పవన్ తాజా ట్వీట్ కు భారీ ట్రోల్.. వీరాభిమానులు సైతం షాకిస్తున్నారు

Update: 2019-11-21 04:15 GMT
పవన్ అభిమానులు.. వీరాభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవర్ స్టార్ గా అండగా నిలవటమే కాదు..సైనికుల మాదిరి తమ అభిమాన నటుడు కమ్ రాజకీయ నేత తరఫు వకల్తా వినిపించటానికి సిద్ధంగా ఉంటారు. అలాంటి వీరాభిమానులు సైతం విరుచుకుపటమే కాదు.. అన్నా.. ముందా ట్వీట్ పోస్టును డిలీట్ చేయండన్నా అని కోరుకునే పరిస్థితి ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.

ఏపీలోని సర్కారీ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియం చేస్తామంటూ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తాజాగా ఒక ట్వీట్ ను పోస్టు చేశారు. యూఎస్ లోని ఐస్ క్రీం పార్లర్ లో పని చేసే అమెరికన్ జాతీయుడు ఇసాక్ రిచర్డ్స్ మాట్లాడే తెలుగు వీడియోను పోస్టు చేశారు.

మన నుడి.. మన నది అన్న శీర్షికతో పోస్టు చేసిన ఈ వీడియోలో.. మనం మన అమ్మభాషను మర్చిపోతుంటే.. అతను మాత్రం తెలుగును ఎలా మాట్లాడుతున్నారో చూడండంటూ పవన్ చేసిన పోస్టు పెద్ద ఎత్తున ట్రోల్ కు గురి అవుతోంది. ఈ వీడియోను వెంటనే డిలీట్ చేయాలని పవన్ ను విపరీతంగా అభిమానించే వారు సైతం కోరటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అన్నా.. ఆ వీడియో డిలీట్ చేయ్.. ఆ కుర్రాడు కన్వర్షన్ బ్యాచ్. మళ్లీ తప్పులో కాలేశావ్ అని పేర్కొన్నారు. నిజానికి ఈ కుర్రాడికి సంబంధించిన వీడియో వైరల్ అయిన సమయంలో బీజేపీ నేతలు పలువురు.. ఐసాక్ ఏపీలో కొంతకాలం పని చేశాడని.. క్రైస్తవ మిషనరీ తరఫున పని చేసినట్లుగా పేర్కొని విమర్శలు చేశారు
.
అంతేకాదు.. ఎన్నికల వేళ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సమావేశాల్లో ఈ కుర్రాడు పాల్గొనేవాడని.. డల్లాస్ లో జరిగిన జగన్ మీటింగ్ కు సైతం హాజరైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇలాంటి విషయాల్ని గమనించకుండా పవన్ ఎలా వీడియోల్ని అప్ లోడ్ చేస్తారన్న విస్మయం వ్యక్తమవుతోంది. తాజాగా పెట్టిన వీడియోకి బదులుగా మీ రష్యన్ సతీమణి మాట్లాడే తెలుగు మాటల వీడియోను షేర్ చేసినా ఫలితం ఉండేది? ఇలా చేయటం ఏమిటి పవన్? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఎలాంటి ముందుచూపు లేకుండానే పవన్ ఇలా వీడియోలు ట్వీట్ చేసి తప్పులో కాలేస్తున్నారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
Tags:    

Similar News