పవన్ మరో సంచలనం.. టీడీపీకి టాటా?

Update: 2015-08-22 08:28 GMT
పవన్ కళ్యాణ్ కు, తెలుగు దేశం పార్టీకి మధ్య దూరం కొంచెం కొంచెం పెరిగి పెద్ద అగాథమే ఏర్పడినట్లుంది. మొన్నటిదాకా సుతి మెత్తగా తన మిత్ర పార్టీని హెచ్చరిస్తూ వచ్చిన పవన్ ఇప్పుడు పూర్తిగా స్వరం మార్చాడు. నేరుగా వారిపై యుద్ధం ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి. యనమల మీద రివర్స్ కౌంటర్ వేసినపుడే.. పవన్ తెలుగు దేశం పట్ల చాలా ఆగ్రహంగా ఉన్న సంగతి జనాలకు అర్థమైంది. జనసేన అధినేత తాజా ట్వీట్ ను బట్టి చూస్తే తెలుగు దేశం పార్టీతో స్నేహ బంధానికి ఆయన దాదాపుగా తెరదించేసినట్లే కనిపిస్తోంది.

‘‘ఓ పార్టీ విధానాలు దేశ ప్రయోజనాలతో ముడిపడినపుడు ఓ రాజకీయ పార్టీకి విధేయుడిగా ఉండటం ధర్మం. కానీ ఓ రాజకీయ పార్టీ విధానాలు, చర్యలు దేశానికి నష్టం చేస్తుంటే.. వారికి విధేయుడిగా ఉండటం దేశ ద్రోహం లాంటి నేరంతో సమానం. దేశప్రయోజనాలే రాజకీయాల పరమావధి కావాలి’’ అంటూ ప్రఖ్యాత న్యాయవాది, భారతీయ జనతా పార్టీ మాజీ నేత రామ్ జెఠ్మలానీ చేసిన కామెంట్ ను ట్విట్టర్ లో షేర్ చేశాడు పవన్. అంటే తన ఉద్దేశం కూడా ఇదే అని పరోక్షంగా పవన్ స్పష్టం చేసినట్లే అనుకోవాలి. ఇక తానెంత మాత్రం తెలుగు దేశం పార్టీకి విధేయుడిగా ఉండబోనని పవన్ చెబుతున్నట్లే కనిపిస్తోంది.

తెలుగుదేశం పార్టీ ప్రయోగిస్తున్న భూసేకరణ విధానాన్ని ఉద్దేశించే పవన్ ఈ ట్వీట్ చేసినట్లు భావించవచ్చు. అంటే ఆ పార్టీ విధానాలు దేశానికి నష్టం చేసేలా ఉన్నాయని.. పవన్ చెప్పకనే చెప్పేస్తున్నాడు. రాజధాని ప్రాంతంలో త్వరలోనే రైతుల్ని కలుస్తానని ప్రకటించిన నేపథ్యంలో పవన్ తెలుగుదేశం పార్టీపై యుద్ధానికి సిద్ధమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి ఓ సూచికలా తాజా ట్వీట్ ను భావించవచ్చు.
Tags:    

Similar News