మాట ఇచ్చుడు వ‌ర‌కేనా?..గుర్తుండ‌దా ప‌వ‌నా?

Update: 2017-04-14 05:08 GMT
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌రిస్థితి ఇప్పుడు ఇలానే త‌యారైంది. మిగిలిన వారి కంటే తాను చాలా డిఫ‌రెంట్ అని.. ప్ర‌జా స‌మ‌స్య‌ల కోసం ఎవ‌రినైనా.. ఎంత‌కైనా పోరాడ‌తాన‌ని.. వారి కోసం ఎంత‌వ‌ర‌కైనా వెళ్లేందుకు సిద్ధ‌మ‌ని చెప్ప‌టం తెలిసిందే. ఇలా ఒక్క‌సారి కాకుండా ప‌లు సంద‌ర్భాల్లో ఆయ‌న చెప్ప‌టం మ‌ర్చిపోకూడ‌దు. రాజ‌ధాని అమ‌రావ‌తి కోసం సేక‌రిస్తున్న భూముల్ని.. రైతుల‌కు వ్య‌తిరేకంగా స్వీక‌రించొద్ద‌ని.. ఆ విష‌యంలో రైతుల అభిమ‌తానికి భిన్నంగా వ్య‌వ‌హ‌రించొద్ద‌ని ఏపీ స‌ర్కారుకు తేల్చి చెప్పారు.

ఏపీ స‌ర్కారు భూముల సేక‌ర‌ణ విష‌యంలో కొంద‌రు రైతుల ఇవ్వ‌మ‌ని తేల్చిచెప్పినా.. వారి భూముల్ని స్వాధీనం చేసుకునేందుకు చేసిన ప్ర‌య‌త్నాల నేప‌థ్యంలో.. అక్క‌డి ప్ర‌జ‌లు ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌మ‌కు సాయం చేయాలంటూ ఫ్లెక్సీల‌తో ఆందోళ‌న‌కు దిగ‌టం.. ఈ ఇష్యూ మీద రాజ‌ధాని ప్రాంతంలో ప‌ర్య‌టించిన ప‌వ‌న్‌.. రైతుల అభిమ‌తానికి భిన్నంగా వారి భూముల్ని సేక‌రించొద్దంటూ సర్కారుకు అల్టిమేటం ఇచ్చారు. ఒక‌వేళ‌.. ప్ర‌భుత్వం కానీ మొండిగా రైతుల భూముల్ని బ‌ల‌వంతంగా లాక్కునే ప్ర‌య‌త్నం చేస్తే.. వారి త‌ర‌ఫున తాను పోరాడ‌తాన‌ని మాట ఇచ్చారు.

ఇది జ‌రిగిన త‌ర్వాత కూడా ప‌లు సంద‌ర్భాల్లో రైతుల భూముల్ని తీసుకునేందుకు ఏపీ స‌ర్కారు ప‌లుప్ర‌య‌త్నాలు చేసింది. తాజాగా గుంటూరు జిల్లా తాడేప‌ల్లి మండ‌లం పెనుమాక‌లో రైతులు ధ‌ర్నాకు దిగారు. రాజ‌ధాని భూసేక‌ర‌ణ నుంచి పెనుమాక‌.. ఉండ‌వ‌ల్లిని త‌ప్పించాలంటూ నినాదాలు చేసిన వారు.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్లెక్సీలు ప‌ట్టుకొని ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేయ‌టం గ‌మ‌నార్హం.

2015 ఆగ‌స్టులో పెనుమాక గ్రామానికి వ‌చ్చిన ప‌వ‌న్ కల్యాణ్‌.. రాజ‌ధాని నిర్మాణానికి బ‌ల‌వంత‌పు భూసేక‌ర‌ణ‌కు తాను వ్య‌తిరేక‌మ‌ని.. ఒక‌వేళ ప్ర‌భుత్వం కానీ ఆ పని చేస్తే తాను ధ‌ర్నా చేస్తాన‌ని వ్యాఖ్యానించారు. కానీ.. రైతుల భూముల కోసం భూస‌మీక‌ర‌ణ చేసేందుకు వీలుగా నోటీసులు ఇవ్వ‌టం గ‌మ‌నార్హం. దీనిపై నిర‌స‌న వ్య‌క్తం చేసిన రైతులు ప‌వ‌న్ క‌ల్యాణ్ తానిచ్చిన మాట‌ల్ని నిల‌బెట్టుకోవాల‌న్నారు. రైతుల‌కు అండ‌గా నిలుస్తాన‌ని చెప్పిన ప‌వ‌న్‌.. తాజాగా రియాక్ట్ కావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఇదిలా ఉంటే.. ప‌లు సంద‌ర్భాల్లో మాట ఇస్తున్న ప‌వ‌న్‌.. వాటిని మ‌ర్చిపోతున్నార‌ని.. ఆ ఊసే లేకుండా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

అనంత‌పురం రైతుల క‌ర‌వు ప‌రిస్థితి తెలుసుకునేందుకు వీలుగా పాద‌యాత్ర చేస్తాన‌ని చెప్పారు. కానీ.. ఇప్ప‌టికీ చేయలేదు. గోదావ‌రి జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న మెగా అక్వాపార్క్ ను తీవ్రంగా వ్య‌తిరేకించిన ప‌వ‌న్‌.. అవ‌స‌ర‌మైతే తాను ఉద్య‌మం చేసి ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ను నెర‌వేరుస్తాన‌ని వెల్ల‌డించారు. ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం ఏప్రిల్ లో మౌన ప్ర‌ద‌ర్శ‌న చేస్తాన‌ని.. హోదాను అమ‌లు చేయాలంటూ చెప్పిన ప‌వ‌న్‌.. ఇప్ప‌టివ‌ర‌కూ త‌న భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టించింది లేదు. వ‌రుస పెట్టి హామీల మీద హామీల్ని ఇవ్వ‌టం త‌గ్గించి.. గ‌తంలో ఇచ్చిన హామీల్ని నిల‌బెట్టుకునే విష‌యం మీద కాసింత ఫోక‌స్ చేస్తే మంచిద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News