మాట తప్పిన పవన్

Update: 2021-10-10 07:22 GMT
'చనిపోయిన ఎంఎల్ఏ కుటుంబ సభ్యులు పోటీ చేస్తున్నపుడు తమ పార్టీ తరపున ఎవరినీ పోటీ పెట్టేదిలేదు'.. కడప జిల్లాలోని బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు. పవన్ నిర్ణయం మంచిదే అని అందరూ అనుకున్నారు. కానీ నాలుగు రోజులు గడిచేటప్పటికి మాట మార్చేస్తాడని ఎవరు అనుకోలేదు. ఇప్పుడు బద్వేలులో జనసేన పోటీ చేయబోవడం లేదు. కానీ పోటీ చేస్తున్న మిత్రపక్షం బీజేపీకి మద్దతుగా ప్రచారంలోకి దిగింది.

బద్వేలులో డైరెక్టుగా జనసేన పోటీ చేయకపోతే ఏమిటి ? పోటీలో ఉన్న మిత్రపక్షం బీజేపీకి మద్దతుగా రంగంలోకి దిగితే మరోటీనా ? ఉపఎన్నికలో ప్రత్యక్షంగా చేయలేని పనిని పరోక్షంగా చేస్తోందంతే. ఇంతోటి దానికి సంప్రదాయమని, విలువలని పవన్ కథలు చెప్పడం ఎందుకో అర్థం కావడం లేదు. చనిపోయిన వైసీపీ దివంగత ఎంఎల్ఏల డాక్టర్ వెంకటసుబ్బయ్య కుటుంబంపై పవన్ కు నిజంగానే గౌరవం ఉంటే బీజేపీ తరఫున ప్రచారానికి కూడా దిగకూడదు.

కానీ పవన్ అలా చేయకుండా నేరుగా పోటీచేయం కానీ మిత్రపక్షం బీజేపీ అభ్యర్థి విజయానికి సాయం చేస్తామని చెప్పటంలో ఏమన్నా అర్థముందా ? వైసీపీని ఓడించాలనే కోరిక పవన్ లో చాలాబలంగా ఉందన్నది వాస్తవం. అయితే దానికి తగ్గ వ్యూహం పవన్ లో కనిపించడం లేదు. ఆ విషయం పవన్ కు తెలుసో లేదో కానీ మిగిలిన వాళ్ళందరికీ మాత్రం బాగా తెలుసు. ఎందుకంటే తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికలో కూడా బీజేపీ అభ్యర్థి రత్నప్రభ గెలుపుకోసం పవన్ చాలానే ప్రయత్నించారు. కానీ చివరకు జరిగిందేమిటో అందరికీ తెలిసిందే.

బీజేపీ తరపున జనసేనాని మాత్రమే కాకుండా చాలామంది స్టార్ క్యాంపెయినర్లు వచ్చారు. రోజుల తరబడి తిరుపతి లో మకాం వేసి ప్రచారాన్ని హోరెత్తించారు. ఇంత జరిగినా చివరకు కమలం అభ్యర్థికి కనీసం డిపాజిట్  కూడా దక్కలేదు. రేపు బద్వేలు ఉపఎన్నికలో అయినా జరగబోయేది ఇదే అని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. తమ అభ్యర్థికి కనీసం లక్షఓట్లకు తక్కువ కాకుండా మెజారిటి రావటం ఖాయమని వైసీపీ నేతలు జోస్యం కూడా చెప్పేస్తున్నారు.

సరే వాళ్ళు చెప్పినట్లు లక్ష మెజారిటి వస్తుందా లేదా అన్నది వేరే సంగతి. మొత్తానికి రికార్డు స్ధాయి మెజారిటికి వైసీపీ నేతలు గురిపెట్టిందైతే వాస్తవం. పోటీలో ఉన్నది కాంగ్రెస్, బీజేపీ మాత్రమే కాబట్టి వైసీపీ నేతలు చెప్పుకుంటున్నట్లు లక్ష ఓట్ల మెజారిటి వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇంతోటి దానికి పవన్ ప్రచారానికి వస్తారని, ప్రచారం హోరెత్తిపోతుందని కమలం నేతలు చెప్పుకోవడమే విచిత్రంగా ఉంది. తిరుపతిలో పవన్ సత్తా ఏమిటో తేలిపోయింది. తొందరలోనే బద్వేలులో కూడా జనాలు చూడబోతున్నారు. చూద్దాం చివరకు ఏమవుతుందో.
Tags:    

Similar News