పవన్ మళ్లీ ఇరుక్కున్నాడే..

Update: 2018-05-24 09:30 GMT
రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు మామూలే. కానీ అవి శ్రుతిమించినపుడు ఇబ్బందుల్లో పడక తప్పదు. నాయకులు చేసే ఆరోపణల్ని ప్రత్యర్థులు అన్నిసార్లూ తేలిగ్గా తీసుకోరు. ఆధారాల్లేకుండా ఆరోపణలు చేస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కు నెమ్మదిగా బోధపడేటట్లు కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని మీడియా సంస్థల మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసి ఇరుక్కున్నాడు పవన్. ఆ ఛానెళ్లన్నీ పవన్ మీద లీగల్ యాక్షన్ కు రెడీ అవడంతో ఇరుకున పడి రాజీకి వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఉత్తరాంధ్రలో యాత్ర చేస్తున్న పవన్ అక్కడ ఒక ఎమ్మెల్యే కుటుంబం మీద చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. ఆ ఎమ్మెల్యే మరెవరో కాదు.. సర్దార్ గౌతు లచ్చన్న తనయుడు గౌతు శివాజీ.

ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన శివాజీపై సంచలన ఆరోపణలు చేశాడు పవన్. ఆయన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని.. ఇక్కడి జనాలందరూ ‘అల్లుడి పన్ను ’ చెల్లించుకోవాల్సి వస్తోందని పవన్ అన్నాడు. శివాజీ అల్లుడు వెంకన్న చౌదరి జనాల నుంచి ప్రతి పనికీ డబ్బులు వసూలు చేస్తున్నాడనే అర్థంలో పవన్ ఈ ఆరోపణలు చేశాడు. దీనిపై శివాజీ కుటుంబం మండిపడింది. తమ కుటుంబంపై ఎన్నడూ అవినీతి ఆరోపణలు రాలేదని.. పవన్ ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తాడని.. అతను చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపించాలని అన్నారు. లేని పక్షంలో న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని.. ఈ విషయాన్ని తేలిగ్గా వదిలే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. మరి దీనిపై పవన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
Tags:    

Similar News