జనసేన గెలిస్తే చిరంజీవే సీఎం?

Update: 2017-12-08 05:13 GMT
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పర్యటనలో భాగంగా చేస్తున్న ప్రసంగాలు ఆయన రాజకీయ ఎత్తుగడలను ప్రతిబింబిస్తున్నాయన్న చర్చ తెలుగు రాష్ర్టాల్లో జరుగుతోంది. రాజకీయ - మీడియా వర్గాలతో పాటు ఆన్ లైన్ ప్లాట్ ఫాంలోనూ గత రెండు రోజులుగా పవనే హాట్ టాపిక్. ఈ సందర్భంగా ఆయన అభిమాన - వ్యతిరేక వర్గాలు ఎవరికి వారు ఆయన తీరుపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పెట్టిన తరువాత ఇంతవరకు ఎన్నడూ లేనట్లుగా ఆయన తన అన్న చిరంజీవిని ఫోకస్ చేస్తుండడం చర్చనీయమవుతోంది. తన అన్నకు కొందరు ద్రోహం చేశారని - అందుకే ఆయన సీఎం కాలేకపోయారని పవన్ తెగ బాధపడిపోతున్నారు.
    
పవన్ ప్రసంగాలను చూస్తే ప్రధానంగా రెండు అంశాలు కనిపిస్తున్నాయి. ఒకటి చిరంజీవిని ఫోకస్ చేస్తుండడం.. రెండోది సీఎం కావడానికి రాజకీయ అనుభవం అవసరం అని చెప్తుండడం. దీంతో పవన్ మాటల్లో లోతును వెతకడం మొదలుపెట్టారు విశ్లేషకులు. కాలం కలిసొచ్చి తన పార్టీ అధికార పీఠం వరకు వస్తే ఆ పీఠాన్ని తనకు నట వారసత్వం అందించిన అన్నకు అప్పగించే ఆలోచనలో ఉన్నారని... పవన్ లక్ష్యం అదేనని నెటిజన్లు అంటున్నారు.
    
చిరుకు కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉందన్న కారణం చూపుతూ ఆయన్న సీఎం అభ్యర్థిగా ముందుకు పెడతారని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ కూడా ఏకతాటిపై లేరన్నది కాదనలేని సత్యం. పవన్ ఫ్యాన్సు - చిరు ఫ్యాన్స్ - బన్నీ ఫ్యాన్స్ ఇలా స్వల్ప విభజన కూడా ఉంది. ఫ్యాన్స్ ఏకీకరణ చేపట్టి ఎన్నికల నాటికి చిరును పార్టీలోకి తీసుకొచ్చి అన్నదమ్ములిద్దరూ రాష్ర్టమంతా పర్యటించే యోచనలో ఉన్నట్లు అంచనాలు వస్తున్నాయి.
Tags:    

Similar News