ప్రజా సమస్యలు కాదు.. సీఎం సీటుపైనే చర్చంతా పవన్?

Update: 2019-07-31 12:30 GMT
ప్రజా సమస్యల్ని పరిష్కరించాలన్న తపన కంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఆరాటమే ఎక్కువగా కనిపిస్తోంది పవన్ కల్యాణ్ అండ్ కోలలో. ఇటీవల జరిగిన ఎన్నికల్లోపార్టీ దారుణ పరాజయం పాలు కావటమే కాదు.. చివరకు పార్టీ అధినేత సైతం ఓడిపోయిన అవమానాన్ని పక్కన పెట్టేసిన జనసైనికులు.. అధికారం తమ చేతికి రావాలంటే ఏం చేయాలన్న విషయంపై అభిప్రాయాలు చెప్పటం షురూ చేశారు. వారి మాటలన్ని తమ అధినేత సీఎం కావాలని.. అధికారం తమ చేతిలో ఉండాలన్న ధ్యాసే తప్పించి.. ప్రజా సమస్యలు.. రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలన్న దానిపై వారి ఆలోచనలు లేకపోవటం గమనార్హం.

తాజాగా కాకినాడలో సమావేశాన్ని ఏర్పాటు చేసిన పవన్ కల్యాణ్.. పార్టీ నేతలు.. కార్యకర్తల నుంచి అభిప్రాయాల్ని సేకరిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవటానికి కారణాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా తమ అభిప్రాయాల్ని వెల్లడించిన పలువురు కార్యకర్తలు.. క్షేత్రస్థాయిలో నికార్సైన సమాచారాన్ని ఇవ్వాలని నిర్మొహమాటంగా చెప్పటం గమనార్హం. పార్టీ అధికారంలోకి రావాలంటే పవన్ కల్యాణ్ ప్రజల్లో తిరగాలని.. ఒక ఏడాది పాటు రాష్ట్రం మొత్తం తిరగాలని.. పాదయాత్ర చేస్తే పవర్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలా చేయటం ద్వారా వచ్చే ఎన్నికల్లో సమర్థవంతంగా పోరాడే అవకాశం ఉందన్నారు.

గ్రామాల్లో పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న మాట వినిపించింది. సంస్థాగతంగా పార్టీ నిర్మాణం జరగకపోవటం కూడా ఓటమికి కారణంగా పలువురు ప్రస్తావించారు. జగన్ ప్రభుత్వం మీద రోశయ్య చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ.. ఆయన మాటలు జగన్ ప్రభుత్వం తీరును చెప్పేస్తున్నట్లుగా అభివర్ణించారు. పార్టీ నిర్మాణం కొంతమేర జరిగినా.. ఎన్నికల్లో దారుణ ఓటమి తప్పేదన్న వ్యాఖ్యలు చేశారు.

పవన్ పాదయాత్రను ప్రకటిస్తే.. తాము వెనకుండి నడిపిస్తామని పేర్కొనటం గమనార్హం. కార్యకర్తల మాటలు ఈ తీరులో ఉంటే.. జనసేన తరఫున ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు పలువురు మాత్రం జగన్ మీద వ్యక్తిగత విమర్శలు చేయటం కనిపించింది. కొన్ని వ్యాఖ్యలు హద్దులు దాటినట్లుగా ఉన్నాయి. జగన్ ను ఉద్దేశించి వ్యక్తిగత వ్యాఖ్యలు చేసేందుకు జనసేన నేతలు వెనుకాడలేదు.

పార్టీ అభ్యర్థులుగా బరిలోకి దిగి ఓడిన పంతం నానాజీ.. సూర్య చంద్ర.. ముత్తా శశిధర్ లు సీఎం జగన్ ను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశారు. 16 నెలలు జైలుజీవితాన్ని గడిపి వచ్చిన జగన్ ను నానాజీ దొంగగా అభివర్ణించి.. ఆయనపై దారుణ వ్యాఖ్యలు చేశారు.  జగన్ ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయనట్లుగా మండిపడ్డారు. ప్రజా బలం లేని ప్రభుత్వంగా ధ్వజమెత్తటం గమనార్హం. పార్టీ పవర్లోకి రావాలంటే పవన్ పాదయాత్ర చేయాలని.. ప్రజల్లో ఉండాలన్నారు. ఈ దిశగా ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని పలువురు వ్యాఖ్యానించటం విశేషం. మొత్తంగా పవన్ పాదయాత్ర చేస్తే పార్టీ ఫేట్ మొత్తం మారిపోతుందన్న మాటపై జనసేనాని ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.


Tags:    

Similar News