నీ కొడుకును పంపు స‌మ‌స్య‌ల్ని చూపిస్తా

Update: 2018-07-07 04:37 GMT
బాబుపై ప‌వ‌న్ షాకింగ్ వ్యాఖ్య‌లు చేశారు. సీఎంగా ప‌గ్గాలు చేప‌ట్టిన బాబుపై గ‌డిచిన నాలుగేళ్లుగా మాట అనేందుకు విప‌రీతంగా ఆలోచించిన ప‌వ‌న్ ఇప్పుడు అందుకు భిన్నంగా విరుచుకుప‌డుతున్నారు. నాలుగేళ్లుగా పెద్ద మ‌నిషి.. అనుభ‌వం ఉన్న వ్య‌క్తి.. అంటూ చంద్ర‌బాబు గురించి ముద్దు ముద్దుగా మాట్లాడిన జ‌న‌సేన అధినేత ఇప్పుడు అందుకు భిన్నంగా తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శిస్తున్నారు.

ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌కు ధీటుగా టీడీపీ నేత‌లు విరుచుకుప‌డ‌టంతో అంత‌కంత‌కూ ఆగ్ర‌హాన్ని ద‌ట్టించేలా ప‌వ‌న్ మాట‌లు మారుతున్నాయి. తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. కొద్ది నెల‌లుగా ఉత్త‌రాంధ్రపై ఫోక‌స్ చేసిన ప‌వ‌న్‌.. అక్క‌డి స‌మ‌స్య‌లు.. అక్క‌డి స్థానిక ప‌రిస్థితుల గురించి అవ‌గాహ‌న‌ను పెంచుకుంటున్నారు.

తాజాగా అమ‌రావ‌తి.. కాకినాడ సెజ్.. పోల‌వ‌రం.. సోంపేట‌.. వంశ‌ధార ప్రాజెక్టులు.. భావ‌న‌పాడు పోర్టు.. కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం.. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు భూ నిర్వాసితుల‌తో క‌లిసి విశాఖ‌లో ఏపీ భూ నిర్వాసితులతో క‌లిపి స‌భ‌ను నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు స‌ర్కారు తీరుపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

ఉత్త‌రాంధ్ర‌లో స‌మ‌స్య‌లు మీ కంటికి క‌నిపించ‌కుంటే.. నీ కొడుకును పంపు అంటూ చంద్ర‌బాబుకు సూచ‌న చేశారు ప‌వ‌న్‌. పురాణాల్లో హిర‌ణ్య‌క‌శ్య‌పుడి మాదిరే నేటి పాల‌కులు భూములు లాక్కొని రైతును.. రైతు కుటుంబాల‌ను రోడ్ల మీద‌కు వేస్తున్నార‌న్నారు. రాజ‌ధాని క‌నిపించ‌దని.. పరిశ్ర‌మ‌లు రావ‌ని.. ఉద్యోగాలు ఇవ్వ‌రు కానీ.. ఆ పేర్లు చెప్పి వేలాది ఎక‌రాల‌ను బ‌ల‌వంతంగా లాక్కుంటున్న‌ట్లు చెప్పారు.

రైతుల‌ను వ్య‌వ‌సాయానికి దూరం చేస్తున్న దుర్మార్గం అంత‌కంత‌కూ పెరుగుతోంద‌న్నారు. విశాఖ‌ప‌ట్నంలో ఇన్నో సొల్యూష‌న్స్.. ప్రాంక్లిన్ టెంపుల్ట‌న్ సంస్థ‌ల‌కు ఎక‌రం రూ.35 ల‌క్ష‌ల‌కే క‌ట్ట‌బెట్టిన‌ట్లుగా చెప్పారు. 2013 భూసేక‌ర‌ణ చ‌ట్టం అమ‌లు చేసే వ‌ర‌కూ.. భూ నిర్వాసితుల‌కు న్యాయం జ‌రిగే వ‌ర‌కూ పోరాటం చేయ‌నున్న‌ట్లు చెప్పారు. 2019లో ఎన్నిక‌ల్లో టీడీపీ గూండాలు పెట్రేగిపోతార‌ని..దౌర్జ‌న్యంగా ఓట్లు వేయించుకుంటార‌న్న వ్యాఖ్య‌ను చేశారు.


Tags:    

Similar News