ఏపీ శంకుస్థాపనకు పవన్ వస్తాడా?

Update: 2015-09-20 09:35 GMT
అందరూ అదిరిపోయేలా.. తమ జీవితాల్లో మర్చిపోలేని విధంగా అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. ఇందుకోసం భారీ బడ్జెట్ ను కేటాయించారని చెబుతున్నారు. శంకుస్థాపన సందర్భంగా తన సత్తా చాటాలని చంద్రబాబు తలపోస్తున్నట్లుగా అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సమర్థతకు కేరాఫ్ అడ్రస్ గా.. భారీతనం తనకు మాత్రమే సాధ్యమవుతుందన్న భావన కలిగించాలని భావిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. అంగరంగ వైభవంగా జరిగే అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి ఒక ఆసక్తికర చర్చ జరుగుతుంది. సుమారు వందల కోట్ల రూపాయిల ఖర్చుతో నిర్వహించే ఈ కార్యక్రమానికి.. జనసేన అధినేత.. పవన్ కల్యాణ్ వస్తారా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న.

రాజధాని శంకుస్థాపనకు పవన్ కు ఆహ్వానం అందటం ఖాయమే. కానీ.. ఆయన వస్తారా? అన్నదే సందేహం. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుధేశం.. బీజేపీ మిత్రపక్షంగా వ్యవహరిస్తూ.. ఈ రెండు పార్టీలకు ఓటేయాల్సిన అవసరాన్ని ప్రచారం చేసిన వ్యక్తి పవన్ కల్యాణ్. అలాంటి ఆయన.. తాను ప్రచారం చేసిన పార్టీ అధికారంలోకి వచ్చినా.. పదవి చేపట్టేందుకు మాత్రం అస్సలు పట్టించుకోలేదు.

టీడీపీ.. బీజేపీ కూటమి విజయం సాధించేందుకు అంత కష్టపడిన ఆయన.. తర్వాత తనకు పట్టనట్లుగా తన పని తాను చేసుకుంటూ పోతున్నారే తప్పించి.. అధికారపార్టీ విషయంలో వేళ్లు.. కాళ్లు పెట్టింది లేదు.

రాజధాని నిర్మాణం విషయంలో ఏపీ సర్కారు చేపట్టిన భూసేకరణపై వ్యతిరేక గళం విప్పటంతో పాటు.. ఆయా ప్రాంతాల్లో పర్యటించి.. రైతుల వాణిని వినిపించటమే కాదు.. భూసేకరణను వెను వెంటనే విలిపివేయాలని అల్టిమేటం జారీ చేసి మరీ.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న పవన్ ఏపీ శంకుస్థాపనకు వస్తారా? అన్నది ఒక సందేహం.

పవన్ మైండ్ సెట్ తెలిసిన సన్నిహితులు మాత్రం.. రాజధాని శంకుస్థాపనకు పవన్ రాకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద పెద్ద కార్యక్రమాలకు తాను హాజరుకావటానికి ఏ మాత్రం ఇష్టపడని ఆయన తత్వం.. అమరావతికి రానీకుండా చేస్తుందని చెబుతున్నారు.

దాదాపు వెయ్యి మంది అతిధుల మధ్యన తాను ఒక్కడిగా ఉండటానికి పవన్ పెద్దగా ఇష్టపడకపోవచ్చని కొందరు తమ్ముళ్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనికి భిన్నంగా మరో ఆసక్తికర వాదన జరుగుతోంది. తాను గెలిపించిన ప్రభుత్వం చేపడుతన్న అత్యద్భుతమైన కార్యక్రమం చరిత్రలో మైలురాయిగా మిగులుతుందని.. అలాంటి కార్యక్రమంలో పవన్ రావటం గ్యారెంటీ అన్న మాట వినిపిస్తోంది. ఏది ఏమైనా.. పవన్ రాకపై ఉత్కంట తొలగాలంటే.. ఆయనే తన ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ కూత పెట్టేస్తే సరిపోతుంది. మరి.. పవన్ ఆ పని చేస్తారా..?
Tags:    

Similar News