ఇవేం రాజ‌కీయాలు ప‌వ‌న్‌?

Update: 2018-10-31 07:46 GMT
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్య‌వ‌హార శైలి మరోసారి విమ‌ర్శ‌ల పాల‌వుతోంది. న‌వంబ‌రు 2న రైల్లో ప్ర‌యాణిస్తూ ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకుంటానంటూ తాజాగా ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న‌పై అంతా పెద‌వి విరుస్తున్నారు. ప‌వ‌న్‌కు రాజ‌కీయాలంటే ఏంటో ఇంకా అర్థం కావ‌డం లేద‌ని.. ఆయ‌న‌లో మ‌రింత మెచ్యూరిటీ అవ‌స‌ర‌మ‌ని ఎద్దేవా చేస్తున్నారు.

ప‌వ‌న్ శుక్ర‌వారం విజ‌య‌వాడ నుంచి తుని వ‌ర‌కు జన్మభూమి ఎక్స్‌ ప్రెస్‌ రైల్లో ప్ర‌యాణిస్తార‌ని జ‌న‌సేన త‌మ అధికారిక ట్విట‌ర్ ఖాతాలో బుధ‌వారం ప్ర‌క‌టించింది. మ‌ధ్యాహ్నం 1.20 గంట‌ల‌కు రైలు విజ‌య‌వాడ‌లో బ‌య‌లుదేరుతుంద‌ని - సాయంత్రం 5.20 గంట‌ల‌కు తుని చేరుకుంటుంద‌ని తెలిపింది. ఈ ప్రయాణంలో ప్రజలు సమస్యలను తెలుసుకుంటూనే.. జనసేన పార్టీ ఆశయాలకు ప్ర‌యాణికుల‌కు పవన్ వివరిస్తార‌ని తెలియ‌జేసింది.

ప‌వ‌న్ రైలు ప్ర‌చార ప్ర‌ణాళిక‌పై ప్ర‌స్తుతం తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప‌వ‌న్‌ ను చూసేందుకు జ‌నం ఎగ‌బ‌డే అవ‌కాశ‌ముంద‌ని.. ఇది రైలు ప్ర‌యాణికుల‌కు - సిబ్బందికి తీవ్ర ఇబ్బందిక‌రంగా మారే అవ‌కాశ‌ముంద‌ని వారు సూచిస్తున్నారు. ఆయ‌న ప్ర‌యాణంతో శాంతిభ‌ద్ర‌త‌లకు ముప్పు వాటిల్లే అవ‌కాశం లేక‌పోద‌ని హెచ్చ‌రిస్తున్నారు. అయినా, జ‌నం స‌మ‌స్య‌లు తెలుసుకోవాలంటే ఊరూరు తిర‌గాలి త‌ప్ప‌.. ఇలాంటి ప్ర‌ణాళిక‌లు వేయ‌డ‌మేంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఒళ్లు క‌ద‌ల‌కుండా.. హాయిగా కూర్చొని జ‌నం మ‌ధ్య‌లో ఉన్న‌ట్లు బిల్డ‌ప్ ఇచ్చేందుకే ప‌వ‌న్ ఇలాంటి ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నాడంటూ తీవ్ర‌ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

తిత్లీ తుపాను బాధితుల‌ను ప‌రామ‌ర్శించే స‌మ‌యంలోనూ ప‌వ‌న్ అత్యంత నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించార‌ని ప‌లువురు గుర్తుచేస్తున్నారు. తుపాను స‌మ‌యంలో జ‌న‌సేన క‌వాతుకు సంబంధించిన సొంత‌ ప‌నుల్లో ఆయ‌న బిజీగా ఉన్నార‌ని సూచించారు. క‌వాతు ముగిశాక తీరిగ్గా ప‌రామ‌ర్శ‌కు వెళ్లార‌ని.. అప్పుడు కూడా బాధితుల‌తో అంటీ ముట్ట‌న‌ట్లు దూరం దూరంగా వ్య‌వ‌హ‌రించార‌ని ఆరోపించారు. కూడు - గూడు లేక త‌ల్ల‌డిల్లుతున్న జ‌నం ద‌గ్గ‌రికి వెళ్లి వారి క‌ష్టాలు తెలుసుకోవ‌డానికి బ‌దులుగా.. ప‌వ‌న్ న‌లుగురైదుగురు బాధితుల‌ను త‌న ద‌గ్గ‌రికే పిలిపించుకొని తూతూ మంత్రంగా మాట్లాడార‌ని ధ్వ‌జ‌మెత్తారు.

తిత్లీ బాధితుల‌ను ప‌రామ‌ర్శించిన తీరు - తాజా రైలు ప్ర‌యాణ ప్ర‌ణాళిక వంటివి చూస్తుంటే ప‌వ‌న్‌ కు రాజ‌కీయాల‌పై క‌నీస అవ‌గాహ‌న కూడా లేన‌ట్లు అనిపిస్తోంద‌ని విమ‌ర్శ‌కులు పెద‌వి విరుస్తున్నారు. ప‌వ‌న్ త‌న ఆవేశం త‌గ్గించుకొని.. ఎక్క‌డ ఎలా వ్య‌వ‌హ‌రించాలో తెలుసుకోవాల‌ని వారు సూచిస్తున్నారు.



Tags:    

Similar News