గ్రేటర్ ఎన్నికల వేళ.. హుటాహుటిన ఢిల్లీకి పవన్

Update: 2020-11-24 06:30 GMT
రెండు..మూడు రోజుల క్రితం కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి.. బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ లు ఇరువురు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ కావటం తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్ లో జరుగుతున్న కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ.. జనసేన ఇరువురు కలిసి పోటీ చేయాలని అనుకోవటం.. కారణాలు ఏమైనా అదేమీ వర్క్ వుట్ కాలేదు. దీంతో.. ఇరు పార్టీల మధ్య ఏదో గ్యాప్ చోటు చేసుకుందన్న వాదన వినిపించింది. అదేమీ నిజం కాదన్న విషయాన్ని పవన్ తో జరిగిన భేటీతో తేల్చేశారు కిషన్ రెడ్డి. ఇదిలా ఉంటే.. తాజాగా జనసేన అధినేత హడావుడిగా ఢిల్లీకి బయలుదేరి వెళ్లటం ఆసక్తికరంగా మారింది.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆహ్వానం మేరకు పవన్ కల్యాణ్.. ఆయనకు రాజకీయ సన్నిహితుడైన మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ లు కలిసి దేశ రాజధానికి వెళ్లారు. ఈ రోజు (మంగళవారం) వీరిద్దరూ కలిసి నడ్డాతో భేటీ అవుతారని చెబుతున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం.. రానున్న రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ.. జనసేన రెండు పార్టీలు కలిసి ఎలా ముందుకు వెళ్లాలన్న విషయంపై వారు చర్చిస్తారని చెబుతున్నారు.

ఈ సందర్భంగా ఏపీకి సంబంధించి కీలకమైన అమరావతి.. పోలవరం ప్రాజెక్టు అంశాల్ని చర్చకు వస్తాయని.. అదేవిధంగా గ్రేటర్ లో బీజేపీ తరఫున పవన్ ప్రచారం చేసే అవకాశం ఉందంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఎన్నికల ప్రచారం ముగియటానికి రెండు రోజుల ముందు అంటే.. 28, 29 తేదీల్లో హైదరాబాద్ నగరంలో పవన్ సుడిగాలి పర్యటన ఉంటుందని.. రోడ్ షోలలో ఆయన మాట్లాడతారని చెబుతున్నారు. అయితే.. ఈ వివరాల్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
Tags:    

Similar News