జనంలోకి జనసేనాని !

Update: 2021-10-25 06:27 GMT
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు తొందరలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ జిల్లాల పర్యటనలు చేయబోతున్నారా ? అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. హైదరాబాద్ లో జరిగిన పార్టీ జిల్లా అధ్యక్షులు, నేతల సమావేశంలో పవన్ మాట్లాడారు. ప్రజాపక్షం వహిస్తున్న మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. సమస్యలు జిల్లాల వారీగా విశ్లేషించి పరిష్కారం కోసం పోరాడాలని పిలుపిచ్చారు. ఈ మధ్యనే చేసిన శ్రమదానం జాతీయ స్థాయిని ఆకర్షించినట్లు చెప్పుకున్నారు.

నిజానికి శ్రమదానం కన్నా ఆ కార్యక్రమం పేరుతో రాజమండ్రిలో జరిగిన రచ్చ బాగా హైలైట్ అయ్యింది. ప్రజాసమస్యలపై ప్రతిపక్షాలు స్పందించాల్సిందే, పోరాటాలు చేయాల్సిందే అనటంలో ఎలాంటి సందేహంలేదు. మొత్తానికి ఇంతకాలానికి జనాల్లో తిరగటానికి పవన్ ప్లాన్ చేసుకున్న విషయం అర్ధమవుతోంది. పింఛన్లు ఆపేయటం, రేషన్ కార్డుల్లో కోత, అమ్మఒడి వాయిదా లాంటి అంశాలపై చర్చించారు. అంటే ఈ మూడు అంశాలపై జనసేన దృష్టి పెట్టినట్లు అర్ధమవుతోంది.

ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటున్న పవన్ మరోవైపు జనంలోకి ఎలా రావాలని అనుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఇప్పటివరకు సినిమా షూటింగుల్లో గ్యాప్ వస్తేనే పార్టీ కార్యక్రమాలకు సమయం కేటాయిస్తున్నారు. కానీ ఇపుడు వరసబెట్టి సినిమాలు చేసుకుంటున్న కారణంగా అంత గ్యాప్ వచ్చే అవకాశాలు లేవు. మరి ఇటు సినిమాలకు అటు రాజకీయాలకు సమయాన్ని ఎలా సర్దుబాటు చేసుకుంటారో చూడాలి.

ఇదే సమయంలో జనసేన కార్యక్రమాలపై బాగా దృష్టి పెట్టడం ద్వారా వచ్చే ఎన్నికలకు పార్టీని టాప్ గేరులోకి తీసుకెళ్ళాలని అనుకుంటున్నారు. మరి ఆ ప్రయత్నాలు ఏ మేరకు సఫలం అవుతాయో డౌటే. ఎందుకంటే జనాల్లో ఇంకా జనసేన పూర్తిగా రిజిస్టర్ కాలేదు. దీనికి కారణం ఏమిటంటే మండల, గ్రామ స్థాయిలో పార్టీ కమిటీలు లేకపోవటమే. జనసేన అంటే ఎంతసేపు పవన్ లేదా నాదెండ్ల మనోహర్ లేకపోతే ఇద్దరు ముగ్గురు నేతలే కనబడతున్నారు. పూర్తిస్థాయి రాష్ట్ర, జిల్లాల కమిటీలే లేవు. పార్టీ కమిటీలు వేస్తే కానీ నేతలు జనాల్లోకి వెళ్ళలేరు. మొత్తానికి జనంలోకి పవన్ వెళ్లాలని అనుకోవడం మంచిదే.



Tags:    

Similar News