వెంకయ్యను.. మురళీమోహన్‌ని వదిలేశారా?

Update: 2015-07-07 05:23 GMT
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రెస్‌మీట్‌ పెట్టేసి.. పలు అంశాల మీద మాట్లాడటం తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగు ఎంపీలను ఉద్దేశించి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎంపీ టిక్కెట్ల కోసం ఊగిపోయిన వారు.. విజయం సాధించిన తర్వాత మౌనంగా ఉన్నారని.. పార్లమెంటు గోడల్ని చూసుకుంటూ తన్మయత్వంతో ఉండిపోయారన్న విషయాన్ని ప్రస్తావించి.. కాస్తంత తీవ్రంగానే వ్యాఖ్యలు చేశారు.

ఏపీ ఎంపీలకు ఆత్మాభిమానం.. పౌరుషం లేదా? అని సూటిగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా విజయవాడ ఎంపీ టిక్కెట్టు కోసం కేశినేని నాని పడిన ఆరాటాన్ని చెబుతూ.. వాస్తవానికి ఆ సీటు గురించి తాను ఒకరిని ప్రపోజ్‌ చేశానని.. కానీ కేశినేని నాని తనకు సీటు కావాలని పట్టుబట్టటంతో.. ఒకరు అంతగా కోరుకుంటున్న దాని గురించి ఆలోచించటం అంత మంచిది కాదన్న ఉద్దేశ్యంతో ప్రయత్నించలేదని పవన్‌ వ్యాఖ్యానించారు.

టిక్కెట్టు కోసం అంతలా ఊగిపోయిన విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇప్పుడు మౌనంగా ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించటంతో పాటు.. ఏపీకి రావాల్సిన డిమాండ్ల గురించి ఎందుకు పెదవి విప్పటం లేదని సూటిగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా రాయపాటి సాంబశివరావు.. అశోక్‌ గజపతి రాజు.. సుజనా చౌదరి.. తోట నరసింహం.. అవంతి శ్రీనివాస్‌లతో పాటు బీజేపీ ఎంపీలు గోకరాజు గంగరాజు.. హరిబాబు వీళ్లంతా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

కొందరి ఎంపీల పేర్లు ప్రస్తావించి.. మరికొందరు కీలక నేతలైన వెంకయ్యనాయుడుతో పాటు.. టీడీపీ ఎంపీలైన మురళీమోహన్‌.. జేసీ దివాకర్‌రెడ్డి లాంటి వారిని వదిలేయటం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కావాలనే కొందరి పేర్లను ప్రస్తావించి మరికొందరి పేర్లను పవన్‌ వదిలేశారన్న భావన వ్యక్తమవుతోంది. అయితే.. ఇందులో వాస్తవం లేదని.. కావాలని కొందరి పేర్లను వదిలేయటం పవన్‌ నైజానికి విరుద్ధమని సర్ది చెబుతున్నప్పటికీ.. కీలకమైన వెంకయ్య లాంటి వారి పేర్లు ప్రస్తావిస్తే.. సబబుగా ఉందని చెబుతున్నారు.

సాపేక్షంగా ఆలోచించి చూస్తే.. మిగిలిన ఏపీ నేతలతో పోలిస్తే.. వెంకయ్యనాయుడు కేంద్రంలో కీలక స్థానంలో ఉన్నారు. ప్రధాని మోడీ సైతం ఆయన్ను తెగ మెచ్చుకుంటూ ఉంటారు. ఇక.. విభజన బిల్లు సందర్భంగా ప్రత్యేకహోదా గురించి ప్రస్తావించి.. దాన్ని ఐదేళ్లు కాదు.. పదేళ్లు చేస్తామని.. త్వరలో తాము అధికారంలోకి వస్తామని చెప్పుకున్న వెంకయ్య నాయుడు.. ఇప్పుడు తన వాదనను అడ్డంగా మార్చేసుకున్న నేపథ్యంలో.. ఆయన్ను ప్రశ్నించి ఉంటే బాగుంటుందన్న వాదన వ్యక్తమవుతోంది. తిడితే కేసీఆర్‌లా తిట్టాలని.. పడితే పౌరుషం లేని ఆంధ్ర ఎంపీల్లా పడాలంటూ ఈ మధ్య ఒక ప్లకార్డు మీద చూసినట్లుగా చెప్పిన ఆయన ఎపీ ఎంపీల్ని తీవ్రంగా విమర్శించారు. విమర్శలు చేసేటప్పుడు అందరిని అంటే బాగుండేదని.. కొందరిని అని.. మరికొందరని వదిలేయటం సబబుగా లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News