బాబుకు ప‌వ‌న్ పంచ్ మామూలుగా లేదుగా?

Update: 2018-10-13 11:52 GMT
నా బాధ ప్ర‌పంచానికి బాధ కావాలి. నా వేద‌న నా ఒక్క‌డికి మాత్ర‌మే కాదు.. నా చుట్టూ ఉన్నోళ్ల‌కి.. వారి చుట్టూ ఉన్నోళ్ల‌కు కూడా క‌ల‌గాల‌న్న మైండ్ సెట్ కొంద‌రికి ఉంటుంది. దాదాపు ఇలాంటి మైండ్ సెట్ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబులో కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తూ ఉంటుంది.

త‌న‌కు సంబంధించి ఏం జ‌రిగినా.. త‌న త‌ప్పుడు నిర్ణ‌యాల్ని ఎవ‌రు వేలెత్తి చూపించినా.. దాన్ని త‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌టం.. లేదంటే.. త‌న‌కు డ్యామేజ్ జ‌ర‌గ‌కుండా.. ఎదుటోళ్ల మీద‌కు నెట్టేసే తీరు క‌నిపిస్తూ ఉంటుంది. దాదాపుగా బాబు తీరు అలానే ఉంటుంది. వ్యాపార‌..పారిశ్రామిక‌వేత్త‌ల మీద జ‌రుగుతున్న ఐటీ దాడుల‌కు చంద్ర‌బాబు ఇస్తున్న క‌ల‌ర్ ఏమిటి?  అది ఏపీ మీద మోడీ స‌ర్కారు దాడి అని.. మోడీతో రిలేష‌న్ క‌ట్ చేసుకున్నందుకు ప్ర‌తిఫ‌లంగా వ‌రుస పెట్టి దాడులు నిర్వ‌హిస్తూ బాబు మీద ప్ర‌తీకారం తీర్చుకుంటున్నార‌ని మోడీపై నిప్పులు చెరుగుతున్నారు ఏపీ తెలుగు త‌మ్ముళ్లు.

తాజాగా ఏపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు.. చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితుడిగా చెప్పే సీఎం ర‌మేశ్ ఇంట్లోనూ.. ఆయ‌న వ్యాపార స‌ముదాయాల్లో జ‌రుగుతున్న త‌నిఖీల‌పై బాబు ఎంత‌గా రియాక్ట్ అవుతున్న‌ది తెలిసిందే. ఇలాంటి వేళ‌.. కేంద్రంలోని మోడీ  స‌ర్కారుపై అదే ప‌నిగా త‌ప్పు ప‌డుతున్నారు బాబు అండ్ కో.

ఇదే అంశంపై తాజాగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ రియాక్ట్  అయ్యారు. పారిశ్రామిక‌వేత్త‌ల మీదా.. వ్యాపార‌వేత్త‌ల మీద దాడులు జ‌రుగుతుంటే.. దానికి టీడీపీ ఎందుకు ఉలిక్కిప‌డాల‌ని సూటిగా ప్ర‌శ్నించారు ప‌వ‌న్‌. ఢిల్లీలో మాదిరి ఐటీ దాడులు సెక్ర‌టేరియ‌ట్‌లోనో.. సీఎం చంద్ర‌బాబు ఇంటిపై జ‌రుగుతున్నా.. అమ‌రావ‌తిలో జ‌రుగుతున్నా ప్ర‌భుత్వానికి త‌మ స‌పోర్ట్ ఉండ‌దన్నారు.

ఢిల్లీలో మాదిరి కేజ్రీవాల్ అధికారిక నివాసంలో త‌నిఖీలు.. అరెస్ట్ లు చేసి ఉంటే తాము త‌ప్ప‌నిస‌రిగా త‌ప్పు ప‌ట్టే వాళ్ల‌మ‌ని చెప్పారు. మోడీని తాను వెన‌కేసురావాల్సిన అవ‌స‌రం లేద‌న్న ప‌వ‌న్‌.. వెన‌కేసుకురావ‌టానికి వారేమీ మా బంధ‌వులు కాద‌న్నారు. మోడీ త‌న‌కు బ్ర‌ద‌ర్ కాద‌ని.. అమిత్ షా నా బాబాయి కూడా కాద‌ని తేల్చారు. 2014 ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఓటు ఉంటాన‌ని చెప్పి మరీ తాను బీజేపీ.. టీడీపీల‌కు అండ‌గా ఉన్న విష‌యాన్ని గుర్తు చేశారు. త‌న సొంత సంపాద‌నను వ‌దిలేసి మ‌రీ.. తాను బీజేపీ.. టీడీపీల వెంట న‌డిచిన వైనాన్ని గుర్తు చేశారు. హోదాపై సీఎం త‌న నిర్ణ‌యాన్ని మార్చుకోవ‌టం ద్వారా ప్ర‌జ‌ల‌ను అయోమ‌యానికి గురి చేశార‌ని మండిప‌డ్డారు.

రాజ‌కీయ జ‌వాబుదారీత‌నం కోస‌మే ధ‌వ‌ళేశ్వ‌రం బ్యారేజ్ పై జ‌న‌సేన ప్ర‌త్యేక క‌వాతు నిర్వ‌హించింద‌న్నారు. ఇక నుంచి అమ‌రావ‌తి కేంద్రంగా జ‌న‌సేన కార్య‌క‌లాపాల్ని నిర్వహిస్తున్న వైనాన్ని ప‌వ‌న్ వెల్ల‌డించారు. మొత్తానికి బాబును తిట్టే విష‌యంలో ప‌వ‌న్ మ‌హా దూకుడుగా ఉన్నార‌న్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News