ప‌వ‌న్ లెక్క‌...తిక్క‌...బ‌య‌ట‌ప‌డిందిగా!

Update: 2018-06-03 10:21 GMT
`నాక్కొంచెం తిక్కుంది....దానికో లెక్కుంది....అంద‌రి లెక్క‌లూ తేలుస్తా...`అంటూ జ‌న‌సేన అధ్యక్షుడు - సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ సినిమాలో చెప్పిన డైలాగ్ బాగా పాపుల‌ర్ అన్న సంగ‌తి తెలిసిందే. అయితే, ఆ లెక్క‌లు...తిక్క‌లు...డైలాగులు అన్నీ సినిమాల‌కు వ‌ర‌కు స‌రిపోతాయ్ కానీ రాజ‌కీయాలు - నిజ‌జీవితంలో అవి పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కావ‌న్న సంగ‌తి ప‌వ‌న్ గ్ర‌హించిన‌ట్లు లేదు. స్వ‌త‌హాగానే బహిరంగ స‌భల్లో మాట్లాడే స‌మ‌యంలో ప‌వ‌న్ కొద్దిగా ఉద్వేగానికి...ఆవేశానికి లోన‌వుతార‌ని టాక్ ఉంది. తాజాగా, విజ‌య‌న‌గరం ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప‌వ‌న్ మ‌రోసారి ఆవేశ‌పూరిత ప్ర‌సంగం చేశారు. త‌న‌పై టీడీపీ నేత‌లు అర్థంప‌ర్థం లేని ఆరోప‌ణ‌లు చేస్తే తాను నిజంగానే ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొడ‌తానని ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను బీజేపీ రాసిచ్చిన స్క్రిప్ట్ చ‌దువుతున్నాన‌ని టీడీపీ నేత‌లు ప‌దే ప‌దే ఆరోపిస్తున్నార‌ని, ఆ ఆరోప‌ణ‌లు కొన‌సాగితే తాను చేయాల్సింది తాను చేస్తాన‌ని చెప్పారు. భోగాపురంలో నిర్వహించిన ర్యాలీలో ప‌వ‌న్ మ‌రిన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

నాలుగేళ్ల పాటు ప‌వ‌న్ - బీజేపీల‌తో అంట‌కాగిన టీడీపీ నేత‌లు.....తెగ‌దెంపులు చేసుకున్న త‌ర్వాత‌ వారిపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ప‌వ‌న్ వెనుక బీజేపీ ఉంద‌ని, మోదీ చెప్పిన‌ట్లు ప‌వ‌న్ ఆడుతూ...టీడీపీపై విమర్శ‌లు గుప్పిస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు. ప‌వ‌న్ విజ‌య‌న‌గరం ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో బొబ్బిలి ఎమ్మెల్యే  సుజయకృష్ణరంగారావు ప‌వ‌న్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. బీజేపీ రాసిచ్చిన‌ స్క్రిప్టును ప‌వ‌న్ చదువుతున్నారని ఆరోపించారు. అంతకుముందు కూడా చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలంతా ఇదే త‌ర‌హా ఆరోపణలు చేశారు. దీంతో పవన్ ఆ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్నారు. వాస్తవానికి త‌న‌కు ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టే ఉద్దేశ్యం లేద‌ని, కానీ...ఆ ఆరోప‌ణ‌లు కొన‌సాగితే నిజంగానే ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొడ‌తాన‌ని ప‌వ‌న్ షాకింగ్ కామెంట్స్ చేశారు. టీడీపీ నేత‌లు .....ప్ర‌జాధ‌నాన్ని దోపిడీ చేస్తూ ప్రజలకు నష్టం చేకూరిస్తే ప్రజలను నిజంగానే తాను రెచ్చగొడతానని ప‌వ‌న్ అన్నారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు, టీడీపీ నేత‌ల‌పై ప‌వ‌న్ మండిప‌డ్డారు. ఉపాధి అవకాశాలు కల్పించడంలో టీడీపీ ప్రభుత్వం విఫ‌ల‌మైంద‌ని, కానీ, సింగపూర్‌ తరహా అభివృద్ధి అంటూ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. సింగ‌పూర్ లో కుల‌మ‌త ప్రాంతాల‌కు అతీతంగా సమాన అవకాశాలు కల్పిస్తారని, కానీ, టీడీపీ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. భోగాపురంలో ప్ర‌జ‌ల నుంచి భూములు లాక్కుని అభివృద్ధి చేయట్లేదని మండిప‌డ్డారు.

అయితే, ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై ప‌లు విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నిక‌ల‌కు మ‌రో ఏడాది మాత్ర‌మే గ‌డువున్న నేప‌థ్యంలో ప‌వ‌న్ ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రికాద‌నే అభిప్రాయాలు స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తానెంతో బాధ్య‌తగా వ్య‌వ‌హ‌రిస్తాన‌ని, బాధ్య‌తాయుత‌మైన రాజ‌కీయాలు చేస్తాన‌ని నొక్కివ‌క్కాణించే ప‌వ‌న్....ప్ర‌జ‌లను రెచ్చగొడతానంటూ వ్యాఖ్యానించడం సరికాదు. జ‌న‌సేనానిగా క‌న్నా స్టార్ హీరోగా విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఉన్న ప‌వ‌న్ ....సినిమాల‌ను, రాజకీయాలను వేర్వేరుగా చూడాలి. సినీ ఫ‌క్కీలో ప్ర‌సంగాలు ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షిస్తాయి కానీ...ఇటువంటి సినిమా డైలాగులు చెప్పి ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొడితే...రాష్ట్రంలో శాంతి భద్ర‌త‌లు అదుపుత‌ప్పే ప్ర‌మాద‌ముంది. అయినా, రాజ‌కీయాల‌న్న త‌ర్వాత ఇటువంటి ఆరోప‌ణ‌లు వంద ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ఆ ఆరోప‌ణ‌ల‌కు దీటుగా ప్ర‌త్యారోప‌ణ‌లు చేయ‌డం...దీటుగా విమ‌ర్శించ‌డం వంటివి ప‌వ‌న్ చేయ‌డం వ‌ల్ల ఎవ‌రికీ ఎటువంటి ఇబ్బంది ఉండ‌దు. కానీ, ఇలా బెదిరింపుల‌కు పాల్ప‌డ‌డం వ‌ల్ల అభిమానులు  - కార్య‌క‌ర్త‌లు స్ఫూర్తి పొందితే ప‌వ‌న్ కే ఇబ్బందులు ఏర్ప‌డ‌తాయి. మ‌రి, భ‌విష్య‌త్తులోనైనా జ‌న‌సేనాని....సినిమా డైలాగులు మాని...స‌హేతుకమైన విమ‌ర్శ‌లు చేస్తారో లేదో వేచి చూడాలి.
Tags:    

Similar News