ప్ర‌గ‌తిభ‌వ‌న్‌ లో కేసీఆర్‌ తో ప‌వ‌న్ భేటీ

Update: 2018-01-01 16:54 GMT
తెలంగాణ‌ రాష్ట్ర రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ప్రగతిభవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావుతో జనసేన అధినేత - పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఇవాళ భేటీ అయ్యారు. ఇవాళ తొలిసారిగా పవన్‌ కళ్యాణ్‌ కేసీఆర్‌ ను కలిసేందుకు హైదరాబాద్‌ లో గల ప్రగతి భవన్‌ కు విచ్చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా వీరిద్ద‌రి మ‌ధ్య దాదాపు గంట స‌మావేశం జ‌రిగింది. కాగా, ప్రగతి భవన్‌ లో పవన్‌ కళ్యాణ్‌ అడుగిడడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ప్రగతి భవ‌న్‌ కు చేరుకున్న స‌మయంలో సీఎం కేసీఆర్ అక్క‌డ లేరు. రాజ్‌ భ‌వ‌న్‌ లో గ‌వ‌ర్న‌ర్‌ తో భేటీ అయ్యారు. అయితే దాదాపు గంట‌న్న‌ర పాటు ఎదురుచూశారు. అనంత‌రం వీరి భేటీ జ‌రిగింది. వీరిద్దరి భేటీపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఏ అంశాల‌పై చ‌ర్చించ‌కున్నార‌నే విష‌యంలో ఇప్ప‌టివ‌ర‌కు అధికారిక స‌మాచారం వెలువ‌డ‌లేదు.

కాగా, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ను జనసేన అధినేత - పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఇంతకు ముందు ఎప్పుడూ కూడా  ప్రత్యేకంగా కలిసింది లేదు. గతంలో రాజ్‌ భవన్‌ లో గవర్నర్‌ విందు - రాష్ట్రపతి విందు సందర్భంగా వీరిద్దరూ ఒకరినొకరు పలకరించుకున్నారు. అయితే హఠాత్తుగా సీఎం కేసీఆర్‌ తో జనసేనాని కలవడం రాజకీయంగా పెద్ద చర్చకు తెరలేపింది.

అయితే పవన్ కళ్యాణ్‌, కేసీఆర్ భేటీకి ప్రత్యేక ప్రాధాన్యమేమీ లేదని జనసేన ప్రకటించింది. మర్యాద పూర్వకంగా కేసీఆర్ ను పవన్‌ కలిశారని స్పష్టం చేసింది. అయితే సీఎం కేసీఆర్‌ తో భేటీ అనంత‌రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ మీడియా సంస్థ‌తో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెల్పినట్లు పవన్ కల్యాణ్ వెల్ల‌డించారు. రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చూసి ఆశ్చర్యపోయాన‌ని తెలిపారు. 24 గంటల విద్యుత్ ఎలా సాధ్యం అడిగి తెలుసుకున్నాన‌ని ప‌వ‌న్ వెల్ల‌డించారు. ఉమ్మడి ఆంధ్ర‌ప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్నప్పుడు కరెంట్ విషయంలో త‌నకు చాలా సందేహాలు ఉండేవని...అయితే అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన తీరు త‌నకు బాగా నచ్చింద‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. 24 గంటల కరెంట్ ఇవ్వడాన్ని ఇండియాలోనే కేస్ స్టడీ గా చూడొచ్చని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు.

ఈ సంద‌ర్భంగా తెలంగాణ ఉద్య‌మం - నాయ‌కుల గురించి ప‌వ‌న్ ఆస‌క్తిక‌రంగా స్పందించారు. తెలంగాణ నాయకుల స్పూర్తిని చూసి నేర్చుకోవాలని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. ఏపీలో పర్యటించినప్పుడల్లా ఇదే మాట‌ చెపుతుంటాన‌ని ప‌వ‌న్ అన్నారు. టీఆర్ఎస్‌ నాయకుల మీద గౌరవం ఉందని తాను మొదటి నుండి చెపుతున్నాన‌ని ప‌వ‌న్ వెల్ల‌డించారు.
Tags:    

Similar News