సామాజిక న్యాయ‌మే ప్ర‌జారాజ్యం కొంప‌ముంచింది: ప‌వ‌న్

Update: 2018-11-30 09:18 GMT
ప్ర‌జారాజ్యం పార్టీని స్థాపించిన‌ప్పుడు చిరంజీవి నోటి వెంట ప‌దే ప‌దే వ‌చ్చిన నినాదం సామాజిక న్యాయం. అందుకు అనుగుణంగానే చిరు పార్టీలో టికెట్ల‌ను కేటాయించారు. అయితే - ఆ విధాన‌మే నాడు ప్ర‌జారాజ్యం కొంప‌ముంచింద‌ని అన్నారు జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌. గెలిచే సామ‌ర్థ్యం ఉందా? లేదా? అని చూడ‌కుండా కేవ‌లం కుల స‌మీక‌ర‌ణాల‌నే ప‌రిగ‌ణ‌నలోకి తీసుకోవ‌డంతో అప్ప‌ట్లో తాము దెబ్బ‌తిన్నామ‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.

సాధార‌ణంగా ప్ర‌జారాజ్యం వైఫ‌ల్యాల‌పై మాట్లాడ‌టానికి ప‌వ‌న్ ఇష్ట‌ప‌డ‌రు. అమలాపురంలో చేనేతలతో గురువారం నిర్వ‌హించిన‌ ప్రత్యేక సమావేశంలో మాత్రం ఆ అంశాల‌పై ప‌వ‌న్ స్పందించారు. సామాజిక న్యాయం అంటూ ఎన్నికలకు పోయి 2009లో తాము దెబ్బతిన్నామ‌ని వాపోయారు. అనుకున్న ఆశ‌యాల‌ను నెర‌వేర్చ‌లేక‌పోయామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గెల‌వ‌గ‌ల సామ‌ర్థ్యం లేద‌ని తెలిసినా.. కులాల లెక్క‌లు వేసుకొని నాడు అంద‌ర్నీ సంతృప్తి ప‌రిచేందుకు టికెట్లు కేటాయించాల్సి వ‌చ్చింద‌ని సూచించారు.

జ‌న‌సేన‌లో మాత్రం ఆ త‌ప్పు పున‌రావృతం కానివ్వ‌బోన‌ని ప‌వ‌న్ ఉద్ఘాటించారు. చేనేత కార్మికుల విష‌యాన్ని ప్ర‌స్తావించారు. వారి కష్టాలను చట్టసభలు తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. అయితే - అందుకు ఆ కుల నాయ‌కుల‌కు టికెట్లు ఇవ్వ‌డమొక్క‌టే స‌రైన విధాన‌మ‌ని భావించ‌కూడ‌ద‌ని చెప్పారు. తూర్పు గోదావ‌రి జిల్లాలో మూడు స్థానాలను ఇవ్వాలని చేనేత‌లు కోరుతున్న‌ట్లు ప‌వ‌న్ తెలిపారు. కేవలం చట్టసభల్లో 2-3 సీట్లిస్తే చేనేతలకు న్యాయం జరగద‌ని సూచించారు. గ‌తంలో చాలామంది కుల నాయ‌కులు చ‌ట్ట‌స‌భ‌ల‌కు వెళ్లి వ్య‌క్తిగ‌తంగా బాగుప‌డ్డారే త‌ప్ప కులాల గోడును ప‌ట్టించుకోలేద‌ని గుర్తుచేశారు. గెలవగలిగే సామర్థ్యం ఉంటే కచ్చితంగా చేనేత కార్మిక కులం వారికి తాను సీట్లు ఇస్తాన‌ని హామీ ఇచ్చారు. కుదరని పక్షంలో నామినేటెడ్ పోస్టులైనా ఇస్తామ‌ని భ‌రోసా ఇచ్చారు. మొత్తానికి నాడు అన్న ఓట‌మికి కార‌ణ‌మైన అంశాలు నేడు త‌మ్ముడికి పాఠాలుగా మారాయ‌ని.. అందుకే ప‌వ‌న్ టికెట్ల కేటాయింపుపై తొంద‌ర‌ప‌డి మాటివ్వ‌డం లేద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి.

   

Tags:    

Similar News