నాలుగైదు రోజుల్లో తేల్చుడేంది ప‌వ‌నా?

Update: 2018-10-13 10:44 GMT
చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టిన‌ప్పుడు.. ఆ పార్టీ కార్య‌క్ర‌మాన్ని క‌వ‌ర్ చేయాల్సి వ‌చ్చిన రిపోర్ట‌ర్ల‌కు చుక్క‌లు క‌నిపించేవి. పేరుకు రాజ‌కీయ పార్టీ అనే కానీ.. అక్క‌డ జ‌రిగేదంతా సినిమా కార్య‌క్ర‌మం మాదిరి ఉండేది. ఉద‌యం ప‌ద‌కొండు గంట‌ల‌కు మీటింగ్ అంటే.. ప‌రుగులు ప‌రుగులు పెడుతూ ప్రోగ్రామ్ జ‌రిగే ద‌గ్గ‌ర‌కు చేరుకునే స‌రికి అక్క‌డంతా ఖాళీగా ఉండేది.

ఏందిలా అంటే.. కాస్త ఆల‌స్య‌మ‌వుతుంద‌న్న మాట‌ను చాలా సింఫుల్ గా చెప్పేసేటోళ్లు. ఉద‌యం ప‌ద‌కొండుకు స్టార్ట్ కావాల్సిన కార్య‌క్ర‌మం తీరిగ్గా.. మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌ల‌కు కానీ మొద‌ల‌య్యేది. ఇక‌.. సినిమా ఫంక్ష‌న్ల మాదిరే ఏర్పాట్లు ఉండేవి. వీటిని జీర్ణించుకోవ‌టం పొలిటిక‌ల్ రిపోర్ట‌ర్ల‌కు ఒక ప‌ట్టాన సాధ్య‌మ‌య్యేది కాదు. దాదాపు ఇదే త‌ర‌హాలో ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ల్యాణ్ పార్టీ జ‌న‌సేన‌లోనూ ఇలాంటి పరిస్థితే ఉంద‌న్న మాట‌ను ప‌లువురి నోట వినిపిస్తూ ఉంటుంది.

జ‌న‌సేన పార్టీ మొత్తం ప‌వ‌న్ క‌నుస‌న్న‌ల్లో ఉండ‌టం.. కిందిస్థాయి నాయ‌క‌త్వం లేక‌పోవ‌టం.. ఉన్న ఒక‌రిద్ద‌రు మీడియాకు అందుబాటులోకి లేక‌పోవ‌టం ఒక ఎత్తు అయితే.. కార్పొరేట్ త‌ర‌హాలో పార్టీ న‌డుస్తుంద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తూ ఉంటుంది. ఎప్పుడో ఒక‌సారి కానీ ప‌వ‌న్ మాట్లాడ‌క‌పోవ‌టం.. ఆ మాట‌కు వ‌స్తే సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులతో సంబంధాలు లేక‌పోవ‌టం ప‌వ‌న్ కు మాత్ర‌మే సాధ్యం.

ఈ రోజుకి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు కానీ.. తెలంగాణ రాష్ట్ర ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి సైతం ప‌లువురు సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుల‌తో చ‌క్క‌టి సంబంధాలు ఉన్నాయి. ప‌వ‌న్ విష‌యంలోనే స‌మ‌స్య అంతా. దీంతో.. ఆయ‌న ఆలోచ‌న‌ల‌కు.. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండాల్సిన మీడియాను ఆయ‌న వార‌ధిలా చూడ‌ర‌న్న విమ‌ర్శ త‌ర‌చూ వినిపిస్తూ ఉంటుంది.

ప‌వ‌న్ ఆలోచ‌న‌లు ఎలా ఉంటాయ‌న్న దానికి తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్యే నిద‌ర్వ‌నంగా చెప్పాలి.  ఆ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తుందా?  లేదా అన్న విష‌యంపై క్లారిటీ ఇవ్వాల‌ని  అడిగిన మీడియాకు ఆయ‌న ఇచ్చిన స‌మాధానం విన్న జ‌ర్న‌లిస్టుల‌కు నోట మాట రాని ప‌రిస్థితి.

ఎందుకిలా అంటే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ పోటీ చేయాలా?  వ‌ద్దా? అన్న విష‌యంపై త‌న నిర్ణ‌యాన్ని మ‌రో నాలుగైదు రోజుల్లో చెబుతాన‌ని తాపీగా స‌మాధాన‌మిచ్చారు. ఇప్ప‌టికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై అన్ని పార్టీలు అంత‌ర్గ‌తంగా ఏర్పాట్ల‌ను చేసుకోవ‌ట‌మే కాదు.. గ్రౌండ్ వ‌ర్క్ పూర్తి చేశాయి. ఇలాంటి వేళ‌.. తాను పోటీ చేసేది లేని విష‌యం మీద‌నే ప‌వ‌న్ ఇంకా నిర్ణ‌యం తీసుకోలేదంటే ఆయ‌న విజ‌న్ పై కొత్త సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. తాను ఏపీ ప‌ర్య‌ట‌న మొద‌లు పెట్టిన త‌ర్వాత తెలంగాణ‌లో ప‌ర్య‌టిద్దామ‌ని అనుకున్నాన‌ని.. అంత‌లోనే ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌చ్చేశాయ‌ని చెప్పారు. వాస్త‌వానికి.. తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల మీద కొద్ది నెల‌లుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. మీడియా ద‌గ్గ‌రే ఇంత స‌మాచారం ఉంటే.. ప‌వ‌న్ కు వ్య‌క్తిగ‌తంగా ఉండే సంబంధాల నేప‌థ్యంలో ఆయ‌న‌కు స‌మాచారం లేకుండా ఉంటుంద‌న్న‌ది ఒక ప్ర‌శ్న‌. ఒక‌వేళ నిజంగానే స‌మాచారం లేద‌నుకుందాం. అంచ‌నా అయితే ఉంటుంది క‌దా?  అది కూడా లేద‌నే అనుకుందాం.. కనీసం ప్లాన్ ఏ.. ప్లాన్ బి అన్న‌ది ఉంటుంది క‌దా. అలా కూడా లేదంటే.. ప‌వ‌న్ ను.. ఆయ‌న పార్టీ గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.

రాజ‌కీయాల‌న్న‌వి సినిమా కాద‌ని.. మూడ్ లేద‌ని ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ చేసినా.. క‌మిట్ మెంట్ ప్ర‌కారం పూర్తి చేసే వీలుంటుంది. కానీ.. ఎన్నిక‌లు.. పోటీ అన్న‌ది ఒక వ్య‌వ‌స్థ తీసుకునే నిర్ణ‌యాల‌కు త‌గ్గ‌ట్లు మారుతూ ఉంటాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో నిర్ణ‌యాలు తీసుకోవ‌టంలో ఆల‌స్యం జ‌రిగితే.. దానికి మూల్యం భారీగా చెల్లించాల్సి ఉంటుంది. నిజానికి ఇలాంటి విష‌యాలు కూడా ప‌వ‌న్ కు తెలీకుండా ఉంటాయా?
Tags:    

Similar News