బాబు.. జ‌గ‌న్.. ప‌వ‌న్ ముగ్గురు ఒకే చోట‌

Update: 2018-03-14 09:03 GMT
ఒక రేర్ కాంబినేష‌న్ కు ఈ రోజు వేదికైంద‌ని చెప్పాలి. ఏపీ రాజ‌కీయాల వ‌ర‌కూ అత్యంత కీల‌క‌మైన వ్య‌క్తులు ఎవ‌రంటే.. ప్రోటోకాల్ ప్ర‌కారం ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. విపక్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్. రాష్ట్రంలో ప‌లు పార్టీలు ఉన్న‌ప్ప‌టికీ.. ఏపీ రాజ‌కీయం ఈ ముగ్గురి మ‌ధ్య‌నే న‌డుస్తుంద‌న‌టంలో సందేహం లేదు. అయితే.. ఈ ముగ్గురు ఏపీలో ఒకే స‌మ‌యంలో ఒకే జిల్లాలో ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న‌ది లేదు.

ఎందుకంటే.. ప‌వ‌న్ ఇప్ప‌టివ‌ర‌కూ హైద‌రాబాద్ లోనే ఉండ‌టంతో ఇలాంటి ప‌రిస్థితి. ఒక‌వేళ అధికార‌.. విప‌క్ష నేత‌లు క‌లిసినా.. ప‌వ‌న్ వేరే చోట ఉండ‌టంతో ఏపీకి కీల‌క‌మైన ఈ ముగ్గురు ఒకేచోట ఉండ‌టం ఇప్ప‌టివ‌ర‌కూ జ‌ర‌గ‌లేదు. ఇందుకు భిన్నంగా ఈ రోజు ముగ్గురు ముఖ్య‌నేత‌లు ఒకే జిల్లాలో ఉండ‌టం ఆస‌క్తిక‌ర‌మ‌ని చెప్పాలి.

ఏపీ అధికార‌ప‌క్ష తీరుతో తీవ్ర మ‌న‌స్తాపంతో ఉన్న జ‌గ‌న్‌.. త‌న ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌లో భాగంగా గ‌డిచిన నాలుగు నెలులుగా ప్రజాక్షేత్రంలో ఉన్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న గుంటూరు జిల్లా పొన్నూరు నుంచి గుంటూరు దిశ‌గా త‌న పాద‌యాత్ర‌ను నిర్వ‌హిస్తున్నారు. ఇక‌.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ రోజు భారీ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించ‌నున్నారు. పార్టీ పెట్టి నాలుగేళ్లు అవుతున్నా ఎప్పుడూ ఆవిర్భావ స‌భ‌ను పెట్ట‌ని ప‌వ‌న్.. ఈసారి గుంటూరు జిల్లా నాగార్జున యూనివ‌ర్సిటీ ఎదుట ఉన్న మైదానంలో భారీ బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక‌.. బ‌డ్జెట్ స‌మావేశాల్లో భాగంగా చంద్ర‌బాబు సైతం అమ‌రావ‌తిలోనే ఉన్నారు. ఇలా.. ముగ్గురు ముఖ్య నేత‌లు ప‌దుల కిలోమీట‌ర్ల దూరంలో.. అందునా ఒకే జిల్లాలో ఉండ‌టం ఆస‌క్తిక‌ర‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. గ‌డిచిన కొన్నేళ్లుగా ఇలాంటి కాంబినేష‌న్ ఇప్ప‌టివ‌ర‌కూ చోటు చేసుకోలేద‌న్న మాట వినిపిస్తోంది.


Tags:    

Similar News