పీకే... ఏమీ లేకుండానే ఇన్నేసీ ప్ర‌క‌ట‌న‌లా?

Update: 2018-07-01 07:58 GMT
ఏపీలో నానాటికీ ఎన్నిక‌ల వేడి అంత‌కంత‌కూ పెరిగిపోతోంద‌నే చెప్పాలి. 2019 ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా విప‌క్ష నేత‌ - వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరిట ఇప్పుటికే త‌న సుదీర్ఘ పాద‌యాత్ర‌ను ముప్పావు వంతు పూర్తి చేసేశారు. ఏమాత్రం విశ్రాంతి లేకుండా జ‌గ‌న్ సాగిస్తున్న యాత్ర‌కు అనూహ్య రీతిలో జ‌నం మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారు. ఇక ఇప్ప‌టికే మోయ‌లేనంత మేర ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను మూట‌గ‌ట్టుకున్న అధికార టీడీపీ... దానిని త‌గ్గించుకుని వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచేదెలా? అంటూ మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది. ఇక గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో టీడీపీకి అధికారం ద‌క్క‌డానికి ప్ర‌ధాన కార‌ణంగా నిలిచిన టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌రుస స్టేట్ మెంట్లు, విడ‌త‌ల‌వారీ పాద‌యాత్ర‌లు ఊపందుకున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ తో క‌లిసి పోటీ చేస్తామ‌ని ఇప్ప‌టికే వామ‌ప‌క్షాలు ప్ర‌క‌టించినా... జ‌న‌సేన అధినేత నుంచి అందుకు విరుద్ధ‌మైన ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. వ‌చ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగానే బ‌రిలోకి దిగుతామ‌ని, ఏ పార్టీతో పొత్తులేకుండానే 175 అసెంబ్లీ - 25 లోక్ స‌భ స్థానాల నుంచి పోటీకి దిగుతామ‌ని తాజాగా ప‌వ‌న్ ఘ‌నంగా ప్ర‌కటించేశారు. ఈ ప్ర‌క‌ట‌న‌తో షాక్ తిన్న వామ‌ప‌క్షాలు... వెనువెంట‌నే వ్యూహం మార్చుకునే ప‌నిలో ప‌డిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. నిన్న‌టిదాకా ప‌వ‌న్‌తో క‌లిసి న‌డిచేందుకు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించిన లెఫ్ట్ నేత‌లు ఇప్పుడు ప‌వ‌న్‌కు దూరంగా జ‌రుగుతున్నారు. మొత్తంగా స్నేహ‌హ‌స్త‌మిస్తార‌న్న లెఫ్ట్ నేత‌లు... దూరంగా జ‌రుగుతుండ‌టంతో ప‌వ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను చెప్పిన‌ట్లుగానే ఒంట‌రిగానే బ‌రిలోకి దిగ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొంద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి.

అయినా ఏం చూసుకుని ప‌వ‌న్ ఈ మేర డేరింగ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నార‌న్న ప్ర‌శ్న ఇప్పుడు అంద‌రి నోటా వినిపిస్తోంది. పార్టీ సంస్థాగ‌త నిర్మాణం లేదు,  పార్టీకి అభ్య‌ర్థులు లేరు, అస‌లు పార్టీకి ఎన్నిక‌ల సంఘం ఇంకా గుర్తే ఇవ్వ‌లేదు... వీటన్నింటినీ విస్మ‌రించేసి వ‌చ్చే ఎన్నిక‌ల గురించి పోటీపై ప‌వ‌న్ చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు నిజంగానే ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. ప‌వ‌న్ చెప్పిన‌ట్లుగానే రాష్ట్రంలోని 175 అసెంబ్లీ - 25 లోక్ స‌భ స్థానాల్లో జ‌న‌సేన పోటీకి దిగుతుంది అనుకున్నా... ఆ మేర అభ్య‌ర్థులేరి అన్న‌ది ఇప్పుడు ప్ర‌ధానంగా వినిపిస్తున్న ప్ర‌శ్న‌? ఇదే విష‌యంపై జ‌నాల్లోనే కాకుండా జ‌న‌సేన సైనికుల్లోనూ అంతకంత‌కూ అయోమ‌యాన్ని పెంచేస్తోంది.  అయినా పార్టీ నిర్మాణం లేకుండానే... వ‌న్ మ్యాన్ షోగా ప‌వ‌న్ ఎన్నిక‌ల్లో రాణిస్తాన‌ని అనుకుంటున్నారా? అన్న ప్ర‌శ్న కూడా వినిపిస్తోంది. ఈ  విష‌యంపై ఆ పార్టీ అధికార ప్ర‌తినిధులు... జ‌న చైత‌న్య యాత్ర‌లో భాగంగా ప‌వ‌నే స్వ‌యంగా ఆయా నియోజ‌క‌వ‌ర్గాల అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తార‌ని ప్ర‌క‌టించిన వైనం కూడా న‌మ్మ‌శ‌క్యం కానిదిగానే ఉంద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

