పవన్‌కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పడిన వివాదం చినికి చినికి పెద్ద గాలివానలా మారుతోంది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వర్సెస్ ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య ఏర్పడిన చిన్నపాటి వివాదం కాస్త పెద్దదై కాపు వర్సెస్ రాజుల సామాజికవర్గాల పోరుగా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఇద్దరు హీరోల అభిమానులు వైరివర్గం ఏర్పాటు చేసిన కటౌట్లను ధ్వంసం చేసి, ఫ్లెక్సీలకు నిప్పుపెట్టి భీమవరంలో యుద్ధవాతావరణాన్ని సృష్టించారు. పవన్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరో కటౌట్లను ధ్వసం చేయడాన్ని నిరసిస్తూ అనుమానితుల ఇళ్లపై రాళ్ల వర్షం కురిపించడంతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను కూడా ధ్వంసం చేశారు. దీంతో అక్కడ మూడు రోజులుగా 144 సెక్షన్ కొనసాగుతోంది.
తాజాగా ఈ రోజు పోలీసులు ఈ సంఘటనకు సంబంధించి పదిమంది పవన్ కల్యాణ్ అభిమానులను అదుపులోకి తీసుకున్నారు. ఈ చర్యను నిరసిస్తూ పలువురు పవన్ అభిమానులు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు. దీంతో సద్దుమణిగిందనుకున్న వివాదం మళ్లీ రాజుకుంది. భీమవరం టూ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉండడంతో వారి భవిష్యత్తుపై తల్లిదండ్రులు కూడ ఆందోళన చెందుతున్నారు.