పవన్.. నేటి తరం కాదు.. రేపటి తరం అధినేత

Update: 2022-12-20 01:30 GMT
శ్రమించాలే కానీ సాధ్యం కానిది ఏమీ ఉండదన్న విషయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. దాదాపుగా పదేళ్లుగా ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న ఆయనలో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపించటమే కాదు.. ఆయన మాటల్లో వాడితనం అంతకంతకూ పెరుగుతోంది. ఇటీవల కాలంలో ఆయన మాటలు.. చేతలు చూస్తున్నప్పుడు రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ కీలక భూమిక పోషిస్తారన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు.

ఇటీవల కాలంలో ఏ రాజకీయ నేత ప్రసంగాల్లో వినిపించని 'విషయం' పవన్ మాటల్లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. అంతేకాదు.. రాష్ట్రం ఎదుర్కొంటున్న  సమస్యల మీద ఆయనకు అవగాహన అంతకంతకూ పెరుగుతుందన్న విషయం ఆయన మాటల్ని విన్నప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది.

అంతేనా.. ఇప్పటి ముఖ్యమంత్రి జగన్ కానీ.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఇట్టే చెప్పలేని.. బీసీ కులాలు.. ఎస్సీ ఉప కులాల లెక్కల్ని సైతం చెప్పేస్తున్న పవన్ తీరు చూస్తే.. ఆయన సామాజిక అంశాల మీద అవగాహనను అంతకంతకూ పెంచుకోవటమే కాదు.. తాను తర్వాతి తరం పొలిటిషన్ అయన్న విషయాన్ని ఇట్టే చెప్పేస్తున్నారని చెప్పాలి.

మిగిలిన రాజకీయ అధినేతలకు పవన్ కల్యాణ్ కు ఉన్న పెద్ద తేడా ఏమంటే.. సమకాలీన రాజకీయాల్లో ఉండాల్సిన తెంపరితనం.. అదే సమయంలో దూకుడు.. అంతకు మించిన నోటి మాటలతో తాట తీసే చురుకుతోపాటు.. ఎవరిలోనూ కనిపించని బాధ్యత.. అణగారిన వర్గాల పట్ల సహానుభూతి ఆయన మాటల్లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని చెప్పాలి. అదే సమయంలో సంపాదన మీద తనకు ఎలాంటి ఆసక్తి లేదన్న విషయాన్ని చెప్పటమే కాదు.. ఇప్పటికే తాను సంపాదించిన దాన్లో సింహ భాగాన్ని పార్టీ కోసం ఖర్చుచేస్తున్న పవన్ ను చూసినప్పుడు.. రేపటితరం నేత ఎలా ఉండాలన్న దానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తారు.

గడిచిన రెండు దశాబ్దాలుగా తెలుగు రాజకీయాల్ని చూస్తే.. ఒకలాంటి ఉన్మాద ధోరణి కనిపిస్తుంది. ప్రజల సమస్యల మీదా.. వారు పడే కష్టాల మీద కంటే కూడా రాజకీయం పేరుతో నానాయాగీ చేసే వారే ఎక్కువగా కనిపిస్తారు. నిజాయితీగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పే వారి కంటే మాటలతో మభ్య పెట్టే వారే కనిపిస్తారు.

అందుకు భిన్నంగా బాధ్యతతో మాట్లాడే కొత్తతరం నాయకుడిగా పవన్ ను చెప్పాల్సిందే. ఆయన మాటల్లో సూటితనం.. ఆయన ఇస్తున్న హామీల్లో నిజాయితీ ఇప్పుడిప్పుడే అందరిని ఆకర్షిస్తోంది. మార్పు రావటం అంత తేలికైన విషయం కాదు. రాజకీయం అంటే ఇప్పటివరకు అందరు చేసిందే తప్పించి.. అంతకు మించి చేయాల్సింది ఒకటి ఉందన్న విషయం పవన్ మాటల్ని చూస్తే కానీ అర్థం కాదు. అందుకే.. కొందరు అంటున్నారు.. రాసి పెట్టుకోండి. పవన్ ఏపీకి ఫ్యూచర్ అధినేత అని.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News