లోక్ సత్తా ఆపీస్‌కు ప‌వ‌న్‌!.జేపీ ఏం చెప్పారంటే?

Update: 2018-02-08 10:58 GMT
ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. మొన్న‌టి బ‌డ్జెట్ లో న‌రేంద్ర మోదీ స‌ర్కారు ఏపీకి మొండిచెయ్యి చూపితే... దానిపై విప‌క్షాలు వైసీపీ - కాంగ్రెస్ పార్టీలు పెద్ద ఎత్తున ఉద్య‌మానికి శ్రీకారం చుట్టాయి. ఇక ఏపీలో అధికార పార్టీగా ఉన్న టీడీపీ కూడా కేంద్రానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న గ‌ళం విప్ప‌క త‌ప్ప‌లేదు. ఈ నేప‌థ్యంలో మొన్న‌టిదాకా టీడీపీ వెంటేన‌న్న‌ట్లుగా సాగిన టాలీవుడ్ ప‌వర్ స్టార్ - జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్... అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పాటుగా ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీపై నిప్పులు చెరిగారు. ఏపీకి న్యాయం చేసే విష‌యంలో ఈ రెండు పార్టీలు కూడా న‌మ్మ‌క ద్రోహం చేశాయ‌న్న కోణంలో నిన్న ప‌వ‌న్ మీడియా సాక్షిగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌లే చేశారు. అదే స‌మ‌యంలో తెలంగాణ‌ను ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసుకొనే దిశ‌గా సాగిన య‌త్నంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన తెలంగాణ రాజ‌కీయ ఐక్య కార్యాచ‌ర‌ణ స‌మితి (టీజేఏసీ) త‌ర‌హాలో ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీలను సాధించుకునేందుకు ఓ జేఏసీని ఏర్పాటు చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, ఇందుకు రేప‌టి నుంచే కార్యాచ‌ర‌ణ ప్రారంభిస్తాన‌ని ప్ర‌క‌టించిన ప‌వ‌న్‌... తాను చెప్పిన‌ట్లుగానే కాసేప‌టి క్రితం జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ ఆధ్వ‌ర్యంలోని లోక్ స‌త్తా పార్టీ కార్యాల‌యానికి వెళ్లారు.

జేఏసీ ఏర్పాటులో జేపీతో పాటుగా సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ వంటి మేథావుల‌తో జ‌ట్టు క‌డ‌తాన‌ని ప‌వ‌న్ చెప్ప‌డంతో అటు ఉండ‌వ‌ల్లితో పాటుగా ఇటు జేపీ కూడా అందుకు త‌గ్గ‌ట్లుగానే ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్ర‌మంలో కాసేప‌టి క్రితం హైద‌రాబాదులోని బేగంపేట ప‌రిధిలో ఉన్న లోక్ స‌త్తా పార్టీ కార్యాల‌యానికి ప‌వ‌న్ రాగానే... ఆయ‌న‌కు జేపీ రెడ్ కార్పెట్ స్వాగ‌తం ప‌లికారు. ఆ త‌ర్వాత ఇద్ద‌రూ క‌లిసి పార్టీ కార్యాల‌యంలోకి వెళ్లి సుదీర్ఘంగానే చ‌ర్చ‌లు జ‌రిపారు. ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీల‌ను సాధించుకునేందుకు ఎలాంటి వ్యూహం ర‌చిద్దామ‌న్న ప‌వ‌న్ ప్ర‌శ్న‌ల‌కు జేపీ కూడా కూలంక‌షంగానే స‌మాధానం ఇవ్వ‌డంతో పాటుగా మున్ముందు ఈ అంశంలో తోడుగా నిలుస్తాన‌ని, అంతా క‌లిసే ముందుకు సాగుదామ‌ని కూడా హామీ ఇచ్చిన‌ట్లుగా స‌మాచారం. చ‌ర్చ‌ల త‌ర్వాత ఇద్ద‌రూ క‌లిసి బ‌య‌ట‌కు వ‌చ్చి.... ఇద్ద‌రూ క‌లిసి మీడియాతో మాట్లాడారు. ప‌వ‌న్‌ను త‌న సోద‌రుడిగా ప్ర‌స్తావించిన జేపీ... ఏపీకి కేంద్రం తీర‌ని అన్యాయం చేసిన మాట వాస్త‌వ‌మేన‌ని పేర్కొన్నారు. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో చ‌ట్టం రూపొందించిన నాటి యూపీఏ ప్ర‌భుత్వం... అందులో చాలా అంశాల‌ను పేర్కొంద‌ని, వాటిని అమ‌లు చేయాల్సిన బాధ్య‌త కేంద్రంపైనే ఉంద‌ని చెప్పారు.

కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా పార్ల‌మెంటు ఆమోదించిన చ‌ట్టంలోని అంశాల‌ను నెర‌వేర్చాల్సిన బాధ్య‌త ఆయా ప్ర‌భుత్వాల‌పైనే ఉంద‌న్న విష‌యాన్ని అన్ని పార్టీలు గుర్తించాల్సిందేనని కూడా జేపీ అన్నారు. ఈ విష‌యంలో ఎలాంటి ఉద్య‌మంతో ముందుకెళ‌దామ‌న్న విష‌యంపై ప‌వ‌న్‌తో పాటు త‌మ‌తో క‌లిసి వ‌చ్చే అన్ని పార్టీల‌కు చెందిన మేథావుల‌తో చ‌ర్చించి వ్యూహం ర‌చిస్తామ‌ని చెప్పారు. మొత్తంగా ఈ విష‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ చేప‌ట్ట‌నున్న ఉద్య‌మానికి తాను కూడా త‌న‌వంతు స‌హ‌కారం అందించ‌డంతో పాటు ప‌వ‌న్‌తో క‌లిసి అడుగేస్తాన‌ని కూడా జేపీ ప్ర‌క‌టించారు. మొత్తానికి ఎంతో ఆశ‌గా లోక్ స‌త్తా కార్యాల‌యానికి వెళ్లిన ప‌వ‌న్ కల్యాణ్ కు అక్క‌డ జేపీ ప‌లికిన స్వాగ‌తంతో పాటుగా జేపీ నోట వ‌చ్చిన మాట‌లు మ‌రింత ఉత్సాహాన్ని ఇచ్చాయ‌నే చెప్పాలి. అంతేకాకుండా భ‌విష్య‌త్తులో జేఏసీ పేరిట ప‌వ‌న్ చేప‌ట్టే ఉద్య‌మానికి మ‌రింత ఊతం దొరికేసింద‌ని కూడా చెప్ప‌క త‌ప్ప‌దు. 
Tags:    

Similar News