పవన్ కు స్పందించాలని అనిపించలేదా?

Update: 2018-02-04 17:30 GMT
అంతర్జాతీయ స్థాయిలో చరిత్రలో నిలిచిపోయే ప్రముఖ వ్యక్తుల కొటేషన్లను తరచూ తన ప్రసంగాల్లో ప్రస్తావిస్తూ.. తన ఉపన్యాసాలను రక్తి కట్టించడం సినిమా హీరో పవన్ కల్యాణ్ కు అలవాటే..! పవన్ ప్రసంగాల్లో ఆయన నేర్చుకున్న వ్యక్తిత్వ వికాస  పాఠాలు - విదేశీ మేధావుల కొటేషన్లు లెక్కకు మిక్కలిగా దొర్లిపోతుంటాయి. ఎప్పడూ పుస్తకాలు చదువుతూ ఉంటా అని చెప్పుకునే అలాంటి అధ్యయనశీలికి, ‘‘మేధావి మౌనం’’ అనే పదం గురించి తెలియకుండా ఉంటుందని అనుకోవడం భ్రమ. మరి బడ్జెట్ కేటాయింపుల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలకు , ప్రత్యేకించి అనాథ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కు ఇంత ఘోరమైన అన్యాయం జరిగితే ఏమాత్రం స్పందించాలని ఆయనకు ఎందుకు అనిపించడం లేదు? అనేది ఆయన అభిమానుల్ని కూడా తొలిచేస్తున్న ప్రశ్న. మేధావి మౌనం జాతికి ఎంత ప్రమాదకరమో బాగా తెలిసిన పవన్ కల్యాణ్ కూడా.. ప్రస్తుతం ఎందుకు మౌనం పాటిస్తున్నారో ఎవ్వరికీ అంతుచిక్కని సంగతి.

ఆయన ఇప్పటికి రెండు జిల్లాల్లో పర్యటించారు. తెలంగాణలోను - అనంతపురంలోని ఆయన పర్యటనలు సాగాయి. ఆ నేపథ్యంలో ఆయన ప్రజలు సమస్యలను తెలుసుకున్నారట. ఎటూ సినిమాలు చేయడం మానేశా అని సెలవిచ్చిన పవన్ కల్యాణ్ ప్రస్తుతం తాను తెలుసుకున్న సమస్యల గురించి క్రోడీకరించి నివేదికలు తయారు చేయిస్తున్నారట. ఆ నివేదికలను  రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు అందించి.. వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తారట. ఇదంతా మంచి ప్రయత్నమే అందుకు ఆయనను బహుధా అభినందించాల్సిందే.

అయితే ప్రాప్తకాలజ్ఞత అనేది ఒకటి ఉంటుంది. తెలుగు తెలియన దొరలు దానిని స్పాంటేనియస్ అని అంటుంటారు. అంటే ‘సమయానికి ఉండే అవసరాన్ని బట్టి స్పందిచండం’ అన్నమాట. ఆకలితో అలమటిస్తున్న వాడికి ఆ నిమిషానికి కాసింత గంజిపోసినా సరిపోతుందిగానీ.. ఇప్పుడు నేను కేవలం యాత్రలు మాత్రమే చేస్తున్నా.. అధికారంలోకి వచ్చిన తర్వాత.. పరమాన్నం పెట్టిస్తా.. మృష్టాన్న భోజనం పెట్టిస్తా.. అని హామీలు ఇచ్చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. అంటే ఇప్పుడు బడ్జెట్ అన్యాయం జరిగితే.. ఇప్పుడు దానిపై కనీసం తన అభిప్రాయం చెప్పకుండా.. కనీసం ట్వీటు కూడా లేకుండా.. పవన్ మౌనం పాటించడం కరక్టేనా? ఆయన మరికొన్ని వారాల తర్వాత మరో జిల్లా యాత్ర మొదలెడతే.. అప్పుడు బడ్జెట్ అన్యాయం పై తిడతారు. ఆలోగా.. వ్యవహారం మొత్తం పాచిపోయి జనం దానికి అలవాటు పడిపోయి ఉంటారు. ఇలాంటి ఘోర అన్యాయం జరిగినప్పుడు పవన్ వంటి ప్రజాదరణ - యూత్ లో ఆకర్షణ ఉన్న నేత ఒక్క నిరసన ఉద్యమానికి, ప్రదర్శనకు పిలుపు ఇస్తే ఎంత అపూర్వ స్పందన ఉంటుంది.. తద్వారా కేంద్రంలో కదలిక తేవడం ఎంత సులువు అవుతుంది... అలాంటి ప్రయత్నం పవన్ నామమాత్రంగా చేయకపోవడం ఘోరం అని పలువురు ఫ్యాన్స్ కూడా ఆవేదన చెందుతున్నారు.
Tags:    

Similar News