అనంతపురం నుంచి లోక్‌ సభకు పవన్?

Update: 2018-01-28 05:48 GMT
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో అనంతపురం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తాజా రాజకీయ పరిణామాలూ ఇదే విషయాన్ని చెప్తున్నాయి. అంతేకాదు... అనంతపురంలో తన టీమ్ అన్నీ తెలుసుకుంటోందని.. సమస్యలన్నీ తీసుకుని ప్రధానిని కలుస్తానని.. అనంతపురం మళ్లీమళ్లీ వస్తానని పవన్ చెప్పారు. ఆయన అనంత లోక్ సభ స్థానాన్ని ఎంపిక చేసుకోవడం వల్లే ఇంతగా ఫోకస్ చేస్తున్నారని తెలుస్తోంది.
    
పవన్ కల్యాణ్ ఈ రోజు అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా ఏపీ మంత్రి పరిటాల సునీత ఇంటికి వెళ్లి అక్కడే అల్పాహారం స్వీకరించారు. సునీత - వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని భావిస్తున్న ఆమె తనయుడు శ్రీరామ్‌ లు ఇద్దరూ పవన్ తో భేటీ అయ్యారు. స్థానిక సమస్యలన్నీ పవన్ వారి నుంచి తెలుసుకున్నారు. అంతేకాదు.. పవన్ కు అనంతపురం జిల్లా ఇరిగేషన్ పరిస్థితులను వివరించేందుకు గాను అధికారులను రప్పించారు సునీత. పరిటాల సునీత భర్త  రవి ఒకప్పుడు పవన్ కు గుండు కొట్టించారన్న ప్రచారం ఒకటి ఉండేది.. ఇటీవలే, పవన్ - సునీతలు దీన్ని ఖండించారు. తాజాగా పవన్ వారి ఇంటికి వెళ్లారు. పవన్ అంతకుముందు అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర చౌదరితోనూ భేటీ అయ్యారు.
    
అనంతపురంలో ఎంపీ జేసే దివాకరరెడ్డికి - ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి మధ్య విభేదాలున్నాయి. సునీతతోనూ దివాకరరెడ్డి వర్గానికి సత్సంబంధాలు లేవు. మరోవైపు దివాకరరెడ్డి తాను వచ్చే  ఎన్నికల్లో పోటీ చేయనంటూ గతంలో చెప్పారు. ఆయన తరచూ చంద్రబాబును విమర్శిస్తుండడంతో ప్రత్యామ్నాయం కోసం ఆయన చూస్తున్నట్లుగా తెలుస్తోంది.
    
పవన్ కూడా తొలి నుంచి అనంతపురంపైనే ఫోకస్ చేస్తున్నారు. ఆయన కార్యక్రమాలు అక్కడే ఎక్కువగా జరిగాయి మరోవైపు గత ఎన్నికల సమయంలో మోదీతో మంచి సంబంధాలు నెరిపిన పవన్ ఆ తరువాత మోదీపై విమర్శలు చేశారు. ఆయన్ను కలవడమూ లేదు. అంతేకాదు... తాను చెప్తే మోదీ వింటారన్న గ్యారంటీ లేదని - అసలు తాను వెళ్తే అపాయింటుమెంటు ఇస్తారో లేదో అని కూడా గతంలో అన్నారు.  కానీ... ఈ రోజు సునీతతో భేటీ తరువాత పవన్ కొత్త  మాట చెప్పారు. తాను అనంతలో కేవలం మూడు రోజుల పర్యటనకు మాత్రమే పరిమితం కాదని - ఇకపై పదే పదే ఇక్కడికి వస్తానని చెప్పిన ఆయన, సీమ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యపైనా స్పందిస్తానని తెలిపారు. తన టీమ్ ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లి - వాళ్ల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తోందని, వారిచ్చే రిపోర్టును బట్టి - వెంటనే స్పందించాల్సిన సమస్యల వివరాలు తీసుకుని మోదీ వద్దకు వెళతానని ఆయన తెలిపారు. సీమలోని ప్రతి జిల్లాకూ తాగు నీరు అందించడం తన తొలి లక్ష్యమని తెలిపారు.

Tags:    

Similar News