జ‌న‌సేన ఆఫీసు భూ వివాదం..కొత్త ట్విస్ట్‌

Update: 2017-12-15 17:25 GMT
జ‌న‌సేన పార్టీ కార్యాల‌యంలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌ లో పార్టీ ఆఫీసును ప్రారంభించి కార్యాక్ర‌మాల‌కు మరింత ఊపునివ్వాల‌నే ప‌వ‌న్ ఆలోచ‌న‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలిన సంగ‌తి తెలిసిందే. గుంటూరు జిల్లా మంగళగిరిలోని చినకాకానిలో జనసేన పార్టీకి ప్ర‌తిపాదించిన  స్థలం న్యాయపరమైన వివాదంలో చిక్కుకోవ‌డం...యార్లగడ్డ సుబ్బారావు వారసుల నుంచి జనసేన పార్టీ తీసుకున్న లీజుకు చట్ట బద్దత లేదంటూ, ఆ స్థలం వారసులుగా ఉన్న మైనారిటీలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెర‌మీద‌కు వ‌చ్చారు. ఈ నేప‌థ్యంలో  స్థల యజమాని వెంకటేశ్వర‌రావు తెర‌మీద‌కు వ‌చ్చారు.

జనసేన పార్టీ స్థలంపై వివాదాలు రావడంతో స్వయంగా భూ యజమాని వెంక‌టేశ్వ‌ర రావు రంగంలోకి దిగి వివరణ ఇచ్చారు. మా భూమిపై ఎలాంటి కేసులు లేవని ఆయ‌న‌ తెలిపారు. `మా నాన్న సుబ్బారావు 1958లో స్థలం కొనుగోలు చేశారు. అప్పట్నుంచి మేమే సాగు చేసుకుంటున్నాం. ఇన్నేళ్లలో ఏ రోజు కూడా కోర్టుకు వెళ్లలేదు. ఎలాంటి కేసులు భూమిపై లేవు. జలీల్‌ అనే వ్యక్తి దురుద్దేశంతోనే తప్పుదారి పట్టించారు. జలీల్‌పై భూ కబ్జాలు, కిడ్నాప్‌ కేసులు ఉన్నాయి. మా కుటుంబాన్ని వివాదంలోకి లాగినవారిపై పరువు నష్టం దావా వేస్తాం` అని  భూ యజమాని వెంకటేశ్వరావు హెచ్చరించారు.

మ‌రోవైపు అమరావతిలో జనసేన పార్టీ కార్యాలయ స్థలం వివాదంపై జ‌న‌సేన‌ పార్టీ నాయకులు స్పందించారు. స్థల వివాదమనేది రాజకీయ కుట్ర అని జనసేన నాయకుడు గద్దె తిరుపతిరావు అన్నారు. యార్లగడ్డ సుబ్బారావు అనే వ్యక్తి ఈ స్థలం కొనుగోలు చేశారని, అప్పటినుంచి సుబ్బారావు కుమారులు వారసత్వంగా అనుభవిస్తున్నారన్నారు. జనసేన పార్టీ ఆ స్థలాన్ని మూడేళ్లు అద్దెకు తీసుకుందని  ఆన్‌ లైన్‌ లో వివరాలు చూసే స్థల యజమానులతో ఒప్పందం చేసుకున్నామని పేర్కొన్నారు. భూ యజమానులపై ఎటువంటి కేసులు కోర్టులో లేవని, వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారాలు చేయడం దుర్మార్గమన్నారు. దీనిపై కోర్టులో పరువు నష్టం దావా వేస్తామని ఆయన తెలిపారు.
Tags:    

Similar News