పవన్ పుణ్యం:సాయం కోసం వస్తే..దిక్కులేదు!

Update: 2017-08-01 00:30 GMT
పవన్ కల్యాణ్ , ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలవడానికి వస్తున్నారంటే అక్కడికేదో అండపిండ బ్రహ్మాండాలు బద్ధలైపోతున్నట్లుగా ఇవాళ అమరావతిలో, వెలగపూడిలో ఆర్భాటం కనిపించింది. పవన్ కల్యాణ్ ఎంచక్కా తన ప్రెవేటు సెక్యూరిటీ తో చంద్రబాబు ఉన్న సచివాలయ బ్లాక్ లోకి ఠీవిగా వెళ్లిపోగలిగారు. సర్లే.. అదంతా వారిద్దరికీ సంబంధించిన విషయం అని సరిపెట్టుకోవచ్చు. కానీ.. సాయం అర్థించి వచ్చిన నిరుపేదల బతుకుల్ని కూడా బజార్న పెట్టేయడం లాగా ఈ సందర్భంగా అరాచకంగా వ్యవహరించడమే  శోచనీయం. పవన్ కల్యాణ్ రాక సందర్భంగా కాస్త అతిశయంగా జరిగిన భద్రత ఏర్పాట్ల వల్ల, మాకిక వేరే గతిలేదు బాబూ.. అనుకుంటూ ప్రభుత్వ సాయం అర్థించి వచ్చిన నిరుపేదలు కూడా అనేకమంది ఉన్నారు.

పవన్ కల్యాణ్ వచ్చిన సీఎం బ్లాక్ లోనే.. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సాయం అర్థించే వారి అప్లికేషన్లను కూడా స్వీకరిస్తారు. వివిధ  రకాల రోగ గ్రస్థులు, రుగ్మతలతో బాధపడుతున్న వారు.. వ్యక్తిగతంగా తమ వైద్య ఖర్చులను తాముగా భరించగల స్థోమత లేనివారంతా సీఎం నిధి నుంచి సాయం కోసం ఇక్కడకు వచ్చి దరఖాస్తు చేసుకుంటారు. ఇలాంటి ఆర్తులకు పేదలకు సోమవారం చేదు అనుభవం తప్పలేదు. పవన్ కల్యాణ్ వస్తున్నాడు గనుక.. వారినంతా చాలా గంటలపాటూ ఆ బ్లాక్ సమీపానికి కూడా రానివ్వలేదు.

కేవలం వీరు మాత్రమే కాదు.. పవన్ కల్యాణ్ భద్రత ఏర్పాట్ల పుణ్యమా అని సెక్రటేరియేట్ విధులకు వెళ్లే ఉద్యోగులకు కూడా కొన్ని ఆంక్షలు తప్పలేదు. ఈ వ్యవహారం అంతా చాలా అతిగా ఉన్నదని.. ఎవరిని ప్రసన్నం చేసుకోవడానికో ఈ వైఖరి అని ఉద్యోగులు బాహాటంగానే మాట్లాడుకోవడం విశేషం.
Tags:    

Similar News