న‌డుస్తూ,  ఆగుతూ... ఓ అడుగు ముందుకు, రెండ‌డుగులు వెన‌క్కు... అన్న చందంగా సాగుతున్న ప‌వ‌న్ యాత్ర ఇప్ప‌టిదాకా శ్రీ‌కాకుళం, విజ‌యన‌గ‌రం జిల్లాల్లో మాత్ర‌మే పూర్తి అయ్యింది. ఇప్పుడు విశాఖ‌లో కొన‌సాగుతున్న ప‌వ‌న్ యాత్ర ఆ జిల్లాలో స‌గ‌భాగాన్ని కూడా క‌వ‌ర్ చేసిన‌ట్లుగా లేదు. అంతేకాకుండా శ్రీ‌కాకుళం - విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప‌వ‌న్ ఆ రెండు జిల్లాల్లోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌ను ట‌చ్ చేసిన దాఖ‌లా కూడా లేదు. ఇక ట‌చ్ చేసిన నియోజ‌క‌వ‌ర్గాల‌కు అభ్య‌ర్థుల‌నైనా ప్ర‌క‌టించారా? అంటే... అదీ లేదు. మ‌రి విశాఖ‌లో ఎన్ని నియోజ‌కవ‌ర్గాల‌ను ఆయ‌న ట‌చ్ చేస్తారో కూడా తెలియ‌దు. అయితే అభ్య‌ర్థుల ఎంపిక‌లో కాస్తంత స్పీడు పెంచిన‌ట్లుగా క‌నిపించిన ప‌వ‌న్‌... ఇత‌ర పార్టీల్లో టికెట్లు కూడా సంపాదించుకోలేక‌పోయిన వారికి మాత్ర‌మే కండువాలు క‌ప్పేశారు. ఈ విష‌యంపై జ‌న‌సేన సైనికులు ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం చేస్తున్నారు. త‌న అభిమాన సంఘానికి చెందిన ఏ ఒక్క‌రిని కూడా సంప్ర‌దించ‌కుండానే ప‌వ‌న్ ఈ చేరిక‌ల‌కు సై అన్నార‌ని, గ‌తంలో ప్ర‌జారాజ్యం పార్టీ స్థాపించిన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి చేసిన త‌ప్పునే ఇప్పుడు ప‌వ‌న్ చేస్తున్నార‌ని ఆయ‌న అభిమానులు నిజంగానే అగ్గి మీద గుగ్గిల‌మైపోతున్నార‌ట‌. మొత్తంగా ప‌వ‌న్ వేస్తున్న ప్ర‌తి అడుగు కూడా జ‌న‌సేన సైనికుల‌కు ఏమాత్రం రుచించ‌డం లేద‌న్న వాద‌న ఇప్పుడు బాగానే వినిపిస్తోంది. ఈ మొత్తం త‌తంగం చూస్తుంటే... సినిమాల్లో ప‌వ‌న్ నోట నుంచి వ‌చ్చి బాగా పేలిన *నాకు తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది* అంటూ సాగిన‌ డైలాగు గుర్తుకు వ‌స్తోంది క‌దా.

Tags:    

Similar News