాంతితో పాటు ఆ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్ర‌భాక‌ర్‌ - బీజేపీ నేత కృష్ణ సాగ‌ర్‌ లు త‌మ‌దైన శైలిలో రెస్పాండ్ అయ్యారు. అస‌లు అధికారంలో ఉన్న పార్టీల‌కు ఇబ్బందులు ఉంటాయ‌ని, అందుక‌నే తాను అధికారంలో ఉన్న పార్టీల‌ను ప్ర‌శ్నించ‌లేద‌ని చెప్పిన ప‌వ‌న్ క‌ల్యాణ్... ఎలాంటి పొలిటీషియ‌నో ఇట్టే అర్థ‌మైపోతుంద‌ని వారు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఈ వ్యాఖ్య‌ల‌పై తాజాగా ప‌వ‌న్ స్పందించారు. తెలంగాణ‌లో తాను చేప‌ట్టిన ఛ‌లోరే ఛ‌ల్ పాద‌యాత్ర రెండో రోజు ఈ విమ‌ర్శ‌ల‌పై స్పందించిన ప‌వ‌న్‌... వారిపై అంతెత్తున ఎగిరిప‌డ్డారు. త‌న సొంత అన్న‌య్య చిరంజీవి కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నార‌న్న విష‌యాన్ని ఆ పార్టీ నేతలు గుర్తుంచుకోవాల‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ను కలిస్తే - ఆయ‌న‌ను ప్రశంసిస్తే కొందరు కాంగ్రెస్ నాయకులు తప్పుగా అర్థం చేసుకున్నారని ప‌వ‌న్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాను ఏ పార్టీకి - ఏ ఒక్కరికీ వ్యతిరేకం కాదని చెప్పారు. తన అన్నయ్య చిరంజీవి కాంగ్రెస్‌ లో ఉన్నారని చెప్పారు. ఆంధ్రా వ్యక్తి తెలంగాణలో ఎలా తిరుగుతారని ప్రశ్నించడం సరికాదని ప‌వ‌న్ అన్నారు. కేసీఆర్ అంటే తనకు ముందు నుంచి ఇష్టమని పవన్ చెప్పారు. ప్రజల కోసం పోరాడే ఏ వ్యక్తిని అయినా తాను గౌరవిస్తానని చెప్పారు. అందులో భాగంగా కేసీఆర్‌ ను ఇష్టపడుతున్నానని తెలిపారు. రాజకీయంగా విభేదించడం - ప్ర‌జ‌ల కోసం పోరాటం సాగించే నేత‌ల‌ను ఇష్ట‌ప‌డటం వేరు అన్నారు.

రాజకీయాల్లో ఉన్నప్పటికీ పోరాటం చేసే వారిని గౌరవిస్తానని చెప్పారు. తాను తెలుగు ప్రజల కోసం పోరాడుతానని పవన్ చెప్పారు. ప్రజా సమస్యలపై విభేదిస్తానని, అవసరమైతే ఎవ‌రితోనైనా గొడవ పెట్టుకుంటానని చెప్పారు. సమస్యలను వారి దృష్టికి తీసుకు వెళ్తానని - పరిష్కారం సూచిస్తానని చెప్పారు. పరిష్కారం కుదరకుంటే పోరాడుతానని చెప్పారు. ఏడు సిద్ధాంతాలతో జనసేన ముందుకు పోతోందని ప‌వ‌న్ తెలిపారు. అవసరమైతే తాను తెలంగాణ ప్రజల కోసం రోడ్డు మీదకు వస్తానని పవన్  చెప్పారు. కొన్ని సందర్భాలల్లో తాను రాజీపడినట్లుగా ఉంటుందని, కానీ అలాంటి పరిస్థితే లేదన్నారు. కొందరు పార్టీని విలీనం చేయమని అడిగారని - అలాంటప్పుడు పార్టీ పెట్టడం ఎందుకని ప్రశ్నించారు. తనకు పునర్జన్మను ఇచ్చిన తెలంగాణ తల్లికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని చెప్పారు.

తాను ఎవరితోనూ రాజీపడనని - తనకు డబ్బు అవసరం లేదని పవన్ చెప్పారు. తనకు ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా ఇలాంటి ఆద‌ర‌ణ‌ దొరకదని చెప్పారు. ఈ ప్రేమ, ఆద‌ర‌ణ‌కు మించి తనకు ఏదీ లేదని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. ఈ తెలంగాణ తల్లికి సేవ చేసే అవకాశం ఇవ్వాలన్నారు. ఆ భాగ్యం నాకు కావాలన్నారు. సేవ చేసే అవకాశం అంటే తాను పదవి కోరుకోవడం కాదన్నారు. ఏ తెలంగాణ కోసమైతే పోరాటం జరిగిందో... ఆ ఆశయ సాధన కోసం తాను కూడా సైనికుడిలా - సేవకుడిలా పోరాటం చేస్తానని చెప్పారు. 2019లో తెలంగాణలో జనసేన బోణీ కొడుతుందని కూడా ప‌వ‌న్ ధీమా వ్య‌క్తం చేశారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో కొన‌సాగుతున్న త‌న సోద‌రుడు చిరంజీవి పేరును ప్ర‌స్తావించిన ప‌వ‌న్‌... ఆ పార్టీకి చెందిన నేత‌లు త‌న‌పై విసిరిన విమ‌ర్శ‌ల‌కు బాగానే తిప్పికొట్టార‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

Tags:    

Similar News